సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -162
భారైక దేశావతరణ న్యాయము
******
భారక అంటే బరువు మోయువాడు,కూలి వాడు అని అర్థం.
ఐక అంటే పూర్ణము,సమగ్రము.దేశ అంటే ప్రదేశము ప్రాంతము,దేశము.అవతరణం అంటే దిగుట అని అర్థం.
ఈ భారమూ, (భారైక) దేశావతరణమూ ఇదంతా ఏమిటబ్బా అనిపిస్తుంది కదా! 
 ఇందులో ఏమీ లేదు.నెత్తి మీద, మనసులో ఉన్న బరువులో కొంత బరువును తీసివేయుట అని అర్థం.అనగా ఏ పనినైనను సులభతరం చేసుకోవడం అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 అనేక మానసిక శారీరక ఒత్తిడుల బరువులను మానవులుగా మనం నిత్యం మోస్తుంటాం. వాటిని తెలివిగా ఎప్పటికప్పుడు దించుకోవాలి.అప్పుడే మనం తేలికగా,అ హుషారుగా ఉండగలం. నిర్లక్ష్యం, బద్ధకం పనికి రాదు అనే అర్థం ఈ న్యాయములో ఇమిడి ఉంది.
"పాటు పడని వానికి చేటు తప్పదు.అన్నీ అలవోకగా జరిగిపోవాలనుకున్న సోమరికి ఆయాసం తప్పదు.గోరంతలు ఉన్న పాఠాలను  ఎప్పటికప్పుడు చదవకపోయినా, పాఠాలకు సంబంధించిన ఇంటి పని చేయకపోయినా  అవి కొండంత బరువుగా మారి  విద్యార్థుల మీద ఒత్తిడి పెరగడంతో తోటి వారిలో వెనుకబడి పోవడము, వాళ్ళు మానసికంగా కృంగి పోవడం జరుగుతుంది.
కాబట్టి ఎప్పటి భారాన్ని  అప్పుడే దించుకోవాలి, తగ్గించుకోవాలి.
అయితే ఈ బరువులను దించుకోవడానికి హడావుడి, తొందరపాటు తనం కూడా పనికి రాదని చెప్పిన సుమతీ శతక పద్యాన్ని చూద్దాం.
తడవోర్వక యొడలోర్వక/ కడువేగం బడిచిపడిన గార్యంబగునే/ తడవోర్చిన నొడలోర్చిన/ జెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతీ!"
ఆలస్యానికి,దేహ శ్రమకు సహింపక తొందరపడిన యెడల యే కార్యమును సాధించ లేరు. కాస్త ఓపికతో ఆలస్యమును, దేహ శ్రమకు ఓర్చుకున్నట్లయితే చెడిపోయిన పనులు కూడా సరియవుతాయి.
కాబట్టి  ఆయా పరిస్థితులకు అనుగుణంగా వెంటనే స్పందిస్తూ తగు నిర్ణయాలు తీసుకుని మనసులోని భారాన్ని, శారీరక భారాన్ని  తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనసు,శరీరం రెండూ తేలికై నిశ్చింతగా ఉండొచ్చు.
 అదండీ "భారైక దేశావతరణ న్యాయము" యొక్క లోగుట్టు. తెలిసింది కాబట్టి మనమూ ఆవిధంగా భారాలను తగ్గించుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు