66.ఆ.వె.
చివరి రెమ్మ వరకు చిరకాలమందించి
లోన తాము నిలిచె లోక మందు
నీళ్ళ నిచ్చు వేళ్ళు నిరుపమానముగదా
సౌమ్య గుణము విడక సాగవలయు !!
67.ఆ.వె.
మానవతను నీవు మహిలోన నిలుపుచు
మంచి చేయు మెపుడు మారకుండ
అవని లోని వారు ఆరాధ్య జీవులు
సౌమ్య గుణము విడక సాగవలయు!!
68.ఆ.వె.
కన్న వారు కన్న కలలు నిజము జేసి
అత్త వారి మాట లాదరించి
వంశ కీర్తి నిలిపి వంశాంకురమునివ్వు
సౌమ్య గుణము విడక సాగవలయు !!
69.ఆ.వె.
ఫలము లిచ్చు చెట్లు పాడుజేయవలదు
పచ్చ నైన చేలు పంట లిచ్చు
ప్రాణి కోరు గాలి ప్రాణవాయువుసుమీ
సౌమ్య గుణము విడక సాగవలయు !!
70.ఆ.వె.
కష్ట పడిన ధనము కదిలివచ్చినిలుచు
నరులు మెలగ వలెను పరుల కొరకు
పరుల ధనము పైన పాపచింతన లేల
సౌమ్య గుణము విడక సాగవలయు !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి