విద్యార్థులం మేం;- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.- సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
విద్యార్థుల మేం విద్యార్థులం
విద్యార్జనే మా మూలధనం
బడికి పోతాం ప్రతినిత్యం
చదువే మా జీవిత లక్ష్యం !

మా గురువు మాటను వింటాం
చదువు బాటను కనుగొంటాం
అందరితో కలిసిమెలిసి ఉంటాం
ఐకమత్యమే మా బలమంటాం !

పడిలేచే ఉద్వేగ తరంగాల్లా
వడిగల ఉత్తేజ తురంగాల్లా
మా విత్తం విజ్ఞానం విందుకు
కదులుతాం సాధించేటందుకు !

స్నేహదీపాలను వెలిగిస్తాం
ద్రోహ పాపాలను కరిగిస్తాం
మంచితనాన్ని పెంచేస్తాం
మానవత్వాన్ని పంచేస్తాం !

కులాల గోడలను మేం కూల్చేస్తాం
మతాల కితాబులనూ కాల్చేస్తాం
ఇక నీతి నియమాలను పాటిస్తాం
చెకచెక శాంతి ప్రశాంతికి చోటిస్తాం !

క్రౌర్యానికి సమాధి కడతాం
శౌర్యానికి పునాది పెడతాం
చైతన్య స్ఫూర్తిని కలిగిస్తాం
జైత్రయాత్ర కొనసాగిస్తాం !

మా బడిలో బాజా కొట్టేస్తాం
మేం గుడిలో పూజ పెట్టిస్తాం
దేవుడే దిక్కని అంటుంటాం
ఆ దేవుని ప్రార్థన చేస్తుంటాం !

చేయి చేయి  మేం కలుపుకుంటాం
బ్రతుకు బాటను మలుపుకుంటాం
మా ఇష్ట సఖులను కలుసుకుంటాం
 కష్టసుఖాలను తెలుసుకుంటాం. !
 
విద్యా సదస్సుల జరిపిస్తాం
విద్యాభిమానుల మురిపిస్తాం
ఇక ఉరివారందరూ  వస్తారు
చెకచెక కానుకలను ఇస్తారు !

విజ్ఞాన యాత్రలు చేస్తాము
దేశవిదేశాలను చూస్తాము
దేశమాతను పూజిస్తాము
దేశవాసులను ప్రేమిస్తాము !

ముళ్ళబాటల తుంచేసి
పూలబాటలను  పెంచేసి
 అనుకున్నదాన్ని సాధిస్తాం
 అందరిని మేం మెప్పిస్తాం !


కామెంట్‌లు