సునంద భాషితం ;- వురిమళ్ల సునంద,ఖమ్మం
 న్యాయాలు -205
మేష పుచ్ఛ న్యాయము
******
మేషము అంటే మేక, పొట్టేలు, మేషరాశి అనే అర్థాలు కలవు.పుచ్ఛము అంటే తోక, వెనుక భాగము, నెమలి తోక అనే అర్థాలు ఉన్నాయి.
మేక ఎంత బలిసినా తోక బెత్తెడే. దీనిని తెలుగులో "గొర్రె తోక బెత్తెడే" అనీ "గొర్రె ఎంత పెరిగినా తోక బెత్తెడే"అని అంటుంటారు.
ఈ న్యాయాన్ని/సామెతను ఎక్కువగా సగటు ఉద్యోగస్తులకు/ మధ్య తరగతి జీవితాలకు వర్తింప చేసి చెబుతుంటారు.
 అరకొర సంపాదన మీద ఇంటిల్లిపాదీ బతికే  సమయంలో ,బోనస్ గానో,మరే విధంగానో డబ్బు సమకూరినా,ఎంత  విరామం లేకుండా కష్టపడినా ఇంటి పరిస్థితులు ఏమీ మారవు. ఆ యజమాని ఆరాటమే కనబడుతుంది కానీ ఆదాయంలో మార్పు రాదు. ఒక వేళ అలాంటి సమయంలో జీతం పెరిగినా, పెరిగిన ధరలతో  ఆర్థిక అవసరాలతో జీవితం మారలేదనే అర్థంతో ఈ "మేష పుచ్ఛ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
 విషయానికి వస్తే "మేష పుచ్ఛమని"  సంస్కృతంలో స్పష్టంగా ఉన్నా దానిని తెలుగులో వచ్చే సరికి గొర్రె తోక అనడం విశేషం.గొర్రె తోక అయినా మేక తోక అయినా దాని వల్ల  ఆ గొర్రెకు గానీ, మేకకు గానీ ఎలాంటి ఉపయోగం లేదు.వాటి శారీరక పరిమాణం పెరిగినా తోక మాత్రం పెరగకుండా అలాగే ఉంటుంది.


 బూదరాజు రాధాకృష్ణ గారు తాను రాసిన తెలుగు జాతీయాలలో "మేష పుచ్ఛము"గురించి ఏం రాశారో చూద్దాం.
 మేష పుచ్ఛము అంటే గొర్రె తోక.నిష్ఫలం, నిరుపయోగం అనే అర్థంతో ఈ మాటను వాడుతుంటారు. మిగతా జంతువుల్లాగా తన తోకతో విసురుకోవడం కుదరదు.పురుగుల్ని తోలటానికి పనికి రాదు.అయినా సరే గొర్రె తోక అవిరామంగా,కప్ప గొంతులాగా విశ్రాంతి లేకుండా ఉంటుంది.పనికి రాని ఉత్తిత్తి అరుపుల్లాగా, పనికి మాలిన కదలిక తప్ప  మరేమీ లేనప్పుడు ' అతగాడా మేష పుచ్ఛమనుకోండి'అని వెటకారం చేస్తుంటారని" రాశారు.
 ఒకప్పుడు ఉపాధ్యాయ వృత్తిలో చేరిన వారికి జీతాలు సరిగా ఉండేవి కావు. అప్పట్లో కుటుంబం కూడా పెద్దదిగా ఉండేది. గుట్టుగా సంసారాన్ని సాగించడం కష్టంగా ఉండేది.
అలాంటి పంతులును చూసి సమాజం లోని వాళ్ళు సానుభూతి చూపుతూ 'గొర్రె తోక బెత్తెడు జీతంతో 'ఎలా నెట్టుకొస్తున్నాడో ఏమో! "పాపం‌ బతకలేని బడిపంతులు" అనే వాళ్ళు.
అలా  ఎంత కష్టపడినా మారని జీతము, జీవితంతో కాల మాన పరిస్థితులకు అనుగుణంగా ప్రయాణం చేసే వ్యక్తులను ఈ "మేష పుచ్ఛ న్యాయము"తో పోల్చవచ్చు.
 ఇప్పుడు కూడా మన చుట్టూ ఉన్న సమాజంలో  అలా జీవితాన్ని గుంభనంగా ,ఈ న్యాయములా గడిపే వారు తారస పడుతుంటారు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు