సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -201
మృగభియా సస్యా నాశ్రయణ న్యాయము
*****
మృగము అంటే చతుష్పాద జంతువు, లేడి కస్తూరి,వెదకుట అనుసరణము, ప్రార్థన మృగశీర్ష నక్షత్రము అనే అర్థాలు ఉన్నాయి.అభియా అంటే శత్రువు ,ఒప్పని వాడు,అమిత్రుడు . నాశ్రయణము అంటే ఆశ్రయించుట అని అర్థం,భియా అంటే భయము.
 
పంటను ఆశ్రయించి బతికే పశువులు ఆ పంటను తినేస్తాయేమో ననే భయముతో పొలములలో పైరు వేయడయే మానేసినట్లు అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
భిక్షుకుడి భిక్ష పెట్టవలసి వస్తుందని ఒకావిడ వంట చేయడమే మానేసిందన్నట్లు"  పంట పొలాలను సంరక్షించుకోలేక పశువులు మేస్తాయనే వంకతో పంట పండించడం మానేశాడట ఒకాయన.
అంటే ఇతరులకు పెట్టవలసి వస్తుందని తాము కూడా కడుపు మాడ్చు కోవడం.ఇది  వ్యక్తి యొక్క పిసినారి తనానికి, స్వార్థానికి, సోమరి తనానికి భూతదయ లేదనడానికి మచ్చుతునకగా చెప్పుకోవచ్చు.
 అందుకే ఇలాంటి వ్యక్తులను గుర్తించి వారిపై  కాకుత్సం శేషప్ప కవి గారు రాసిన పద్యాన్ని చూద్దామా...
లోకమందెవడైన- లోభి మానవుడున్న/ భిక్షమర్థికి జేత పెట్ట లేడు/తాను పెట్టకున్న తగవు పుట్టదు గాని - యొరులు పెట్టగ జూసి యోర్వలేడు"  
ఇలా యాచకులకు భిక్షం తాను పెట్టక, ఇతరులు పెడితే కూడా ఓర్వలేని వ్యక్తులు కొందరు ఉంటుంటారు.
అలాంటి గుణాలు కలిగి ఉన్న వాళ్ళు ఈ "మృగభియా సస్యా నాశ్రయణ న్యాయానికి" సరిగ్గా సరిపోతారు.
అందుకే  అవి మానుకోవాలని, తాము అలాంటి మంచి పనులు చేయకున్నా చేసేవారిని చేయనిస్తే చాలని హితవు చెబుతూ , ఇలా అంటారు.
"హరిదాసులను నిందలాడకుండిన చాలు- సకల గ్రంథంబులు చదివినట్లు/ భిక్షమియ్యగ ద-ప్పింప కుండిన చాలు - జేముట్టి దానంబు-  చేసినట్లు/ మించి సజ్ఝనుల వం-చింపకుండిన జాలు -నింపుగా బహుమాన మిచ్చినట్లు/ దేవాగ్రహారముల్- దీయకుండిన జాలు/గనక కంబపు గుళ్ళు - గట్టినట్లు
తే"ఒకరి వర్శాననము ముంచ కున్న జాలు/బేరు కీర్తిగ సత్రముల్ - పెట్టినట్లు/భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస!/దుష్ట సంహార! నరసింహ దురిత దూర!"
 కాబట్టి మానవ జన్మ ఎత్తిన మనం అలాంటి‌ పనులు చేయకూడదనీ, మనలో కొంచెమైనా భూత దయ, పరోపకార బుద్ది ఉండాలని  గ్రహించాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు