నేను డబ్బు కొట్టేసాను;- - యామిజాల జగదీశ్
 అప్పుడెప్పుడో చిన్నప్పుడు హుండీలోంచి చిల్లర పైసలు కాజేసిన విషయం ఇప్పటికీ మరచిపోలేదు. అలాంటిదే ఇప్పుడు కూడా చేశాను. కానీ ఓ చిన్న తేడా ఉంది. అప్పుడు అది నా హుండీ కాదు. మద్రాసులో మేము తిలక్ స్ట్రీటులో ఉన్నప్పుడు మా పక్క వాటాలో ఓ కన్నడం వాళ్ళు ఉండేవారు. వారింట ఓ హుండీ ఉండేది. అదేమీ పెద్ద హుండీ కాదు. కానీ చిల్లరపైసలతో బరువుగా ఉండేది. ఇద్దరికీ బ్యాకరీలో బన్ బటర్ జామ్ తినాలనిపించింది. అప్పట్లో అది పావలా ఉండేదని గుర్తు. మా దగ్గర డబ్బులు లేవు. కానీ బన్ బటర్ జామ్ తినాలన్న ఆశను ఎలా తీర్చుకోవాలి....అప్పుడు వారింట ఉన్న శ్రీనివాస్ హుండీ విషయం చెప్పాడు. ఇంకేముంది ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఇంటికి తలుపులు వేసేసాం. ఓ కొబ్బరి పుల్ల తీసుకుని హుండీలోంచి చిల్లర పైసలు తీసుకున్నాం. మాక్కావలసిన డబ్బులు తీసుకున్నాక హుండీని మళ్లీ యథా ప్రకారం అది ఉండవలసిన చోట పెట్టేశాం. అనంతరం ఇద్దరం కలిసి న్యూబజారులో ఉన్న బ్యాకరీకి వెళ్ళి బన్ బటర్ జామ్ చెరొకటి కొనుక్కుతిన్నాం. అదిప్పటికీ ఎప్పటికీ మరచిపోలేని విషయం. అయితే ఇప్పుడు ఓ ఆరు ఇడ్లీలు కొనడానికి నలబై అయిదు రూపాయలు కావాలి. కానీ నా దగ్గరేమో ఇరవై రూపాయలు ఉన్నాయి. ఇంకో ఇరవై అయిదు రూపాయలు కావాలి. ఏం చేయాలో తెలీలేదు. అప్పుడు ఓ ఆలోచన మెరిసింది. విషయానికి వస్తాను.
మా ఆవిడకు అప్పుడప్పుడు అయిదు రూపాయలు, రెండు రూపాయలు, రూపాయి నాణాలు ఇస్తుంటాను. తను వాటిని ఓ చిన్నపాటి ప్లాస్టిక్ డబ్బాలో దాచుకుంటుందని తెలుసు. నిజానికి తనకు చెప్పి అందులోంచి ఇరవై అయిదు రూపాయలు తీసుకోవచ్చు. కానీ అడగడానికి మనసు ఒప్పుకోని మనసు అందులో చిల్లరపైసలు కొట్టేయమని చెప్పింది. ఇంకేముంది, తనకు తెలియకుండా అయిదు రూపాయల రూపాయల నాణాలు ఓ అయిదు చడీచప్పుడు కాకుండా కొట్టేశాను. ఆ విషయం తర్వాత చెప్దామనిపించింది. కానీ ఇప్పటి వరకూ చెప్పలేదు. కాజేసిన ఆ అయిదు రూపాయల నాణాలు మనసులో ఘోషిస్తున్నాయి. ఎందుకో చెప్పే ధైర్యం చాల్లేదు. పాపం, తనింకా అందులో ఆ ఇరవై అయిదు రూపాయలు ఉన్నాయనే అనుకుంటోందో ఏమిటో...కానీ అవి ఖర్చయిపోయాయి. తనతో చెప్ప డబ్బాలోంచి దర్జాగా చిల్లరపైసలు తీసుంటే ఈ గొడవ ఉండేది కాదు. కానీ కిటీకీ దగ్గర ఉన్న డబ్బాని చూస్తున్నప్పుడల్లా అందులోంచి కొట్టేసిన అయిదు రూపాయల నాణాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి.
కొసమెరుపు ఏమిటంటే, ఇరవై అయిదు రూపాయలు కొట్టేసిన రోజు సాయంత్రం నాకొక పత్రిక నుంచి అయిదు వందల రూపాయలు వచ్చాయి. ఈ సొమ్మేదో ఉదయమే అంది ఉంటే బాగుండేది కదా...ఇరవై అయిదు రూపాయలు కొట్టే అవసరం ఉండేది కాదు కదా. అంతే. ఒక్కొక్కప్పుడు పరిస్థితులు ఎలా ఎదురవుతాయో చెప్పలేమంటే ఇదేనేమో. చిన్నప్పుడు ఓ యాబై పైసలు కొట్టేసిన సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు కొట్టేసిన ఇరవై అయిదు రూపాయలు నా మనసుని దెప్పి పొడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ విషయం తనకు చెప్పాలనిపించడం లేదు... ఎందుకో తెలీలేదు.  
   

కామెంట్‌లు