సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -200
మూషక విషాణ న్యాయము
*****
మూషకము అంటే ఎలుక లేదా చిట్టెలుక.విషాణము అంటే కొమ్ము.
ఎలుకకు కొమ్ములు పుట్టినట్లుగా.
ఎలుకకు కొమ్ములు పుడతాయా పుట్టవు కదా !అయితే అవయినా పుట్టించవచ్చేమో కానీ పరమ మూర్ఖులైన వారిని మార్చలేము అనే అర్థంతో ఈ "మూషక విషాణ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
ప్రపంచంలో ఎనిమిదో వింతగా ఎలుకకు ఏమైనా కొమ్ములను మొలిపించ వచ్చేమో కానీ ప్రతిదానికీ విపరీతార్థం తీసుకుని, అసలు నిజాలను నమ్మకుండా,లేని వాటిని ఉన్నట్లుగా భావించే మిడి మిడి జ్ఞానం ఉన్న వారిని ఏవిధంగానూ మార్చలేము అనే అర్థం ఇందులో యిమిడి వుంది.
తాబట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే వ్యక్తినీ, కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా తానే గొప్పని తలచే మూర్ఖుడిని గురించి రాసిన వేమన పద్యాన్ని చూద్దామా!.
 "బిడియమింత లేక పెద్దను నేనంచు/బొంకములను బల్కు  సంక ళ్చునకు/ ఎచ్చు కలుగు దిచట జచ్చిన రాదట/ విశ్వధాభిరామ వినురవేమ!"
మూర్ఖుడు తనకు తానే పెద్ద గొప్పవాడినని భావిస్తూ,అంతా తనకు తెలుసునని బింకాలు పోతుంటాడు.కానీ అటువంటి వాడికి ఏమీ తెలియదు,శూన్యం అనే విషయం అందరికీ తెలవడం వల్ల అతడికి ఇంటా బయటా ఎటువంటి మర్యాద ఉండదు. అలాంటి మూర్ఖుడు చచ్చినా గౌరవం పొందలేడు.మన  గొప్పతనం గుర్తించడం,  గౌరవం పొందడం అనేవి ఇతరులు ఇచ్చేవి కానీ మనకు మనము ఇచ్చుకునేవి కాదని" అంటారు వేమన.
అంతే కదా! తాను చేసేదే మంచియని భ్రమించే వారు,తను చెప్పిందే నిజం అని  భావించే వారు,తమదైన  భావజాలంతో ఇతరులను ఇబ్బంది పెట్టేవారు.ఎలుకకు కొమ్ములు పుట్టించే లాంటి వారే... అంటే ఒక రకంగా మానసికమైన లోపంతో ఉన్న వారేనని అర్థం చేసుకోవచ్చు.
అలాంటి వారిని చూసి జాలిపడి నవ్వుకోవడమో , వారికి దూరంగా ఉండటం శ్రేయస్కరం.ఎందుకంటే అలాంటి వారిని భరించడం కూడా కష్టమే మరి!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు