సుప్రభాత కవిత ; - బృంద
కొండల్లో  కోనల్లో
కొత్తగ విరిసే వెలుగుపువ్వు
గుండెల్లో లోతుల్లో
మెత్తగ  తెచ్చెను చిన్నినవ్వు

వెలుగుల దారాలతో
జిలుగుల చీరనేసి
చెలువార చెలిమితో
కలికి ధరణి మేన సింగారింప

పరుగుపరుగున
మేఘమాలల దాటుతూ
చెంగుచెంగున  తుళ్ళుతూ
గిరుల వరుసలు తాకుతూ

కినుకగా చూసే కొండవాగులకు
కానుకగా కాసిన్ని మెరుపులందించి
కిలకిలా నవ్విన జలములకు
ముదమార  ముసిముసిగ ముద్దుపెట్టి

మరకతమ్ముల మధ్య
మాణిక్యములు దాచి
కులుకులొలుకు సిరుల
పంటచేలకు పసిడి వన్నెలద్ది

ఇలను చేర... కలలు తీరగ
కనుల పండువగా
కరములు జోడించి 
కళ్ళ జ్యోతుల హారతి పట్టె ధరణి

కమనీయమైన వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు