న్యాయాలు -194
మార్జాల శీల న్యాయము
*****
మార్జాలము అంటే పిల్లి.శీలము అంటే ప్రవర్తన లేదా నడత అని అర్థము.మార్జాల శీలము అంటే పిల్లి నడత లేదా పిల్లి ప్రవర్తన.
పిల్లి నడత ఎలా ఉంటుందో గమనిస్తే,అది ఏమీ ముట్టుకోనట్లు చాలా నియమ నిష్ఠతో ఉన్నట్లు కనిపిస్తుంది.కానీ కొంచెం కనుమరుగు కాగానే ప్రతి దాంట్లో మూతి పెడుతుంది. దానికి ఇష్టమైనవైతే ఎవరూ లేనిది చూసి తింటుంది.
అంటే పదిమందికి తెలిసేటట్లు పైకి మంచిగా ప్రవర్తించడం లోలోపల తనలోని అసలైన కోరికలు, ఆలోచనలకు అనుగుణంగా నడుచుకునే వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ మార్జాల శీల న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
స్వభావ సిద్ధమైన గుణాలను తెలియజేసేది శీలము.కొందరిలో బయటికి కనిపించినంత మంచితనం లోపల ఉండదు.అంటే పైకి అలాంటి ముసుగు వేసుకుని అందరిలో మంచి అనిపించుకుంటుంటారు.
మనిషి తన మనసులోపల రహస్యంగా చేసే ఆలోచనలే శీలంలో భాగం. అవి మంచివా? చెడువా? కనిపెట్టడం అంత తొందరగా సాధ్యపడదు. దీర్ఘకాలం ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉంటే ఎంతో కొంత తెలుసుకోవచ్చు.
లోలోపల మంచి శీలం ఉన్న వ్యక్తులు బయటి ప్రలోభాలకు లొంగకుండా తాను నమ్మిన విలువలకు కట్టుబడి ఉంటారు.వాటిని కాపాడుకోవడానికి బతుకంతా ప్రయత్నిస్తారు.అలాంటి శీలసంపద కలవారు లోకంలో చాలా తక్కువ మంది ఉంటారనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
బాహ్య ప్రవర్తన, అంతర్ ప్రవర్తన వేరు వేరుగా ఉండే పిల్లి శీలం లాంటి వారే మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటారు.
ఈ ప్రస్తావన తెనాలి రామకృష్ణుడు రాసిన పాండురంగ మహాత్మ్యంలో రావడం విశేషం.తెలుగు పంచ మహా కావ్యాలలో పాండురంగ మహాత్మ్యం ఒకటి.దీనిలో "నిగమశర్మోపాఖ్యానము" అనేది ఉంది.
ఇందులో 'నిగమ శర్మ'ను గురించి ప్రస్తావిస్తూ నిగమ శర్మది 'పిల్లి శీలం' అంటాడు.
కారణం అతని పేరులో నిగములు అంటే వేదములు అని వుంది. కానీ అతనికి అనేకమైన పాడు బుద్ధులు ఉన్నాయి కాబట్టి అతడిని "పిల్లి శీలం" లాంటి వాడు అంటాడు.
అంటే పైకి అయిష్టత నటిస్తూ, తీవ్రమైన వ్యతిరేకతను కనబరుస్తూ లోలోపల తనకు కావలసిన కోరికలు తీర్చుకునే వ్యక్తిగా నిగమ శర్మ ఉండటం వల్ల అతని గురించి ఆ మాట అంటాడు.
మరి అలాంటి వ్యక్తి మనకు తారసపడినప్పుడు 'అబ్బో ! అతడిది మార్జాల శీలం" అనుకోకుండా ఉంటామా? ఈ న్యాయము ఠక్కున గుర్తుకు రాకుండా ఉంటుందా చెప్పండి!
ఇదండీ మార్జాల శీల న్యాయము యొక్క కథా కమామీషు.
ఇలాంటి ఎన్నో రకాల న్యాయాలను ప్రకృతిలో పరిశీలించి, మానవులకు అన్వయిస్తూ మనకు అందించిన పూర్వ తరం వారికి నమోవాకములు తెలియజేసుకుందాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి