*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0285)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
విదులుడు, ఉత్పలుడు - రాక్షసులు - పార్వతిని మోహించుట - కందుక ప్రయోగము - కందుకేశ్వరుని స్థాపన - మహిమ ........
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*భగవంతుడు అయిన శంభుడు, తన హృదయేశ్వరి సహాయము తీసుకొని కూడా కొంతమంది దైత్యులను సంహరించారు. ఎంతైనా, వారు ప్రకృతీ పురుషులు కదా! ఒకరిని ఒకరు పరిపూర్ణంగా సమర్ధించుకుంటూ, దుష్ట శిక్ణ, శిష్ట రక్షణ చేస్తూ ఉంటారు.*
*విదులుడు, ఉత్పలుడు అనే రాక్షస రాజులు ఇద్దరూ, మహా బలవంతులు. వారు చేసిన ఘోరమైన సుదీర్ఘమైన తపస్సు ఫలంగా, ఏ పురుషుని చేతిలోనూ మరణం లేకుండా వరం పొందుతారు. ఇక వీరు, వారి జన్మ విరోధులైన దేవతల మీద దండెత్తి అందరినీ ఓడించి, అనేకమైన బాధలు పెడుతున్నారు. దేవతలు అందరూ, బ్రహ్మ నైన నావద్దకు వచ్చి, తమ బాధలను ఏకరువు పెట్టి, తమకు రక్షణ కలిపించమని వేడుకుంటారు. అప్పుడు నేను, ఆద్యంత రహితుడు, సర్వకారణ కర్త అయిన ఆదిదంపతులను భక్తి పూర్వకంగా కొలిచి శరణు వేడమని చెప్పాను. వారు, తమ తమ నివాసాలకు వెళ్ళారు. నేను కూడా శివ ధ్యానం చేస్తూ ఉన్నాను.*
*ఇలా ఉండగా, ఒక నాడు, లోక కల్యాణం కోసం, తంపులమారి అయిన నారదడు, ఈ దైత్య రాజుల ఇంటికి వెళ్ళి, శివునిలో సగ భాగమైన ఉమాదేవి అందాన్ని అత్యద్భుతంగా వివరించి పొగిడాడు. ఇంకేముంది, ఆ సుందరిని తాము పొంది తీర వలసిందే, అని నిశ్చయించి, పార్వతీ దేవి ఉన్న చోటికి వెళతారు. అక్కడ, అమ్మ, తన లీలా వినోదం లో భాగంగా, ఒక బంతి (కందుకము) తో అడుకుంటోంది, తన చెలికత్తెలతో. ఆ అమ్మను చూచిన రాక్షస రాజులు అపహరించడానికి సిద్ధం అవుతారు. ఇది, తెలుసుకున్న, సర్వ వ్యాపి అయిన చంద్రధరుడు, అమ్మకు కను సైగతో జరగబోయే విషయాన్ని తెలియ జేసారు. అమ్మ, తన భర్త సైగతో జాగరూకురాలై ఆ దైత్యుల మీదకు బంతిని విసురుతుంది. వజ్రాయుధం దెబ్బ తగిలినట్టుగా, ఉన్న చోట గిరగిరా తిరుగుతూ, నేల మీద పడి ప్రాణలను వదిలేసారు.*
*దైత్యరాజు లను అంతం చేసిన తరువాత, ఆ బంతి భూమి మీద, కాశీ పట్టణంలో జ్యేష్ఠేశ్వరుని పక్కకు వచ్చి, లింగ రూపంలో స్థిరంగా ఉంది. ఆ లింగమే, *కందుకేశ్వర లింగము*.  ఈ కందుకేశ్వర లింగము, దుష్టులను సంహరిస్తూ, మంచి వారికి భోగ భాగ్యములను, ముక్తిని అందిస్తూ ఉంటుంది.చివరకు, భక్తులు దివ్య మార్గంలో కైలా ప్రాప్తి పొందుతారు.*
*బ్రహ్మ, నారద సంవాదంలో, శివపురాణ మహాత్యం లో రుద్రసంహిత లోని "అయిదవ యుద్ధ కాండము సంపూర్ణము" అయ్యింది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు