ఝాన్సీ కొప్పిశెట్టి- చీకటి వెన్నెల-కథల సంపుటి - ప్రమోద్ ఆవంచ- 7013272452

 అమ్మ... అల్జీమర్స్ తో బాధపడుతూ జ్ఞాపకశక్తిని కోల్పోవడం... విధిలేని పరిస్థితుల్లో అమ్మను వృద్ధాశ్రమంలో చేర్పించి కుమిలిపోయే కూతురు..ఇంట్లో అమ్మ కర్ర పట్టుకుని తిరుగుతూ ఉంటే వచ్చే శబ్దం లేక నిశ్శబ్దం తాండవిస్తుంది.అమ్మ ఏ కుర్చీ లోనో
ఏ మంచం మీదో పడుకుందన్న భావనతో,వాటి వైపు చూస్తే మనసు ఖాళీతనమై వేధిస్తుంది.
ఇల్లంతా బోసిగా ఉండి శూన్య గృహాన్ని తలపిస్తోందాకూతురుకి.చివరికి చూడడానికి వచ్చిన తనను కూడా అమ్మ గుర్తు పట్టకపోవడం ఆ కూతురు గుండెను మెలిపెట్టే బాధ వర్ణనాతీతం.'మౌనరాగం' ఒక కథ కాదు... జీవితం.అద్బుతమైన భావోద్వేగాలతో మలిచిన కథ.
                      కవి,రచయిత్రి ఝాన్సీ కొప్పిశెట్టి గారి'చీకటి వెన్నెల' కథా సంకలనాన్ని ఈ మధ్య రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఆవిష్కరించారు.దీనితో పాటు'ఎడారి చినుకు' అనే దీర్ఘ కవితా సంపుటి కూడా ప్రముఖ రచయిత్రులు ఆవిష్కరించి ప్రసంగించారు.ఇందులోని,పదమూడు కథలు స్త్రీల అంతరంగానికి అక్షర రూపమే కాకుండా వాళ్ళ అంతర్మధనాన్ని వివిధ కోణాల్లో ఆవిష్కరించారు 
రచయిత్రి ఝాన్సీ కొప్పిశెట్టి.
                       పెళ్ళంటే..ముక్కూ ముఖం తెలియని ఒక ఆడ,మగకు,పెళ్ళి పేరుతో,మూడు ముళ్లు, ఏడడుగులు నడిపించి కాపురం చేయించడమేనా? అందులో ప్రేమ, అనురాగం, అర్థం చేసుకోవడం, బాధ్యతలు వంటివి కృత్రిమంగా అప్పటికప్పుడు 
అలవరుకొని ఏ గొడవలు లేకుండా గుట్టుగా సంసారం చేస్తూ,ఇద్దరి మధ్య ఎన్ని సమస్యలు ఉన్నా, ఆనందంగా ఉన్నామనీ ప్రపంచానికి చాటి చెపుతూ ఒక ఫాల్స్ ప్రిస్టేజిలో బతకడమేనా పెళ్ళంటే? నిజంగా చెప్పాలంటే,స్త్రీల మీద పురుషుల ఆధిపత్యమే పెళ్ళంటే.పెళ్లి అయితే ప్రేమ తగ్గిపోతుంది,ప్రేమ తగ్గిపోతే దూరం పెరిగిపోతుంది.మరి  'ప్రేమంటే'
కథలో రత్తాలుది.
                      భర్త వెంకటయ్య ఒక బిడ్డకు జన్మనిచ్చి, చనిపోవడంతో రత్తాలును విదవను చేసింది,సమాజం. ఆ తరువాత యాదయ్య తన జీవితంలోకి ప్రవేశించాడు.అతడు,రత్తాలుకి తీయని ప్రేమను రుచి చూపించాడు.ఆ పరవశంలో అతని వశం అయ్యింది రత్తాలు.పెళ్ళి అయి ఇద్దరు పిల్లలు ఉన్న యాదయ్యతో సహజీవనం చేస్తూ, అతని భార్య గౌరికి అన్యాయం చేయడం తప్పు అని తెలుసో,తెలియదో కానీ రత్తాలు ప్రేమలో ఒక బాధ్యత ఉంది.కేవలం శరీర సుఖమే ఆమె చూసుకోలేదు.యాదయ్య జబ్బుతో ఉండి, ఆపరేషన్  చేయాలంటే,కుదువ నుంచి విడిపించి,తన బిడ్డ కోసం దాచిపెట్టిన బంగారాన్ని గౌరి చేతిలో పెడుతుంది.
విధివశాత్తూ యాదయ్య కూడా చనిపోతాడు.రత్తాలు తాను పని చేసే ఇండ్ల నుంచి జీతం అడ్వాన్స్ గా తీసుకుని, దగ్గర ఉండి కర్మకాండలు చేస్తుంది.చివరికి తన బిడ్డతో పాటు అతని పిల్లలను తానే సాదుతుంది. 'ప్రేమంటే' కథలో రత్తాలు పాత్ర ఆదర్శవంతమైంది.
తాను నమ్మి, ప్రేమించిన వ్యక్తి కోసం, సమాజం సూటి పోటి మాటలను మౌనంగా భరించింది.పెళ్ళి చేసుకుందే కానీ తాను భర్త వెంకటయ్యతో సుఖంగా జీవించింది లేదు.తన ఇష్టాలకు విలువ లేదు.తన మీద భర్తకు అజమాయిషీ ఉంది,అనుమానం ఉంది,ఆ సాకుతో వేధింపులు ఉన్నాయి.రత్తాలు,అదే అతనితో సహజీవనంలో,ప్రేమ, స్వేచ్ఛలను చవి చూసింది.ఆమె
అతన్ని మనస్పూర్తిగా ప్రేమించింది.ఆమె తనను నమ్మింది, తన సర్వస్వం అర్పించింది.అతని కష్టం తనదిగా భావించింది.అతని బాధల్లో పాలు పంచుకుంది.అదీ ప్రేమంటే......కథలో రత్తాలు 
పాత్రను చాలా బాగా పోర్ట్రే చేసారు రచయిత్రి ఝాన్సీ కొప్పిశెట్టి.
                    లోకంలో రకరకాల అమ్మలు ఉన్నారని
'తల వంచిన త్యాగం'కథలో రచయిత్రి ఝాన్సీ కొప్పిశెట్టి చెప్పుకొచ్చారు.అందులో కొడుకు,కోడలితో
మంచిగా ఉంటే చూడలేని అమ్మలు, కూతురు తన భర్త తో, ఆనందంగా ఉంటే సహించలేని భర్త లేని అమ్మలు మనవలు, మనవరాళ్ళ,ఆలనా పాలనా చూడకుండా, వ్యక్తిగత జీవితానికే ప్రాముఖ్యం ఇచ్చే అమ్మలు, వృద్దాప్యం కారణంగా, ఇంటి నుంచి కదలలేని స్థితిలో ఉండి, కూతురు గానీ, కోడలు గానీ
ఎంజాయ్ చేస్తుంటే ఓర్వలేని అమ్మలు కూడా ఉంటారని చెప్పుకొచ్చారు.అవును చాలా కుటుంబాల్లో ఇలా ఉండడం సహజం. అమ్మ..ఇప్పుడు ఉన్న స్థితి
వృద్ధాప్యం,ఒక ఫేజ్. బాల్యం, యవ్వనం, ఎలాగో వృద్ధాప్యం కూడా అలాగే ఒక దశ.ఆ తరువాత మృత్యువు అనేది కూడా ఒక లైనులో ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిన పరిస్థితి.
( అనారోగ్యంతో ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువ మానసిక ఒత్తిడికి లోనవుతారు)ఇదేదో అకస్మాత్తుగా వచ్చేది కాదు.వృద్ధాప్యం అనే స్థితిని,ఆడవాళ్ళు అయినా
మగవాళ్ళయినా,చూడక తప్పదు.ఆ వృద్ధాప్యంలో కొందరి ( ఆడ అయినా,మగ అయినా) జ్ఞాపకశక్తి అద్భుతంగా పెరుగుతుంది.వాళ్ళు ఒక నలబై ఏళ్ల క్రితం
జరిగిన సంఘటనను కళ్ళకు కట్టినట్లు వివరిస్తారు.
ముఖ్యంగా డబ్బుల లెక్కల్లో వారు ఈ వయసులో నిక్కచ్చిగా ఉంటారు.అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు.మరికొందరికి వృద్ధాప్యంలో ఏ విషయం జ్ఞాపకం ఉండదు.వాళ్ళు చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. చాలామొండిగావ్యవహరిస్తుంటారు.ఇలాంటి వృద్ధులైన తల్లిదండ్రులు ప్రతి ఇంట్లో ఉంటారు.వారిని భరించాల్సిందే.ఎందుకంటే, మనకు జన్మనిచ్చి పెంచి
పోషించి, మనం ఒక స్థాయిలో ఉండటానికి కారణం అవుతారు కనుక.రేపు మనం కూడా ఆ దశను ఎదుర్కోక తప్పదు కనుక.
                   అదే ఈ కథలో సుధ చేసింది.భరించింది.
తన తల్లి నోటికి ఏ మాటొస్తే, అది మాట్లాడినా సహించింది.ఎందుకంటే అమ్మకు తాను తప్ప ఇంకెవరూ లేరు కాబట్టి.అమ్మ సడన్ గా ఏదో మాట అనగానే, గుండె ను సూదితో గుచ్చినట్లు అనిపిస్తుంది.
మరు క్షణంలోనే అమ్మే కదా అంది,పోనీలే అని సర్దుకుపోతుంది.ఇది ఆ కథలో సుధ మానసిక పరిస్థితి.
పోనీలే అనుకుంటే, రోజురోజుకూ అమ్మ ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేయడం, సూటిపోటి మాటలు
అనడం ఎక్కువై వేదనకు గురైన సుధకు ఒకరోజు హార్ట్ఎటాక్ వచ్చి చనిపోతుంది,అదీ ముగింపు.ఆ అమ్మ పరిస్థితి అగమ్యగోచరం....
                   బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి,ఒక పంజాబీ
యువకుడిని ప్రేమించి, కుటుంబ సభ్యులను, ఒప్పించి అతనిని పెళ్లి చేసుకుంటుంది'జాడలేని నీడ' కథలో
కథానాయిక.అతని పేరు షేర్మా.పెళ్ళయ్యాక ముప్పై ఏడు రోజులు ఎంజాయ్ చేసాక,షేర్మాకు చెన్నై ట్రాన్స్ఫర్ అవుతుంది.ఏవో కారణాలు చెప్పి హైదరాబాద్ వచ్చేద్దాం అనుకునే లోపు కరోనా లాక్ డౌన్ షురూ అవుతుంది.ఆ తరువాత అతను హైదరాబాద్ రాలేదు.
అతనితో కమ్యూనికేషన్ కూడా కట్ అయ్యింది.లాక్ డౌన్ ఎత్తేసాక కూడా అతడు రాడు.నన్ను అంతగా ప్రేమించిన అతడు మోసం చేసి పారిపోయాడా...
కాదు.. అతడు అలాంటి వాడు కాదు...మరి ఏమైపోయాడు...ఏమో... అన్న ఆలోచనలతో అతన్ని జాడలు కొనుక్కునేందుకు కథానాయిక బయలుదేరడమే,ఈ కథకు ముగింపు....
                     ఇంట్లో అయినా బయట అయినా బతికున్నాళ్ళు మనకంటూ ఒక జీవితం ఉండాలి,ఒక వ్యక్తిత్వం ఉండాలి,మనదంటూ గడిపే కొంత సమయం
 ఉండాలి.మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి.పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోనంత వారికే తల్లిదండ్రులు చెప్పింది వింటారు.పెళ్ళి అయ్యాక
వాళ్ళు, వాళ్ళ కుటుంబం, పిల్లలు గురించే ఆలోచిస్తారు.ముఖ్యంగా విదేశాల్లో ఉండే పిల్లలయితే
తల్లిదండ్రులను కేవలం పని చేయడానికి మాత్రమే పిలిపించుకుంటారు.అలా అక్కడికి వెళ్లి పనిమనుషులుగా మారిన తల్లిదండ్రుల గాధలు నిత్యం
ఎన్నో వింటూనే ఉన్నాం.అందరూ అలాగే ఉంటారని చెప్పలేం కానీ 'అస్తిత్వం' అనే కథలో అలివేలుకు మాత్రం ఆ అనుభవం ఎదురైంది. ఇంకా పది సంవత్సరాల సర్వీసు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని తన నెలలు నిండిన బిడ్డ కోసం అమెరికాకు వెళుతుంది.ప్రీ అండ్ పోస్ట్ డెలివరీ సపర్యలతో పాటు,బిడ్డా అల్లుడు ఆఫీసులకు
వెళితే మనవరాలి ఆలనా పాలనా అంతా క్షణం తీరిక లేకుండా చేస్తుంది.కొన్ని రోజులు గడిచాక బిడ్డా అల్లుడు తనను అనుమానిస్తున్నారన్న విషయం సీసీ కెమెరాలు తేటతెల్లం చేయడంతో ఒక్కసారిగా స్థాణువైపోతుంది.తన బిడ్డే తనని నమ్మట్లేదని తెలిసి
కుంగిపోతోంది.తన వాళ్ళ దృష్టిలో బతుకు ఎంత హీనమైపోయిందన్న ఆలోచనలతో తన మస్థిష్కం వేడెక్కిపోతుంది.అంతే క్షణం ఆలోచించకుండా ఇండియాకు తిరిగి వచ్చేస్తుంది...ఈ కథలో అలివేలు చేసింది విదేశాల్లో ఉండే పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల
ప్రవర్తించే తీరుకు చెంపపెట్టు అని చెప్పుకోవచ్చు.
ఈ కథలో కుటుంబ వ్యవస్థలో విలువలు వాటిలో సున్నితత్వాన్ని సునిశితంగా వివరించారు కవయిత్రి ఝాన్సీ కొప్పిశెట్టి.
                   తాను కలగన్న యద్దనపూడి నవలల్లో కథానాయకుడు కాకుండా,ఆ కథానాయకుడిలో ఉన్న సగం లక్షణాలు లేని భర్తతో కాపురం.ఊహల్లో తన కలల నాయకుడితో విహారం చేస్తుంది 'చీకటి వెన్నెల'
కథలో కథానాయిక.ఊహల్లో నవలా నాయకుడితో మానసికానందాన్ని పొందుతూ భర్తతో భౌతికంగా జీవిస్తుంది.జీవితంలో చీకటిని తరిమి కొట్టి మధురమైన
ఊహల్లో విహరిస్తూ వెన్నెలను ఆస్వాదిస్తుంది.అతను
ఊహల్లో ఆ అద్భుత  పిండారబోసిన వెన్నెల్లో తుషారంలా తనని తడిపేస్తున్న భావన.మొత్తం 
అతనై... అతని ప్రపంచంలోనే విహరిస్తున్న స్థితిలో భర్త
పని మనిషితో రెడ్ హ్యాండెడ్ గా దొరికినా తను బాధ పడలేదు. ప్రేమ, ఆప్యాయతలు ఎరగని ఆ కృత్రిమ బంధం తీర్చుకున్న భౌతిక వాంఛలకు ప్రతిఫలమే ఇద్దరు పిల్లలు.పిల్లలు పెరగడం, ఒకంటివాళ్ళు కావడం, రోడ్డు ప్రమాదంలో భర్త మరణించడం, తాను ఒంటరి కావడం అన్నీ జరిగిపోయాయి.అయితే తన ఊహల్లో ఉన్న ప్రేమనంతా కవిత్వంగా మలిచి రాస్తూ ఉంటే సమాజం పలు విధాలుగా మాట్లాడుకోవడం ముగింపు.స్త్రీ భావాలను అర్థం చేసుకోని ఈ సమాజాన్ని చూసి ఎందుకు భయ పడాలి.వాళ్ళను 
ఎందుకు లెక్కచేయాలని తన అంతరంగం ప్రశ్నిస్తుంది.
                   'నిశ్శబ్ద సంగీతం' కథలో లలిత తన కూతురు దీపకు తాను రాసే రొమాంటిక్ కవితలతో ఇబ్బంది.ఏంటమ్మా ఈ వయసులో ఆ కవిత్వం.నీ వయసుకు తగ్గట్టుగా రాసుకోవచ్చుగా...అంటూ నిలదీస్తుంది.కూతురు మాటలకు ఒకవైపు ఆశ్చర్యం మరోవైపు బాధ కలుగుతుంది.ఇలా ప్రతి విషయంలో తల్లిని పాయింటవుట్ చేస్తుంటే మానసిక సంఘర్షణకు
గురి కావడమే కథ.
                    మొత్తం పదమూడు కథల్లో పాత్రలు రత్తాలు,లలిత,సుధ,అలివేలు, వైదేహి,అన్నీ రచయిత్రి ఝాన్సీ కొప్పిశెట్టి జీవితానుభవాల నుంచి పుట్టినవే.మేల్ డామినేటెడ్ సమాజం, స్త్రీల పట్ల కుటుంబం చూపే వివక్ష.స్త్రీలను తక్కువ చేసి చూడడం
ఇవన్నీ ప్రతి ఒక్కరూ ఒకే రకంగా కాకుండా వేరు వేరు విధాలుగా అనుభవించడాన్ని కవయిత్రి ఝాన్సీ కొప్పిశెట్టి అద్భుతంగా అక్షరీకరించారు.కవయిత్రి ఝాన్సీ కొప్పిశెట్టి అనాచ్ఛాదిత కథ,విరోధాభాస, గొంతు విప్పిన గువ్వ వంటి నవలలు రాసి పురస్కారాలు కూడా పొందారు.ప్రస్తుతం చీకటి వెన్నెల
కథల సంపుటి చాలా బాగుంది.ప్రతి ఒక్కరూ కొని చదవాలని విన్నపం....
                               
కామెంట్‌లు