మా రవణగారి కొట్లో ఉప్పుతో తొమ్మిదేకాదు,పంతొమ్మిదో ,పాతికో అంతకంటే ఎక్కువో దినసరి వెచ్చాలమ్మేవారు.
అంతఎక్కువకాదుగానీ ఆక్కనేవున్న గురుమూర్తిగారి కొట్లోకూడా సరుకులలాగే ఎక్కువగానే అమ్మేవారు.
అప్పట్లో అంటే,మాచిన్నప్పుడు మా రౌతులపూడిలో అవే సూపర్ బజార్ లు.
ఆపక్కన పోలీస్ కొట్టు ,గీలీస్ కొట్లు ఏవేవో వుండేవికానీ,అబ్బే వీటికీ వాటికీ పోలికేలేదు.చింతపండుందాంటే ఆ ఆకొట్టువాళ్ళు ,"ఉప్పట్టికెళ్ళండీయాల్టికి,రేపిత్తాను సింతపండ"నేరకం.
అయితే రవణగార్కి గురుమూర్తిగార్కి చుట్టరికముండడమేకాదు,లౌక్యంగూడాబాగా తెలిసి వుండడంవల్ల, ఏదైనా వాళ్ళవాళ్ళ కొట్టుల్లో లేకపోయినా, లేదనకుండా, మనల్ని మాటల్లోపెట్టి, పక్కనున్న ఆ చుట్టం కొట్టునుంచి, క్షణంలో తెప్పించి మనంఅడిగిన సరుకు తెప్పించి ఇచ్చేసి పంపేవారు.
అయితే ప్రతీ వాళ్ళ కొట్టుముందర "అరువు రేపు" అన్నమాటకు అర్థమేమిటో అప్పట్లో అసలు తెలిసేదికాదు.చిన్న అట్టముక్కమీద, నీలిమందుతోరాసిన పెద్ద పెద్ద అక్షరాల ఆ అట్టముక్కకు తాడుకట్టి కొట్టుమముందు మేకుకు తగిలించేవారు కోమటోరు.
మా రవణగారి కొట్టుకీ,గురుమూర్తిగారికొట్టుకీ సాధారణంగా పెద్దిళ్ళవాళ్ళెవరూ బేరానికి(కొనడానికి) ఎప్పుడోకానీవచ్చేవెళ్ళేవారు కాదు. ఎందుకంటే వాళ్ళు కొనేవి పంచదార,అప్పట్లో కరెంటు ఇంరాలేదుకనుక కిర్సనాయిలు,సబ్బులు వంటి అరుదైన సరుకులు మాత్రమే కొనేవారు.అవైనా ఎందుకంటే ,వాటిని వారు పొలాల్లో పండించలేరుకనుక.
అందుకనే చిల్లర శ్రీమహాలక్ష్మి అనుకొంటూ షావుకార్లు చిన్నచిన్న సరుకులబేరాలమీదే దృష్టిపెట్టేవారు.ఆ సమయంలో పెద్దిళ్ళవాళ్ళు బేరాలకు వెళ్ళినా,కోమటోరు పట్టించుకొనేవారు కాదు వాళ్ళని.
పాకల్లోని ఆడపిల్లలు
జుట్లు విరమోసుకొని,పైన ఏమీవేసుకోకుండా, క్రింద మొలకు వెండిది సిగ్గుబిళ్ళకట్టుకొనో,అసలేమీ కట్టుకోకుండానో , బుర్ర, బరబరా గోక్కుంటూ వచ్చేవారు బేరానికి. మగపిల్లలైతే, బోడిగుండేసుకొని, నగ్నంగానొ,చిన్నగోచీగుడ్డెట్టుకొనో
బేరాలకు వచ్చేవారు.మట్టిలో ఆటలాడాడి వస్తారేమో వాళ్ళు,మట్టికొట్టుకుపోయిన వంటితో ,ముక్కులుకార్చుకొంటూవచ్చే వారు. అలా వారు బేరాలకు కొట్లమీదకురావడం , ఉదయాస్థమయ సమయాల్లోనే ఎక్కువగా జరిగేది,
ఎందుకంటే, ఆ సమయాల్లోనే సీసాల్లో నూనిసుక్క అయిపోయిందనో,కూరలోవేసే వర్ర అయిపోయిందనో, సేరు ఎట్టడానికి సింతకాడ అయిపోయిందనో ,దీపంబుడ్లో సమురైపోయిందనో గుర్తొస్తుందివాళ్ళ అమ్మలకి.అప్పుడు పాతగ్రైప్ వాటర్ సీసాలకు తాడుకట్టిన సీసాలను, ఆ బుడ్డోళ్ళ చేతికిచ్చి,రూపాయో పాపాయో వాళ్ళ చేతిలోపెట్టి, నూని,కిర్సనాయిల్ ,వర్ర ,సింతపండు మొదలైనవి తెమ్మని ఈ కుర్రగాళ్ళను తోలేస్తారు కొట్లమీదకి వాళ్ళు.వాళ్ళనాన్నలైతే సుట్టలు కూడాకలుపుతారు ఆసరుకులకి తోడుగా.
ఆకుర్రగాళ్ళు ఆటల్లోపడి "మేంపోం,మేం ఆటాడుకోవాల" అని కాళ్ళుబాదుకొంటూ అంటే ,"కొట్టుమీద కెల్లి సామాన్లయీ కొంటే, కొసరెడతార్రా ఎర్రెదవా! ఎల్లు ,ఎల్లి సావుకార్ని కొసరడుగెహే! "అని వాళ్ళను బెలిపించి పంపిస్తారు తల్లితండ్రులు కొట్లమీదకి .
ఇంక అలాంటి సమయంలో చూడాలి షావుకార్లవిన్యాసం.ఈపిల్లకాయలు ఒకేసారి పదులు, పాతికమందిలు, కొట్టు దిగువను మూగేస్తారు.అవును వాళ్ళమ్మలంతా పొద్దున్నైతే చాలు, కూడొండి కూలికి పోవాలన్న తొందరా,మళ్ళీ సాయంత్రం కూలినుంచి తిరిగొచ్చి కూడొండి బిడ్డలకు పెందరాళే పెట్టాలనే ఆరాటం.ఏరోజు సరుకులారోజే తెచ్చుకొంటారు వాళ్ళు. పిట్టను కొట్ట -పొయ్యలో పెట్టా బతుకుయెమరి వాళ్ళది.అందుకనే ఆసమయాల్లో అంతరద్దీగా వుంటాయి , పాకల్లోని పిల్లకాయలతో షావుకార్ల కొట్లముంగిళ్ళు..
ఒకేసారి గోలగోలగా ఒకరినొకరు తోసుకుంటుా ,"నాకు ముందు, అర్థరూపాయి సింతకాడెట్టండి సావుకారుగోరూ,పావలా వర్రెట్టండి సావుకారుగోరూ," "నాకు రూపాయ నూనెయ్యండని "ఒకడంటే,నాకు అణాకాసు కిర్సనాలొయ్యండని" మరొకరంటారు. నాకుముందెయ్యండంటే, నాకుముందెయ్యండని,ఒకరినొకరు తోసుకొంటుంటే,వాళ్ళచేతుల్లోని, గ్రైప్ వాటర్ గాజుబుడ్డిలు గలగలమని చప్పుడుచేస్తుండగా,"ఏటి? నేనుముందొచ్చేనంటే, నేనే నీకన్నాముందొచ్చేనని, ఒకరినొకరు తోసుకుంటూ,తిట్టుకుంటూ వుంటే,"ఇదో ,కోంటారూ!బేగా ఎల్లకపోతే
మాయమ్మనన్ను తంతాది" అంటుందొక చిన్నపిల్ల.అలా,కొట్లట్టుముందు ఆసమయంలో పిల్లకాయలు చేసేగడబిడ అంతా ఇంతాకాదు.ఆసమయంలో దేవుడు బేరానికొచ్చినా,షావుకార్లు పట్టించుకోరంటే పట్టించుకోరు.అప్పుడు వాళ్ళకి పదిచేతులున్నా పనికి సరిపోవనిపిస్తుంది.
ఆ సమయంలో మాషావుకార్లు రవణా, గురుమూర్తి వగైరాలకు చిరాకన్నది ఏమిటో తెలియనట్లుగా,తియ్యతియ్యగా ఆపిల్లకాయలని కసురుకొంటూ," "ఉండండేస్ !ఒకచనం అంటూ, ముందుగానే చితకొట్టుకొని వుంచుకొన్న చీమ తలకాయంత చిన్నచిన్న
బెల్లంముక్కలను ,ఆ పిల్లగాళ్ళచేతిలో ఎత్తిపడేస్తారు.వాళ్ళుకొసరుగా అడిగిన, గుల్లశనగపప్పు,బఠానీగింజలూవగైరా కొసరుకు వుంచుకొన్నవి, నోటితో లేదనకుండా, చేత్తో లేదన్నట్లు చిటికెడేసి గింజలు చిన్నారుల చేతుల్లో పోస్తారు.
అప్పుడు,ఆ సమయంలో, ఆ పిల్లలమొహాల్లో ఆనందంచూడాలి. .మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీఈ కథంతామామూలే. మళ్ళీ షావుకారుల కొట్టుల్లో చిల్లరబేరాలుా మొదలు,పిల్లకాయల కొసరు బేరాలూ మొదలు,షావుకార్లకి ఊపిరాడని హడావిడీ మొదలు.
ఇంతకీ ఆ బుడ్డోళ్ళకి కొసరెందకెట్టాలంటారా? అదే కోమటోరి బిజనెస్ టెక్నిక్ .చిన్న కొసరు పడేస్తే ,కుర్రాళ్ళ బేరాలు పక్కకొట్లకెక్కడికీ పోవు. అలా అలవాటుచేస్తే, 'చిన్నపిల్లల ,చిల్లరబేరాలు సిరిపంటలని' మా ఊరి షావుకార్లకి బాగాతెలుసు.అయితే మాచేతిలోమాత్రం మా షావకార్లెప్పుడూ కొసరుమాత్రం విదల్చలేదదేమోకానీ!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి