మెట్టెల పరేషాన్ *
———-------------
సంవత్సరం లో మూడు సార్లు ఊరికి వెళ్లడం మాకలవాటు. దసరా కి సంక్రాంతికి వేసవి సెలవులకు ఊరెళ్లడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ ఉండేవాళ్లం.
నాకు పదేళ్లుంటాయేమో.. తమ్ముడు రఘుకు ఏడేళ్లు. నేను అమ్మా తమ్ముడు ముందుగా వెళ్లేవాళ్లం …పరీక్షలు ఎప్పుడు అయిపోతాయా ఎప్పుడు దసరా సెలవులకు ఊరికి పోతామా అని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసేవాళ్లం…
హైదరాబాదుకు ముప్పైకిలోమీటర్ల దూరం లో ఉన్న ఊరే కానీ ఎనిమిది , పది గంటల ప్రయాణం….
మా చదువు అంతా హైదరాబాదు పాత బస్తీ లోనే కొనసాగింది
ఊరికి పోవాలంటే అమ్మ పదిహేను రోజుల ముందునుండి సర్దుకునేది .
ఉన్న వాటిలోనే మంచివి చూసి మా బట్టలు శుభ్రంగా ఉతికి చక్కగా మడతలు పెట్టి మాకు కనబడకుండా పెట్టెలో పెట్టేది.
ఎప్పుడు వీలుంటే అప్పుడు ఊరిలో దొరకనివి మంచి టీ పొడి, చక్కర , బొంబాయి రవ్వ లాంటివి ముందే కొని పెట్టె అడుగున పడేసేది.పండగకు కావలిసిన కాజు , ఎండు ద్రాక్షలు కొనిపెట్టేది. ముఖ్యంగా తనకు కావలసిన పోకలు ,కాచు,జర్ద తెచ్చి పెట్టుకునేది.
ఊరి ప్రయాణానికి ముందు రోజు అప్పచ్చులు కానీ అటుకుల పోణీ కానీ ఏపుడుబియ్యం కానీ తయారుచేసి పెట్టేది.
పొద్దునే వంట చేసి పది గంటలవరకే అన్నం తిని బయలుదేరే వాళ్లం.
బాలాగంజ్ నుండి గౌలిగూడా లో ఉన్న బస్ డిపో కు రిక్షాలో ఒక పెట్టె రెండు పెద్ద సంచులతో వెళ్లడం ఒక పిచ్చి ఆనందం మాకు . బస్తీ దాటి బయటకు రాని మాకు రిక్షాలో దుకాణాలన్నీ చూస్తూ పోటీపడి బోర్డులను చదువుతూంటే గంటన్నర ప్రయాణం తెలిసేదే కాదు.
బస్ డిపో లో దిగి లగేజ్ తీసుకొని లోపలికెళ్లి బస్సు నిలిచే చోట కూర్చొనేవాళ్లం… ఎక్స్ ప్రెస్ బస్సులేవీ ముత్తంగి లో ఆగవు . అందువల్ల ఆర్డినరీ బస్సు ఎక్కి ముత్తంగి లో దిగి … అక్కడనుండి ఎడ్ల బండి లో కానీ నడిచి కానీ మా ఊరు నందిగామ కు చేరుకోవాలి. బండి కంటే నాకూ రఘుకు నడవడమంటే నే ఇష్టం.
ఎప్పటి లాగానే ఊరికి బయలుదేరాము.
బాలాగంజ్ నుండి పది గంటలకు బయలుదేరి బస్ డిపో లో 12.30కి బస్ ఎక్కినాము.
సికింద్రాబాద్ బాల్ నగర్ మీదుగా వెళ్లిన బస్సు మూడు గంటలకు పటన్ చెరు చేరుకుంది. పటన్ చెరు లో 10 నిమిషాలు ఆపేస్తాడు. అక్కడ బయలు దేరగానే సామాను ముందుకు జరిపి దిగడానికి రెడీ అయిపోయేవాళ్లం. బస్సును ముత్తంగి లో రెండు నిమిషాలే ఆపుతాడు.
ముత్తంగి లో దిగి పోయినాము … బస్టాండులో రాజయ్యగారి ఇల్లు ఉండేది. అమ్మ వాళ్లింటికి వెళ్లి కాళ్లు కడుక్కోని నీళ్లు తాగేది. ఇప్పటిలాగా వాటర్ బాటిల్స్ దొరికేవి కాదు కదా! దొరికినా అమ్మ తాగేది కాదు.
అక్కడ అటుకులు కానీ అప్పచ్చులు కానీ తిని మళ్లీ ప్రయాణం ప్రారంభం…
ఎందుకో ఆ రోజు బాపు బండి పంపలేదు.. ఆశ్వీజమాసమేమో వర్షాలు పడి దారి అంతా చిత్తడి చిత్తడి గా ఉన్నది… కొద్ది దూరం నడిచిన తర్వాత నల్లరేగడి భూమి బురద భయంకరంగా ఉన్నది. అమ్మ చెప్పులు తీసి సంచిలో వేయమన్నది. సామాన్లన్నీ నెత్తి మీద పెట్టకొని ముగ్గురం దాదాపు వంద అడుగులు అట్లా నల్లమట్టి బురదలో నడిచినం.
తర్వాత వాగు పారుతుంది కాళ్లు కడుక్కున్నాము… తీరీ చూస్తే అమ్మ మెట్టెలు కనిపించలేదు. ఒక కాలి మెట్టెలు కనిపించక పోయేసరికి అమ్మ పరేశాన్ అయ్యింది. రఘు మళ్లీ బురదలో వెతకడానికి వెనుకకు పరిగెత్తాడు… చీకటౌతుంది రారా అని వాణ్ని గట్టిగ పిలిచి… గంట నడిచి ఇంటికి చేరుకున్నాము… మెట్టెలు కోసం దారంత అమ్మ గులుగుతూనే ఉంది …… ఇంటికి చేసేసరికి ఆరైంది…. మేము వచ్చిన రెండు రోజుల్లోఊరంతా తెలిసిపోయింది… “పంతులమ్మ మెట్టెలు బురదల కొట్టుకపోయినయి”
ఇంటికొచ్చినోళ్లంత అడగడం అమ్మ విషాదంగా మొదటినుండి చెప్పడం ….
పండగకు రెండు రోజులముందు అందరు వచ్చినారు.
అనంత పద్మనాభ స్వామి వ్రతం , దసరా పండగ చాలా బాగా జరిగింది.
దసరా రోజు సాయంత్రం బాపు పెద్ద దర్వాజ దగ్గర ఒక కుర్చీ మీద కూర్చునేవారు. పక్కన రూపాయి బిళ్లలు కొన్ని నోట్లు పెట్టుకొని దసరా దండం పెట్టినోళ్లందరికీ రూపాయి చేతిలో పెట్టే వారు. ఆ తెల్లవారి అన్నయ్యవాళ్లందరూ వెళ్లిపోయినారు.
అమ్మ నేను రఘు ఇంకొక రెండు రోజులుండి పోదామనుకున్నాము.
ఆరోజు మధ్యాహ్నం భోజనాల తర్వాత అమ్మ మళ్లీ సర్దుకోవడం మొదలు పెట్టింది.
ఇంతలో బయట నుండి కావలిమల్లయ్య పిలిచిండు.
“ ఏందిరా మల్లిగా !”అనుకుంటూ వచ్చింది అమ్మ
“పంతులమ్మా! ఈడు నారిగాడు.. .. ఏందో దెచ్చిండు జూడు’ అన్నాడు
ఏందిరా? అన్నది అమ్మ
సెల్ల మూట విప్పి చూపించిండు
మట్టి కొట్టుకున్న “మెట్టెలు “….
అమ్మ ఆనందానికి అంతు లేదు..
“నావే మెట్టెలు” ఎక్కడ దొరికినయి బిడ్డా
నా ఆయుష్షు కూడ పోసుకొని చల్లగ బతుకు”
అని అంటూనే మెట్టెలను గోలెం లో ఉన్న నీళ్ల తో కడిగింది…
పడుకుని లేచి బాపు ఇవతలకు వచ్చి
ఏమైంది రా! అన్నాడు
“మెట్టెలు దొరికినవి “ అన్నది అమ్మ..
ఎక్కడ?
నిన్న వాగు కాడున్న ఈత చెట్ల కాడికివోయున
వాగుల కాళ్లుజేతులు కడుక్కుటుంటే …. వాగు ఒడ్డున తెల్లగ మెరవవట్టినయి… ఏందని జూస్తే గివి….
మా ఇంటిదానికి జూపిన … అదే జెప్పింది
ఇయ్యి పంతులమ్మ మెట్టెలు ఇచ్చిరాపో అని గదమాయించింది….
అమ్మ చాలా సంతోషపడింది…. బాపు నడిగి ఐదు రూపాయలు ఇచ్చింది
అప్పటి నుండి మేము హైదరాబాదు బయలుదేరే దాకా ఒక్కొక్కరు రావడం … మెట్టెలు దొరికియట గద పంతులమ్మా !! అనడం అమ్మ ఆనందం గా కథ మొత్తం చెప్పడం……..
….ఎంతైనా అల్ప సంతోషి కదా అమ్మ .
***
స్మృతిపథం లో అమ్మ; -సుగుణ అల్లాణి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి