సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-235
వటే యక్ష న్యాయము
       *****
వటః అంటే మఱ్ఱిచెట్టు ,గవ్వ, చిన్న బంతి, త్రాడు అనే అర్థాలు ఉన్నాయి.
యక్ష అంటే యక్షుడు,, కుబేరుడు,పుణ్యజనుడు,పిశాచకి .. ఇలా అనేక అర్థాలు ఉన్నాయి.
ఐతే యక్షులు అందరూ నిస్వార్థ పరులు కారనీ, ఇతరులను  కలవర పరచడం అంటే ఇబ్బంది పెట్టే వారుగా కొందరు ప్రాణాంతకంగా కూడా ఉంటారని జైన మతస్థుల నమ్మకం.వీళ్ళు ముఖ్యంగా నగరాలకు ఆవల,పర్వతాలు,, అరణ్యాలు, సరస్సులు చెట్లు మొదలైన ప్రదేశాలలో నివసిస్తారని  హిందూ మతస్థుల నమ్మకం.
ఏది ఏమైనా మఱ్ఱి చెట్టు పై యక్షుడున్నాడు అనగా భూతమై ఉన్నాడని చెప్పిన మాటల్లో నిజానిజాల విచారము చేయకుండానే, ఋజువులు లేకుండానే ఒక నిర్ధారణకు రావడాన్ని గురించి ఈ "వటే యక్ష న్యాయము" చెబుతుంది.
"ఐతిహ్యం తు న సత్య మత్ర హి వటే యక్షోస్తివా నేతివా! కిం జానాతి కదాచ కేన కలితం యక్షస్య కీదృగ్వపుః!! "
అంటే మఱ్ఱి చెట్టును  ఆశ్రయించి యక్షుడున్నాడు లోక ప్రతీతియే గాని నిజంగా ఉన్నాడో లేడో   తెలుసుకున్న వారు గాని అతడి రూప స్వభావములు గురించి విచారణ చేసిన వారు గాని,అసలతన్ని చూసిన వారు గాని లేరు.కేవలం ఆ వదంతి వల్లనే లోకం భయపడుతున్నది.
కాబట్టి స్పష్టత లేనిది, కేవలం ఓ వ్యక్తి పేరుతో పరంపరగా వచ్చిన వదంతి ఊహించి చెప్పినదే కాని ప్రమాణము కాదు.యథార్థము అంతకంటే కాదు.
నిజా నిజాలు తెలుసుకోకుండా ఏవైనా  పనులు చేయడంలోనూ, చేయకపోవడంలోనూ  వదంతులను పరిగణలోకి తీసుకోకూడదని చెప్పడమే ఈ న్యాయము యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
 దీనికి దగ్గరగా  ఉన్న తెలుగు సామెత  "అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు".
అంటే ఏదైనా లేని విషయాన్ని, అసత్యాన్ని గురించి ఇతరులు చెప్పినప్పుడు గుడ్డిగా నమ్మడాన్ని, నిజమే అనుకుని భ్రమ పడే  సందర్భంలో  ఈ సామెతను ఉదాహరణగా చెబుతుంటారు. ఇందులో ఋజువులు, సాక్ష్యాలు ఉండవు.కేవలం వదంతి లేదా పుకారు మాత్రమే. ఒకరు చెప్పిన విషయానికి మరింత జోడించి ఊహించుకోవడం కూడా ఇదే కోవలోకి వస్తుంది.
ఇంకా కొంత మంది ఉదయం పూట ఊరికి దగ్గరలో వున్న అడవిలోని చెట్ల దగ్గర తిరుగుతారు కానీ రాత్రయితే వణికి పోతారు. కారణం ఆ చెట్లపై ఉన్న దెయ్యాలు, భూతాలు ఊపిరి ఆడకుండా చేస్తాయని. దానికి  ఉన్న శాస్త్రీయమైన  కారణం తెలియక అలా భావిస్తుంటారు.
ఉదయం పూట చెట్లు కార్బన్ డై ఆక్సైడ్ ను గ్రహించి ఆక్సీజన్ ను విడుదల చేస్తాయి.రాత్రి పూట ఆక్సీజన్ కు బదులుగా కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదల చేస్తాయి.అందువల్ల  రాత్రి పూట చెట్ల కిందకు వెళితే  ఆక్సీజన్  అందక ఊపిరి ఆడనట్లుగా ఉంటుంది.
 అది తెలియక చాలా మంది ఆయా చెట్ల మీద దెయ్యాలు భూతాలు ఉన్నాయని భయపడుతూ, భ్రమ పడంతూ ఉంటారు.ఇక కొంతమందైతే ఇతరులను  భయపెట్టేందుకు కూడా ఇలాంటి పుకార్లను లేదా వదంతులను పుట్టిస్తుంటారు.
అమాయకంగా అన్ని నిజమే అని నమ్మినంత కాలం పుకార్లు చేసే షికార్లు మామూలుగా ఉండవు.తలచుకుంటేనే వెన్నలోంచి చలిపుట్టేలా చేస్తుంటాయి.
 కాబట్టి శాస్త్రీయ అవగాహన పెంచుకుని అసలు నిజాలు ఏమిటో తెలుసుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు