సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
న్యాయాలు -238
వన వ్యాఘ్ర న్యాయము
******
వనము అంటే అడవి,తోట, నీరు, సెలయేరు అనే అర్థాలు ఉన్నాయి. వ్యాఘ్రము అంటే పులి, పెద్దపులి.
వనము పెద్దపులిని రక్షిస్తుంది. పెద్దపులి వనాన్ని రక్షిస్తుంది. అంటే అన్యోన్య సంరక్షకత్వము అనే అర్థంతో ఈ న్యాయము ఉదాహరణగా చెప్పబడింది.
పెద్దపులులు  ఉన్నాయనే భయంతో ప్రజలు అడవుల జోలికి పోకుండా ఉంటారు.ఆ విధంగా పెద్ద పులుల వల్ల అడవి సంరక్షింపబడుతుంది.అలాగే అడవి  పులులకు ఆవాసం. ఆ అడవే లేకుంటే పులులకు నివాసము,ఆహారము కరువై  వాటి మనుగడకు ప్రమాదం ఏర్పడుతుంది.రక్షణ కరువైపోతుంది.వివిధ వ్యాధుల బారిన పడటమో, మానవులకు చిక్కి మరణించడమో జరుగుతుంది.
ఇలా వ్యాఘ్రానికి ,వనానికి గల బంధం 'ఆదాన ప్రదానాలకు' చెందినదిగా చెప్పుకోవచ్చు.
 అడవి అనేక రకాల వృక్షాలు,పొదలు, లతలతో పాటు రకరకాల పాములు, జంతువులు,పక్షులు, కీటకాలతో నిండి ఉంటుంది.
ఇక్కడ ఆయా జంతువులకు కావాల్సిన ఆహారం, ఆవాసం దొరుకుతుంది.ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అడవి అమ్మ లాంటిది.తనలో నివసించే జంతుజాలానికి అమ్మలా  రక్షణ కల్పిస్తుంది ఇస్తుంది.
అలాగే జంతుజాలం కూడా అడవిని మానవుల నుండి సదా రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది.అడవులు వృద్ధి చెందడంలో కొన్ని పక్షులు, జంతువులు ప్రధాన పాత్ర వహిస్తాయని మనకు తెలుసు.
ఈ న్యాయము పెద్దపులిని ఉదాహరణగా తీసుకుని  చెప్పడం జరిగింది కానీ దీనిని సమస్త జంతువులకు సంబంధించినదిగా చెప్పుకోవచ్చు.
 అంటే అందులో  మానవులమైన మనం కూడా అందులో ఉన్నామనే సత్యాన్ని గ్రహించాలి. మానవులకూ అడవులకూ మధ్య ఇచ్చి పుచ్చుకునే బంధం ఉంది. అడవుల నుండి ఎన్నో పొందుతాం.అడవి  ప్రకృతి ప్రతి రూపం.
ప్రకృతిలో జీవించే మనం ప్రకృతిని  సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది.
అంతే కాకుండా ఈ న్యాయాన్ని మానవీయ విలువలకు  కూడా అన్వయించి చెప్పవచ్చు. "ధర్మో రక్షతి రక్షితః" అంటే ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని అర్థం.
 ప్రకృతిని పరికించి చూస్తే ఈ న్యాయము యొక్క గొప్పతనం అణువణువునా కనబడుతుంది. సముద్రము నుండి ఆవిరైన నీటిని గ్రహించి వానలు కురిపిస్తుంది ఆకాశం.అందుకు కృతజ్ఞతగా భూమి తనపై ఉన్న  చెట్టూ చేమలతో ప్రకృతిని శోభాయమానం చేస్తూనే సమస్త జీవరాశికి ఆహారాన్ని ,ఆనందాన్ని ఇస్తుంది.
అలాగే  ఈ న్యాయాన్ని  తల్లిదండ్రులు సంతాన పరంగా చూస్తే 'ఆదాన ప్రదానాలు 'ఉండటం సహజం.అలాగే సాటి మనుషుల మధ్య కూడా ఇలాంటి  బంధం, బాధ్యత ఉండాలి. అలాంటప్పుడే 'వన వ్యాఘ్ర న్యాయము' వలె ఒకరికొకరం సంరక్షించుకోగలుగుతాం.మానవీయ విలువలు కాపాడబడతాయి.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు