కుంభకోణం
=========
పెద్ద మోసం జరిగితే దాన్ని కుంభకోణం అనే నానుడి తో పోల్చడం రివాజు. ఉదాహరణకు ఇటీవల రాఫెల్ కుంభకోణం జరిగినట్టు రాహూల్ గాంధీ విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. అలాగే రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో బోఫోర్స్ కుంభకోణం జరిగినట్టు అప్పటి ప్రతిపక్షం ధ్వజమెత్తింది. దీన్నిబట్టి కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు, ఎవరికి తెలియదన్నట్టు చేసే మోసాన్ని కుంభకోణం అని పిలుస్తున్నారు.
ఇలా ఈ కుంభకోణం నానుడి వాడుకలోకి రావడానికి కూడా ఓ కథ ఉంది. తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం అనే ఊరు ఉంది. అక్కడ అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అది తంజావూరు జిల్లాలో ఉంది. అక్కడున్న ఓ దేవాలయంలో దేవుని విగ్రహం ఉండదు. భక్తులు బయటే నిలబడి కనపడని దేవునికి నైవేద్యం సమర్పిస్తారు. పూజారులు వాటిని లోపలికి తీసుకు వెళతారు. టెంకాయ కొట్టి పూలు, పండ్లు లోపలే ఉంచి సగం కొబ్బరికాయను బయటకు తెచ్చి భక్తులకు ఇస్తారు. మ్రొక్కులుకూడా అంతే. దేవునికి సమర్పించే కానుకలు పుజారికి ఇస్తే ఆయనే లోపల హుండీలో వేస్తాడు. దేవుడు మాత్రం భక్తుడికి కనిపించడు. లోపల ఏముందో, ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కొబ్బరికాయను దేవునికి కొడుతున్నాడా? లేక నేలపై కొట్టి చిప్ప తెచ్చి ఇన్నాడా? అనే సందేహం కూడా భక్తుల్లో ఉంటుంది. మనకు చూపించకుండా, వారి ఇష్టం వచ్చినట్టు చేయడం మోసమే కదా?. ఈ మోసం కుంభకోణంలో జరుగుతుంది కాబట్టి ఇలాంటి మోసాలు జరిగితే కుంభకోణంతో పోల్చడం జరుగుతుంది. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా భారీ కుంభకోణం జరిగిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం మీకు తెలిసిందే. ఇది ఈ కుంభకోణం కథ. ఇలాంటి కళ్ళెదుటే జరిగే మోసాలనే కుంభకోణాలు అంటారు.★
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి