నానుడి కథలు ౼డా.దార్ల బుజ్జిబాబు

 రావణ కాష్టం
===========
 నిరంతరం మండుతూ, ఎప్పటికి ఆరిపోకుండా వుండే పగను వెల్లడి చేసే విషయాన్ని తెలిపేటప్పుడు ఈ  రావణ కాష్టం  నానుడిని వాడుతుంటారు. ఈ నానుడి  రామాయణ కథల నుండి వచ్చింది. చాలా కాలం నుండి  వైరం ఉంటూ, ఇంకా కొనసాగుతూనే ఉంటే  వారి మధ్య శత్రుత్వం రావణ కాష్టం లా కాలుతుంది అంటారన్న మాట.   భారతదేశంలో కాశ్మీర్ సమస్య రావణ కాష్టంలా కాలుతుంది. దీన్ని ఒక ఉదాహరణగా చెప్పుకోవొచ్చు.  అసలు ఈ నానుడి ఎలా వొచ్చిందో చూద్దాం.
       రాముడి చేతిలో రావణుడు మరణించాడు.  రావణుని భార్య మండోదరి. ఆమె మహా పతివ్రత. గుణవంతురాలు. రావణుడు చితిపైకి తీసుకుపోయే ముందు ఆమె రాముడు వద్దకు  వచ్చింది. తనకు వైధవ్యం లేకుండా చేయమని అడిగింది. ఈ వింత కోరికకు రాముడు ఆశ్చర్యపోయాడు. భర్త మరణించిన తరువాత భార్య వైధవ్యం పొందవలసిందే. మరి ఆమె అడిగిన కోరికను కాదనలేక పోయాడు రాముడు.  కోరిక తీర్చటం ఎలా? మరణించిన వారిని బతికించటం అసాధ్యం. 
      రాముడు బాగా ఆలోచించాడు. ప్రస్తుతం రావణుడు మరణించి మాత్రమే వున్నాడు. ఆయన దేహం ఇంకా దహనం కాలేదు. ఈ కాయం కాష్టంపై  పూర్తిగా దహనం అయితేనే ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుంది.  కాష్టం బుడిదిగా మారిన తరువాతనే ఆమె నుదుటిపై బొట్టు చెరిగిపోతుంది. అందువలన రాముడు ఆమె వైధవ్యాన్ని కాపాడటం కోసం కాష్టాన్ని కాలనివ్వకుండా చేసాడు. అది ఇప్పటికి ఇంకా కాలుతూనే ఉందట.  ఈ విధంగా రాముడు మండోదరికి వైధవ్యం లేకుండా చేసాడు.
     మొదలైన పగ ఎక్కడా ఆగకుండా  ధీర్ఘంగా కొనసాగుతూ ఉంటే రావణ
కాష్టం  అనడం   అప్పటి నుండి ఆనవాయితీ అయ్యింది.
కామెంట్‌లు