త్రిశంకు స్వర్గం
============
ఏదైనా ఒక వ్యవహారంలో ఎటూ తేల్చుకోలేక సతమతమయ్యేవారిని త్రిశంకు స్వర్గంలో వున్నారు అనటం పరిపాటి. అటూ ఇటూ తేల్చుకోలేక మధ్యలో ఊగిసలాడే వారంతా త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టే. మరి ఈ నానుడి ఎలా వచ్చిందో? దాని కథా కమామిషు ఏమిటో? తెలుసుకుందాం. ఇది కూడా రామాయణ కథల నుండి పుట్టుకువొచ్చిందే.
త్రిశంకుడు ఒక రాజు. అతడి అసలు పేరు సత్యవ్రతుడు. అతడి తండ్రి అరణుడు. ఇతడు ఇక్ష్వాక వంశరాజు. సత్యవ్రతుడు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా తిరిగి తండ్రికి చెడ్డపేరు తెచ్చాడు. ఈ క్రమంలో మూడు తప్పులు చేసాడు. అందువల్ల ఇతడిని త్రిశంకుడు అంటారు. ఆ తప్పులు ఏమిటంటే
1.పెళ్లి పీటల మీద వున్న బ్రాహ్మణ కన్యను ఎత్తుకుపోవటం.
2. తండ్రి కోపానికి గురై ఇంట్లో నుండి పారిపోవడం
3.వశిష్ఠ మహాఋషి ఆవును చంపి దాని మాంసాన్ని తినటం.
ఈ మూడు పాపాలకు గుర్తుగా నెత్తిపై మూడు బుడిపలతో వికృతంగా ఉండాలని వశిష్ఠ మహాముని శాపం పెట్టాడు. త్రిశంకుడు అలాగే మారాడు. అప్పుడు త్రిశంకుడు తన తప్పు తెలుసుకున్నాడు. పశ్చాత్తాప పడ్డాడు. మనసు మార్చుకున్నాడు. ఆదిశక్తిని ప్రార్ధించి తన వికృత రూపం పోగొట్టుకున్నాడు. తండ్రి మరణించిన తరువాత అయోధ్యకు రాజయ్యాడు.
ఎవరివైనా ఆత్మలు మాత్రమే స్వర్గానికి వెళతాయి. శరీరాలు వెళ్లవు. ఇది సృష్టి ధర్మం. కానీ త్రిశంకుడు సృష్టికి విరుద్ధంగా శరీరంతోపాటు స్వర్గం వెళ్లాలనుకున్నాడు. రాజరుషి వశిష్ఠునికి తన కోరిక తెలిపాడు. అసాధ్యం అన్నాడు వశిష్ఠుడు. సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రుడుని అడిగాడు. త్రిశంకుడి కోరిక తీర్చాలనుకున్నాడు విశ్వామిత్రుడు. తన తపః శక్తితో స్వర్గానికి పంపాడు. అయితే అక్కడున్న దేవతలు త్రిశంకుడిని స్వర్గం లోపలికి రానివ్వకుండా కిందకు నెట్టారు. కిందపడుతున్న త్రిశంకుడిని మార్గ మధ్యలో నిలిపాడు విశ్వామిత్రుడు. భూమిమీద పడకుండా చేసాడు. అటు స్వర్గంలోకి పోకుండా, ఇటు భూమి మీదకు రాకుండా మధ్యలోనే ఊగిసలాడే త్రిశంకుడి కథ నుండి ఈ త్రిశంకు స్వర్గం నానుడి ఉద్భవించింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి