హిరణ్యకసిప వరాలు
================
దేవతలను వరాలు కోరుకోవడం సహజం. అయితే కొందరు తమ స్వార్ధం కోసం దుష్ట వరాలు కోరుకుంటూ వుంటారు. తమ అర్హతలకు మించి దురాశతో కోరుకునే వరాలనే హిరణ్య కసిప వరాలు అంటారు. దుర్మార్గులు విచక్షణ లేకుండా కోరికలు కోరుతూ వుంటారు. ఇలాంటివి కోరిన వారికి ఆ కోరికలు ముప్పు తెస్తాయే తప్ప ఎలాంటి ప్రయోజనం చేకూర్చవు. ఈ నానుడి పురాణ కథల నుండి పుట్టింది. ఈ నానుడి 'హిరణ్య కసిప వరాలు' గా కాకుండా 'హిరణ్యాక్ష వరాలు'గా వాడుకలోకి వచ్చింది. అలా ఎందుకు వచ్చిందో తెలియదు.
త్రిమూర్తులలో ఒకరైన విష్ణుమూర్తి వైకుంఠానికి ద్వారపాలకులుగా జయ, విజయులు వుండేవారు. వీరు సోదరులు. ముని శాపం వలన మూడు యుగాలలోనూ రాక్షసులుగా జన్మిస్తారు. త్రేతా యుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకసిపుడుగా పుట్టారు. దేవతలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయసాగారు. వీరికి మూడు లోకలపై ఆధిపత్యం ఉండేది. ఒకానొక వేళ హిరణ్యాక్షుడు దేవతలపై కోపంతో భూమిని చాపలా చుట్టి పాతాళ లోకానికి పట్టుకుపోయాడు. విష్ణువు వరాహ రూపం ధరించి పాతాళ లోకం వెళ్లి హిరణ్యాక్షుని చంపి భూమిని తీసుకు వచ్చాడు.
తన సోదరుడిని చంపిన విష్ణువుపై హిరణ్యకశిపుడు పగ పట్టాడు. ఘోరాతీ ఘోరంగా బ్రహ్మకు తపస్సు చేసాడు. తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్ష్యమయ్యాడు. తనకు చావులేకుండా చేయమని కోరాడు హిరణ్యకశిపుడు. అది అసాధ్యం అన్నాడు బ్రహ్మ. అయితే ఈ 23 వలన చావులేకుండా చేయమని తెలివిగా వరం కోరాడు. ఆ వరం వలన తనకు చావు ఉండదని అతడు భావించాడు.
అవి ఏమిటంటే 1. గాలి వలన, 2. భూమి యందు, 3.అగ్ని వల్ల, 4.నీటి యందు, 5.ఆకాశమందు, 6.దిక్కుల యందు, 7.రాత్రుల యందు, 8.పగటి యందు, 9. చీకటి యందు, 10. వెలుతురు యందు, 11. జలచరముల చేత, 12. రాక్షసుల చేత, 13. భీకర మృగాల చేత, 15. విష సర్పాల చేత, 16. నరుల చేత, 17. సాధు జంతువుల చేత, 18. కలహాల చేత,19. అన్నిరకాల అస్త్రాల చేత, 20. అస్త్ర ప్రయోగ విధానాల చేత, 21.యుద్ధంలో మంచి సౌర్య ప్రదర్శన, 22. లోకపాలకులను అతిక్రమించే మహిమ , 23. ముల్లోకాలను జయించే శక్తి.
ఈ 23 వరాలుతో ఇక తనకు చావేలేదని సంబర పడ్డాడు హిరణ్యకశిపుడు. అయితే తన కుమారుడు ప్రహ్లాదుడు వల్లనే తనకు చావు రాసుందని గ్రహించలేకపోయాడు ఆ దుష్టుడు. విష్ణువు బ్రహ్మ ఇచ్చిన ఈ 23 వరాలతో కాకుండా నరసింహావతారం తో హిరణ్య కసిపుని సంహరించాడు. పనికిరాని వరాలు కోరి అవి తమకు ప్రయోజనం చేకూరుస్తాయని ఆనందపడితే అలాంటి వరాలను *హిరణ్యాక్ష, లేదా హిరణ్యకసిప వరాలు* గా పోల్చడం రివాజు అయింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి