ఒక్కోసారి నీ తోడు నాకు హాయిగొల్పుతుంది
నీ నీడలో నా మనుసు సేదదీరుతుంది!
ఒక్కోసారి నీ జతలో నా నడకకు విరామం దొరుకుతుంది
నేను నడిచిన మైలు రాళ్ల లెక్క తెలుస్తుంది!
ఒక్కోసారి నీ దగ్గరితనం నాకు ధైర్యాన్నిస్తుంది
నాలోని భయాలన్నిటికీ సమాధానమిస్తుంది!
ఒక్కోసారి నీ చేరువలో నా అస్తిత్వం కనబడుతుంది
నా పుట్టుకకు అర్థం పరమార్థం తెలుస్తుంది!
ఒక్కోసారి నీ దరి నా కలల దారి కనిపిస్తుంది
నా స్వప్నాల సాకారానికి మార్గం సుగమమౌతుంది!
ఒక్కోసారి నీ ఒడిలో నా ఒడిదుకుల చిత్రం కళ్లముందుంటుంది
నా తప్పొప్పులు జయాపజయాల చిట్టా తెలుస్తుంది!
ఒక్కోసారి నీవంటే భయంగా ఉంటుంది
నీ సాహచర్యం లో అందరికీ దూరమౌతానేమోనని!
ఎప్పుడో ఒకసారి నిను తలచినపుడు నా చేయందుకోవా
నీ ఎద మీద నను మనసారా సేదదీరనీయవా!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి