సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -231
లోహ చుంబక న్యాయము
******
లోహము అంటే ఎఱ్ఱనిది రాగిది ఇనుపది ఉక్కు బంగారము నెత్తురు ఆయుధము గాలము ఎఱ్ఱ మేక అనే అర్థాలు ఉన్నాయని మనకు తెలుసు.
చుంబకము అంటే త్రాసు ముల్లు,సూదంటు ఱాయి, అయస్కాంతము అనే అర్థాలు ఉన్నాయి.
అయస్కాంతము లేదా సూదంటు ఱాయి ఒక పదార్థము.ఇది ప్రకృతిలో సహజంగా దొరుకుతుంది.ఈ ఱాయికి ఇనుము, నికెల్ వంటి లోహాలను ఆకర్షించే స్వభావము ఉంటుంది. ఈ స్వభావాన్నే అయస్కాంతత్వం అంటారు.
ఇలా దీని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉంటుంది. ఇది రెండు ధృవాలను అనగా ఉత్తర, దక్షిణ ధృవాలను కలిగి ,ఆ ప్రాంతంలో  బలమైన ఆకర్షణా బలాన్ని కలిగివుంటుంది.
అయస్కాంతము అనేది ఇనుమును ఆకర్షించ గల శరీరము లేదా వస్తువని చెప్పవచ్చు.దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే తనకు దగ్గరగా ఉన్న ఇనుమును చటుక్కున ఆకర్షించగలదు .దానిని గూడా తనలా అయస్కాంతముగా  మార్చి వేయగలదు.
మరి దీనిని కూడా ఓ న్యాయంగా చెప్పడంలో  పూర్వీకుల ఉద్దేశ్యం ఏమై వుంటుందా అని ఆలోచిస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.
దీనిని ఆధ్యాత్మిక దృష్టితో చూసినట్లయితే  భాగవతంలో శ్రీకృష్ణుడు  పిల్లలకు ఇష్టమైన అల్లరి  చేష్టలతో అలరించడం, ఆకర్షించడం అందరికీ తెలిసిందే.అలాగే  మహాభారతంలో తన యొక్క లీలల ద్వారా భగవద్గీత బోధన ద్వారా  సామాన్యుల నుంచి ఋషులు,వేదాంతులను సూదంటు ఱాయిలా ఆకర్షించి భక్తిని, ముక్తిని పారవశ్యాన్ని కలుగజేయడం.. చదివిన వారందరికీ తెలుసు.
 అలాగే మనుషుల్లో కూడా కొంత మంది ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి సమూహంలో కానీ, సమాజంలో కానీ ఇట్టే ఆకర్షింపబడుతుంటారు.
అలా ఆకర్షింపబడటమే కాకుండా తమకు తగిన  అనుయాయులను తయారు చేసుకోగలుగుతారు.అంటే అయస్కాంతము ఇనుమును తన ప్రభావం చేత అయస్కాంతంగా తయారు చేసినట్లు అన్నమాట..
కొంతమంది చూడగానే అఃదంతో, మరికొందరు వాక్చాతుర్యంతో ఇంకొందరు తమ యొక్క ప్రవర్తనతో ఆకట్టుకోవడం చూస్తూ ఉంటాం.
 వాళ్ళలా ఉండాలనీ వారిని అనుకరిస్తూ ఉండే వాళ్ళను కూడా చూస్తూ ఉంటాం.అంటే వారి ప్రభావం ఎదుటి వారిని అంతగా ప్రభావితం చేస్తుందన్న మాట.
 ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో...
మన దేశ స్వాతంత్ర్య ఘట్టాలను చూసినట్లయితే గాంధీజీ మాటల్లోని శక్తి దేశంలోని ప్రజలందరినీ సూదంటు ఱాయిలా ఆకర్షించింది.అలా గాంధీగారు ఒక్కరే కాదు ఎందరో స్వాతంత్ర్య సమర యోధుల మాటలు,చేతలచే ఆకర్షింపబడి  ప్రజలు వారి మార్గంలో నడవడం ,  అందరూ ఏకమై స్వాతంత్ర్యం సాధించడం జరిగింది.
ఇలా భక్తులను, తోటివారిని, తమ సమూహాలను, సమాజాన్ని ప్రభావితం చేసే సూదంటు ఱాయి వంటి వ్యక్తిత్వం కలిగిన వారిని గమనించే ఈ  "లోహ చుంబక న్యాయము"ను మన పెద్దలు సృష్టించి ఉంటారు. అంతే కదండీ!"
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు