డబ్బుల శబ్దం (బాల గేయం)---ఎడ్ల లక్ష్మి సిద్దిపేట
రానూ రానూ అంటారు 
మారం చేస్తూ ఉంటారు 
మూలకు నక్కి చూస్తారు
ఎక్కెక్కి ఏడుస్తుంటారు !!

తల్లి చూసి పిలుస్తుంది
వెనక్కి వెనక్కి వెళ్తారు
ఆకు చాటు పిందెలోలే
కొంగు చాటు పిల్లలు వారు!!

అమ్మమ్మ తాత వచ్చారు
కమ్మని పండ్లు తెచ్చారు
రమ్మని వారిని పిలిచారు
పిలుపువిని పిల్లలు దాగారు!!

తాత యోచన చేసిండు
చిల్లర డబ్బులు తెచ్చిండు
చిన్న డబ్బలో వేసి ఊపిండు
డబ్బుల చప్పుడు విన్నారు !!

గబగబ పిల్లలు వచ్చారు
తాత ముందు నిలిచారు
కొట్టుకు వెళ్దాం అన్నారు
ఎగిరి గెంతులు వేశారు !!


కామెంట్‌లు