కొప్పరపు కవులు ; సేకరణ ; -కొప్పరపు తాయారు

 గుంటూరుజిల్లా సంగంజాగర్లమూడి శతావధానంలో (18-5-1910) "ఆరువేల నియోగుల" పై పద్యం శ్రీ కొప్పరపుకవులు చెప్పినది. కొందరు మిత్రుల అభ్యర్ధన మేరకు ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఇది పృచ్ఛకుల/ప్రశ్నించేవాళ్ళు  కోరికపై అప్పటికప్పుడు కొప్పరపువారు ఆశువుగా చెప్పింది. సీసపద్యం:  రాజాధిరాజ సద్రాజ గౌరవముల విలసిల్లు వారాఱువేలవారు / పరిపంథి బంధు రాపద్దాన  సంధులై విలసిల్లు వారాఱువేలవారు/ పతికార్య నిర్వహ భావ గరిష్ఠులై విలసిల్లు వారాఱువేలవారు/సకల కలా కలాపక  సత్సమాఖ్యులై విలసిల్లు వారాఱువేలవారు/ మతిమదగ్రణులనఁగఁ నున్నతి వహించి వెలయుచుండెడి వారాఱువేలవారు / శంకర కృపానుసార విస్తార వంశ విభవ యుతులగు వారాఱువేలవారు. తాత్పర్యం: రాజాధిరాజుల చేత ఎన్నో గౌరవములు పొందినవారు. శత్రువులు కూడా ఆపదలో ఉంటే,  వారిని ఆదుకునే స్వభావం కలిగినవారు. పతి/రాజు/యజమాని ఏదైనా పని అప్పచెపితే, ఆ కార్యాన్ని అద్భుతంగా నిర్వహించాలి, అనే భావాన్ని నరనరాన ఎక్కించుకుని, నిర్వహించే గొప్ప ప్రభుభక్తి కలిగినవారు. సకల కళల్లో ప్రవేశం/ప్రావీణ్యం కలిగినవారు. సాహిత్యం, సంగీతం... ఇలా అనేక కళలకు సమాఖ్యగా, కళాసంపూర్ణత్వంతో కళాత్మకత/రసాత్మకతతో ఉండేవారు.మేధావులలో అగ్రగణ్యులని ఎంతో కీర్తిని గడించినవారు. శుభాన్ని, సుఖాన్ని కలుగజేసే శంకరుడి దయాప్రసాదం వల్ల,  ఎంతో వైభవంగా అభివృద్ధి చెందినవారు ఆరువేల నియోగులని సారాంశం.ప్రతిపాదం చివర్లో  విలసిల్లు, విలసిల్లు అని చెప్పడం, విలసిల్లారని, విలసిల్లాలని శుభసంకల్పంతో చెప్పిన పద్యశిల్పం. ఆరువేల నియోగుల ఈ వైభవానికి, ఈ ప్రాభవానికి, ఈ సులక్షణాలు కలిగి ఉండడానికి కారణం దైవం/శక్తిస్వరూపం  దయాగుణంతో ప్రసాదించిన ఆశీస్సుల ఫలం, అని కవిహృదయం. ఈ పద్యంలోని విషయాలను గ్రహించి, ప్రేరణగా నిలుపుకొని, తాము ఎంచుకున్న రంగంలో ఆదర్శవంతంగా ఆచరిస్తే,  ప్రవర్తిస్తే, దిగ్విజయులవుతారు.పూర్వమహనీయుల వలె చిరయశస్సు, సత్కీర్తి పొందుతారు. నాటి మహామంత్రి తిమ్మరసు నుండి, మొన్నటి టంగుటూరి ప్రకాశంపంతులుగారి మొదలు, నిన్నటి ప్రధానమంత్రి పి.వి నరసింహారావుగారి వరకూ స్థిర యశస్సును పొందినవారే. నియోగులే గొప్పవాళ్ళని అహంకారంగా ప్రవర్తిస్తే, అడుగంటి పోతారు. ప్రతిభ, ప్రభ ఏ ఒక్కరి సొత్తుకాదు.అది సరస్వతీ ప్రసాదం.పూర్వ మహామంత్రుల, మహాకవుల జీవితాన్ని, కవిత్వాన్ని  పఠించి, భజించి ధన్యులమవుదాం.ధన్యోస్మి, -మాశర్మ🙏

కామెంట్‌లు