న్యాయాలు -226
లపోర శంఖ న్యాయము
******
లపనం అంటే ముఖము , నోరు,మాట,మాట్లాడుట.శంఖం అంటే సంకు, నొసటి యెముక, నిధి విశేషము అనే అర్థాలు ఉన్నాయి.
శంఖము వలె ఊరికే మ్రోగుతూ వుండటమే కానీ క్రియ మాత్రము శూన్యము అనే అర్థము ఈ న్యాయములో ఇమిడి ఉంది.
క్షణం విరామం లేకుండా కొందరు మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకలా మాట్లాడుతారో వారికైనా అర్థం అవుతుందా అని ఎదుటి వారికి తరచూ సందేహం కలుగుతుంది.ఎందుకంటే వారు మాట్లాడిన దానిలో అవగించంతైనా అవసరమైనది వుండదు. పైగా అలా మాట్లాడే వారి మాటలే ఎక్కువ ఉంటాయి కానీ చేతలు శూన్యం.అంతూ పొంతూ లేకుండా అనవసరంగా మాట్లాడే వారి మీద మన పెద్దలు ఉపయోగించిన అనేక సామెతలు,జాతీయాలను చూద్దామా ...
"వాగుడు కాయ, వదరుబోతు ,మాటలెక్కువ-చేతలు తక్కువ", మాటలు కోటలు దాటుతాయి- చేతలు గడప దాటవు, కోతల్రాయుడు " మొదలైన సామెతలు క్రియా శూన్యులైన వ్యక్తుల గురించి చెబుతుంటాయి.
మన పెద్దవాళ్ళు, పూర్వీకులలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ప్రకృతిలో ప్రతిదీ నిశితంగా పరిశీలించి, దానిని మానవ స్వభావానికి అన్వయించడం.
శంఖమును ఎప్పుడైనా చెవి దగ్గర పెట్టుకొని విన్నారా ?వింటే సముద్రపు హోరులా శబ్దం వస్తుంది. ఆ శబ్దం నిరంతరం వస్తూనే ఉంటుంది. అలా శబ్దం చేయడం వల్ల వచ్చే ప్రయోజనం అటు శంఖానికి గానీ ఇటు మనకు గానీ ఉందా?... లేదనే సమాధానం వస్తుంది.అలాగే అనవసరమైన మాటలు విడువకుండా రోజంతా మాట్లాడితే ఎలాంటి లాభం గానీ, ఉపయోగం గానీ వుండదు కదా!.
అందుకే " వట్టి మాటలు కట్టి పెట్టోయ్/ గట్టి మేల్ తలపెట్టవోయ్" అని గురజాడ అప్పారావు గారు అన్నారు.
కాబట్టి మాటల్ని డబ్బులంత పొదుపుగా వాడుకుంటూ చేతలను నీళ్ళలా పరోపకారం కోసం ప్రవహింప చేద్దాం.
అప్పుడిక క్రియా శూన్యులు అనే అపవాదు పోగొట్టుకుని "క్రియా శీలురు, క్రియా శూరులు"గా పేరు పొందగలం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి