కాలమహిమ; ----శ్రీమతి సుగుణా.అల్లాణి.- హైదరాబాద్.
నిశ్శబ్దంలో ---
ఒంటరిగా కాలాన్ని లెక్కించా,
నా వెనక కొండలా -
గతం నిలబడితే,
బంతి లా గంతులేస్తూ 
నా భవిష్యత్తు ముందుండి 
వెక్కరించింది.....!
గుప్పిట బిగించి పట్టుకున్నా 
ఎక్కడపోతుందిలే అనుకున్నా
కాలం వేళ్ల సందు నుండి ఇసుకలా 
ఎప్పుడు జారిందో తెలియనేలేదు!

వెనకనున్న గతకాలపు గిరిని చూసా
ఎన్ని అనుభవాల ప్రవాహాలు
ఎన్ని ఆనందపు తరువులు
ఎన్ని మధుర సుందర సుధా ఫలాలు
ఎన్ని కలల రాదారి పూలతోటలు
ఎన్నో కష్టాల కఠిన శిలాతోరణాలు
ఎన్నో పోరాటాల విస్పోటనాలు
ఎన్నో క్రోధపు గాండ్రింపులు
ఎన్నో అవహేళనల ఘీంకారాలు
అన్నీ ఆస్వాదించి అనుభవించి ఆనందించి 
ఎదిరించి పోరాడి పరుగులు తీసి 
అన్నిటినీ దాటేసి 
ఈనాటికి ప్రశాంతంగా 
నిశ్చలమైన నదిలా నిలిచా!
జీవం తొణికిసలాడుతూ 
బతుకుమీద ఆశను కలిగిస్తున్న 
చిన్న బంతి లాంటి భవిష్యత్తును
చూస్తూ……….ముందడుగు వేసా!

                  ***

కామెంట్‌లు