నానుడి కథ;- *౼ డా.దార్ల బుజ్జిబాబు*

 యక్ష ప్రశ్నలు
-------------------
    ఎవరైనా ముప్పతిప్పలుపెట్టే కఠినమైన ప్రశ్నలు అడిగితే వాటిని యక్ష ప్రశ్నలు అంటారు.  సమాధానం మర్మ గర్బంగా వుండే ప్రశ్నలే యక్షప్రశ్నలు.  వీటికి చాలా యుక్తితో జవాబు చెప్పవలసి ఉంటుంది.  ఈ నానుడి  కూడా మహా భారత కథల నుండి వచ్చిందే.
     పాండవులు  వనవాసం చేస్తున్న రోజులవి. ఓ బ్రాహ్మణుని నిప్పు పుట్టించే కొయ్య జింక కొమ్ములలో ఇరుక్కుపోగా, అది పారిపోయింది. తన యజ్ఞయాగాధులకు  ఆటంకం కలగకుండా  నిప్పు కొయ్యను తెచ్చివ్వమని ఆ బ్రహ్మణుడు అక్కడున్న పాండవులను వేడుకున్నాడు. పాండవులు జింక వెంట పరుగెత్తారు. జింక దొరకలేదు. అలసిసొలసి ఓ చెట్టునీడన విశ్రమించారు. వారికి బాగా దాహం అయింది.  చిన్నవాడైన సహదేవుడు చెట్టెక్కి దగ్గరలో ఉన్న చెరువును చూసాడు. నీళ్లు తెస్తానని అన్నలకు చెప్పి చెరువు వైపు వెళ్ళాడు. ఎంతకు తిరిగి రాలేదు. తరువాత నకులుడు వెళ్ళాడు. అతడు తిరిగిరాలేదు. ఆ తరువాత అర్జునుడు, ఆనంతరం భీముడు వెళ్లారు.  వారు కూడా రాక పోయేసరికి చివరకు ధర్మరాజు వెళ్ళాడు.
       చెరువు వద్ద ఓ కొంగ ఉంది. "ధర్మరాజా! నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి సరైన సమాధానం చెబితేనే ఈ నీరును తీసుకుపోగలరు. చెప్పలేకపోతే మరణమే శరణ్యం. నీ తమ్ముళ్లు నలుగురు సమాధానాలు చెప్పలేక ప్రాణాలు పోగొట్టుకున్నారు" అని నిర్జీవంగా పడివున్న తమ్ముళ్లను చూపించాడు. 
       ధర్మరాజు  ప్రశ్నలు అడగమన్నాడు.  కొంగ అడగడం మొదలు పెట్టింది. అన్నిటికీ యుక్తితో సమాధానం చెప్పాడు. కొంగ సంతృప్తి చెందింది. నీరు త్రాగమంది. నా తమ్ముళ్లను బ్రతికిస్తేనే త్రాగుతాను, లేకుంటే నేను వారిలాగానే విగత జీవినవుతాను అన్నాడు. అప్పుడు కొంగ ఒక్కరిని మాత్రమే బ్రతికించగలను. ఎవరో ఒక్కరిని మాత్రమే కోరుకో అంది. ధర్మరాజు నకులుడిని బ్రతికించ మన్నాడు. కొంగ ఆశ్చర్యపోయింది. వీరులైన అర్జున, భీములను కోరకుండా నకులుడిని బ్రతికించమనటమేమిటి?" అడిగింది కొంగ. "అయ్యా! కొంగ రాజా!! నేను పాండవులలో కుంతి కుమారులలో పెద్దవాడిని మిగిలాను. మా పినతల్లి మాద్రి కుమారులలో పెద్దవాడైన నకులుడు ఉండటం ధర్మనీతి. అందుకే అతడిని బ్రతికించ మన్నాను" అన్నాడు. కొంగ సంతోషంతో ధర్మరాజు ధర్మనీతిని పొగిడింది.  యక్షుడుగా మారింది. "ధర్మరాజా! నిన్ను పరీక్షించటం కోసమే కొంగగా మారాను.  మిమ్ములను ఇక్కడకు తెచ్చిన జింకను కూడా నేనే. నీ ధర్మ నీతిని కళ్లారా చూసాను" అని నలుగురు తమ్ముళ్లను బ్రతికించాడు.
     ధర్మరాజు యుక్తిని పరీక్షించటం కోసం యక్షుడు అడిగిన ప్రశ్నలు కాబట్టి వాటిని యక్ష ప్రశ్నలు అంటారు.  తికమక పెట్టే, విజ్ఞులు మాత్రమే జవాబులు చెప్పగలిగే  ప్రశ్నలను యక్ష ప్రశ్నలు అనటం ఆనాటి నుండి నానుడిగా వస్తుంది.

కామెంట్‌లు