ఇద్దరం(ఆయన, నేను)ఒకే స్కూల్లో 16సం.పని చేశాము.అది మా అదృష్టం.ఆయన ప్రమోషన్ తో మేం కాకినాడకు మకాం మార్చాము.
ఆయన తాళ్లరేవు,నేను గొల్లపాలెం లో జాయిన్ అయ్యాము.చిన్న హైస్కూల్ అని జాయిన్ అయితే ,మూడో సంవత్సరానికే 150 అల్లా 650 విద్యార్థులతో కిటకిటలాడిపోయింది బడి.కొత్త ఊరు.నేనొక్కత్తినే.ముందు కాస్త భయమేసింది.పెద్ద పల్లెటూరు.పట్టణ వాతావరణ ప్రభావం ఉంది.విద్యార్థులు చాలా మంచి పిల్లలు.ఊరు కూడా చాలా చక్కని ఊరు.
పచ్చని పొలాలు,చేపల చెరువులు,కాల్వ గట్టు
పచ్చదనంతో ప్రశాంతంగా ఉండేది.అలా
తొమ్మిది సంవత్సరాలు ఇట్టే అయిపోయాయి.
పిల్లలకు అమితమైన ప్రేమ,భక్తి.అలా వాళ్లతో
చాలా గాఢంగా అల్లుకుపోయాము నేను-,పిల్లలు అక్కడ స్కూలులో.
అలానే మొన్న చెప్పిన జడా మణి క్లాస్ మేట్
వీర వెంకట రమణ.మేడిశెట్టి.గురించి చెప్పాలి.
(వాళ్ల అన్నయ్య శ్రీరామ చంద్రుడు.ఇతని గురించి తరువాత)
రమణ ఎప్పుడూ నా టేబిల్ కి దగ్గరగా కూర్చునే వాడు.
తరగతి గదిలో అస్సలు కుదురుగా ఉండేవాడు కాదు.
కలయ తిరిగే వాడు.
తెలివి తేటలున్నాయి.
కానీ, చదివేవాడు కాదు.
మెల్లగా చేరికయ్యాక తెలిసింది అతని గురించి.
ఇంట్లో అమ్మా నాన్నా చదువుకోలేదట
నాన్న పనికెడితే ఆరుగురు తినాలి.
తల్లిదండ్రులకు చదువు విలువ తెలుసు.
అందుకే వారు ఎంతో హితబోధ చేసేవారుచదువు
కోమని.
టీచర్లు వాళ్లింటికి వెళ్లి ఏమైనా పిల్లల గురించి చెబితే సానుకూలంగా స్పందించేవారు.
నేనూ ఎన్నో హితబోధలు చేసేదాన్ని.
రమణ,రోజూ దెబ్బలు తినేవాడు.
తినకపోతే తోచదు వాడికి.
కానీ ఎంత ప్రేమో.
తరువాత నాకు ఏడుపొచ్చేది.
ఎందుకంటే కొంతమంది దెబ్బకే భయపడి చదువుతారు.
అందు వలన రెండు తగిలించాల్సి వచ్చేది.
ఎలాగో టెన్త్ అయిపోయింది అనిపించాడు .రమణ.
పిల్లలు మమ్మల్ని వదిలి వెళ్లడానికి వెక్కి వెక్కి ఏడ్చారు.
ఆ తరువాత కూడా మమ్మల్ని వదలలేదు చాలా మంది.
తరువాత నేనూ 2009 లో సంపరకి వెళ్లిపోయాను.
ఒకరోజు పళ్లు తీసుకుని 1గంటకు సంపర స్కూలుకు వచ్చాడు రమణ.
వచ్చి నమస్కరిస్తూ చేతిలో పెట్టాడు.
"ఎందుకు రమణ ఇవన్నీ" అంటే.
"మేడమ్ ఆరోజు నన్ను దెబ్బలాడి,కొట్టి
నోట్సులు రాయించి చదివించకపోతే ఎలా ఉండే వాడినో.
మీ దయ వలన డిగ్రీ పూర్తి చేశా.
రాజమండ్రి జైలు వార్డర్ గా చేస్తున్నా "అన్నాడు.
చాలా కబుర్లు చెప్పాడు.
అలా 2015 వరకూ వచ్చాడు. మళ్లీ నేను కాకినాడ కొచ్చేయడం అక్కడ నుండి హైదరాబాదుకు వచ్చేయడం జరిగింది.
ఇప్పుడు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయి అక్కడఉద్యోగం చేస్తున్నానని ఫోన్ లో ఎంత ఆనందంగా చెప్పాడో.
మొహం ఎప్పుడూ నవ్వుతో,ప్రేమతో కళకళలాడిపోయే విద్యార్థి రమణ.
భగవంతుడు వారందరికీ ఆయురారోగ్యాలుశాంతి సౌఖ్యాలు ఇవ్వాలని ఆశీస్సులు తప్ప వారి ప్రేమకు ఏమవ్వగలం.
***
రమణ జీవితం బహు రమణీయం...!!---సత్య గౌరి.మోగంటి.- హైదరాబాద్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి