సుప్రభాత కవిత ; -బృంద
నిను చూడ వేచిన
చిన్ని మొగ్గను నేను
లేతరేకుల తలుపులు
నాకు నేను తీసుకోలేను

వెలుగుతున్న తూరుపులా
మెరవాలనుంది
కలుగుతున్న కోరికలు
తీరాలనుంది

గగనాన పరచుకున్న
రంగులన్నిటినీ
దోసిళ్ల పట్టుకుని
నింపుకోవాలనుంది.

అంబరము నిండిన
మేఘమాలికల సందడి
సంబరాల జిలుగులు నా
నవ్వులకు అద్దుకోవాలనుంది.

సిందూర వర్ణాలు
పొంగించు సింగారములతో
ఒక్కొక్కరేకూ ముచ్చటగ
విప్పుకోవాలనుంది.

గిరుల నడుమన విరిసే
సిరులు పొంగే బంగరు
వెలుతురు పువ్వైన నీ
కిరణాల స్పర్శ  కావాలనుంది.

నీవు వచ్చే దారిని
నా చూపులన్నీ పరిచి
నీ పాదముల అడుగున
నలిగి పోవాలనుంది.

నీ వెలుగులే దోసిట పట్టి
హారతివ్వాలనుంది
అందుకుని అనుగ్రహించు
ఆగమించు ఆప్తమిత్రమా!

సుమనసు పాడేటి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు