అపురూపబంధం -రక్షాబంధనం…!!- సుగుణ అల్లాణి
 నీవు నాకు రక్ష!
నీకు దేవుడు రక్ష!
అన్ని చోట్లా దేవుడుండలేడని 
అమ్మను ఇచ్చాడట మనకు
అమ్మనాన్న అన్ని వేళలా 
మన వెంట ఉండలేరని అన్ననిచ్చాడు
అమ్మానాన్నల ప్రతిరూపం 
“అన్న”/తమ్ముడు!
తోబుట్టువు ల బంధం 
తొమ్మిది జన్మల అనుబంధం!
అన్నయ్య ఆదరణ 
తమ్ముని తోడ్పాటు
అక్క ఆత్మీయత
చెల్లెలి చెలిమి
ఈ బంధాలకు మరేది సాటి!
పసితనంలో ఎన్ని గిల్లి కజ్జాలున్నా
వయసొచ్చిన తర్వాత 
“అన్నా” ఒక్కసారి ఆర్తిగా పిలిస్తే  
ఆదరాబాదరాగా పరిగెత్తుకొచ్చి
చెల్లెలికి చీరలిచ్చి కాపాడిన 
శ్రీకృష్ణుని లా ఆదుకునే  “అన్న”,
తన చెల్లెలికి వచ్చిన ప్రతి ఆపదకి
తనే ముందుండి ఎదురు నిలిచే “అన్న”!
అమ్మతో కూడా చెప్పుకోలేని రహస్యాలు
తన అంతరంగంలో గుట్టుగా దాచే “అన్న”!
అలకలో కూడా అంతులేని అనురాగం
కినుక ఉన్నా కళ్లలో నిండైన కరుణ
సరదాల సంతోషాల్లో ఆత్మీయత
విభేదాలలో  కూడా వీడని విశ్వాసం
కష్టకాలంలో సడలనీయని ధైర్యం
ఇదే కదా తోబుట్టువుల స్నేహం!
రక్తసంబంధంతో పని లేని
అన్నా అన్న పిలుపే ఆర్తిని నింపుతుంది
సోదర ప్రేమ ను నిలుపుతుంది !
బంధాలను మరింత బలోపేతం చేసి
బంధుత్వాలను ధృఢం చేసుకొని
ఆహ్లాదకరమైన ఆనందాలను
అనుభవించడమే రక్షాబంధనం….!!
                      ***

కామెంట్‌లు