శిరసాభివందనం;- త్రిపురారి పద్మ.- జనగామ
భారత కీర్తి పతాకాన్ని
గగన వీధులపై
రెపరెపలాడించిన
భరతమాత ముద్దుబిడ్డలారా!

మేధో మదనామృత జ్ఞాన సంపన్నులారా!

నిరంతర సాధనా కృషీవరేణ్యులారా!

శ్రమ శక్తీ ఫలదాన భాగ్యశీలులారా!


విజ్ఞాన భాండ సుధా నిధులారా!


విశ్రాంతినెరుగని కార్యదక్షులారా!

ఓటమి  చిహ్నాలను చెరిపి
అనుభవ పాఠాలను తెలిపి
ఆత్మ విశ్వాసమనే విజయ కేతనమెగరేసిన
సుధా జ్ఞాన తేజులారా!


అందనిది చందమామని
ఎందెందు చెప్పిన
అందలమెక్కిన
మీ ప్రతిభా విశేషములతో
అందుకున్న 
మీ 
 కాంతి పుంజములు
భరతావనికి అందించిన
ఘన యశో మూర్తులారా!

తరతరాల భారత చరితకే వన్నె తెచ్చిన
 విశ్వ విఖ్యాతులారా!

భరత భూమిపై నర్తించిన ఆనంద తాండవానికి మూలధనులై నిలిచిన విజ్ఞాన శేఖరులారా!

ఆట పాటలు,సరదా సంబరాలు
పండుగలు చిత్రాలే
నిజమైన విజయాలనే
భ్రమలో బ్రతికే జనులకు  
సుజ్ఞాన సాధనారుచిని తెలిపి
ఆద్యంతం ఆస్వాదింప చేసిన
జ్ఞానపచనా
మూర్తులారా!

అలుపెరుగని సాధనతో
అనంత విశ్వానికి
దారులు చూపే
మార్గదర్శులై నిలిచిన శాస్త్రవేత్తలారా!
వందనం అభివందనం.
శిరసాభివందనం.

.

కామెంట్‌లు