గురువే ప్రత్యక్ష దైవం;- సి.హెచ్.ప్రతాప్

 భారతీయ సంస్కృతి గురువులకు విశిష్ట స్థానాన్ని కల్పిస్తూ ఆషాఢ పూర్ణిమను వ్యాస మహర్షి జయంతిగా గుర్తించి గురుపూర్ణిమగా అంగీకరించింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమాన స్థానం కల్పించి, తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే అని ప్రబోధించింది. తనకు గురువు. దైవం ఒకేసారి ప్రత్యక్షమైతే తాను మొదట నమస్కరించేది గురువుకేనని, ఎందుకంటే గురువు ద్వారానే భగవంతుని తెలుసుకోగలిగా నని అంటూ దైవంకంటే గురువే గొప్పవాడని తీర్పరించాడు కబీర్‌దాస్‌.
ప్రతి వ్యక్తికీ గురువు మార్గదర్శనం అవసరమే. శ్రీరాముడు వశిష్ట, విశ్వామిత్రుల వద్ద, శ్రీకృష్ణుడు సాందీపని మహర్షి వద్ద వినయ విధేయ తలతో శుశ్రూష చేసి విద్యలను గడించారు.
స్వర్గ సౌఖ్యాలు, సిరిసంపదలు, ధనధాన్యాలు, విద్యావైభవాలు, పుత్రపౌత్ర సుఖము… ఇలా ఏది కావాలన్నా గురువు అనుగ్రహంతోనే సాధ్యపడతాయి. గురు అనుగ్రహం లేకుంటే అవన్నీ దుర్లభాలే. గురువులు  అద్దంవలె నిర్మలంగా ఉంటారు. గురువు శిష్యు ని రూపాన్ని తన మనస్సులో తలచుకోగానే ఆ శిష్యునికి గురువు విజ్ఞానం బదిలీ అయ్యి, అతను గురువు ప్రతిబింబంగా మారతాడు.
ఆధ్యాత్మికత మనకు కనపడని, సూక్ష్మశాస్త్రం అయినందువలన ఆధ్యాత్మికంగా ఎదిగి మార్గం చూపించగల గురువును గుర్తించడం ఎంతో కష్టమైన విషయం. గురువు అధ్యాపకునికన్నా, బోధకుడికన్నా చాలా భిన్నమైన వాడు. అతడు ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక దీపం వంటి వాడు. అన్ని కుల-మతాలకు, సంస్కృతికి ఆధారమైన విశ్వ ఆధ్యాత్మిక శాస్త్రమును మనకు నేర్పిస్తాడు.బయటికి భౌతిక రూపములు వేరుగా ఉన్నా, గురువులందరూ ఒక్కటే. ఎలా అయితే ఆవు పొదుగు నుండి వచ్చే పాలు అన్నీ  స్వచ్చమైనవో అలాగే అందరు గురువులలోనూ ఉన్న గురు తత్వము ఒక్కటే. 
కామెంట్‌లు