సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -214
రశ్మి తృణాది న్యాయము
*****
రశ్మి అంటే వెలుగు,పగ్గము,కిరణము.తృణము అంటే గడ్డిపోచ.
రశ్మి తృణాది అంటే సూర్యకాంతి గడ్డి పోచ మొదలైనవి అని అర్థము.
రశ్మి తృణాది న్యాయము అంటే సూర్య రశ్మి గడ్డి పొరలపై బడినప్పుడు రంగరంగులుగా, చూడముచ్చటగా కనిపిస్తుంది. అదే సూర్యకాంతమణిపై  పడితే ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు అసలు సూర్య కాంత అంటే  ఏమిటో చూద్దాం. సూర్యకాంత మణి అంటే సూర్యరశ్మి తగలగానే నిప్పు రగిలే ఒక దినుసు రాయి. దీని మీద సూర్య కాంతి పడితే అది భగ్గున మండిపోవడమే కాకుండా చుట్టూ ఉన్న గడ్డి మొదలైన వాటిని కూడా తగులబెట్టిస్తుంది.
దీనినే వ్యక్తులకు అన్వయింప జేసి చూసినట్లయితే కొందరు ఇతర వ్యక్తులపై అర్థం కాని అనుగ్రహము కురిపిస్తూ ఉంటారు.మరికొందరిపైనేమో అకారణ ఆగ్రహము ప్రకటిస్తూ ఉంటారు.
అలా ఇతర వ్యక్తులపై ఆగ్రహము, అనుగ్రహము కారణం లేకుండా ప్రకటించడం  చూసి మన పూర్వులు మానవ స్వభావం ఇలా ఉంటుందని ఈ 'రశ్మి తృణాది న్యాయము'తో  పోల్చి చెబుతుంటారు.
 దీనినే తెలుగులో 'కొందరిని చూస్తే పెట్టబుద్ది అవుతుంది.మరికొందరిని చూస్తే తిట్టబుద్ది అవుతుంది' అంటుంటారు.
దీనినే పల్లె ప్రజలు మొత్తబుద్ది అవుతుంది,ఒత్తబుద్ది అవుతుందనే పదాలు వాడటం చూస్తుంటాం.
 పిల్లల స్థాయి నుండి కూడా మానవ స్వభావాన్ని బాగా తరచి చూస్తే ఇలాంటివి ఎన్నో దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి.
 పిల్లల్లో కూడా ఎవరైనా  అమాయకంగా కనిపిస్తే మిగిలిన పిల్లలు అది గ్రహించి వారిని గేలిచేయడం, అవమానిండం చూస్తుంటాం.
అలాగే కుటుంబంలో కూడా... నోరెత్తకుండా పని చేసే వారికి మరిన్ని పనులు అప్పచెప్పడం.ఆకారం మానసిక దృఢత్వం ఉన్న వారిని ఏమనకుండా వారిపై అతిగా అనుగ్రహం కురిపించడం చూస్తుంటాం.
ఇక కొందరు ఐతే సరేసరి. ఎవరినీ ఎందుకు ద్వేషిస్తారో, ఎవరిని ఎందుకు పిచ్చిగా అభిమానిస్తారో ఎంతకూ అంతుపట్టదు.
 అలాంటి విషయాల గురించి ఆలోచిస్తే, అలాంటి సంఘటనలు చూస్తుంటే మనసుకు చాలా కష్టం అనిపిస్తుంది కదా!
కొంతమంది తమ అధికారం,ఆధిపత్యంతో అనర్హులకు అవకాశాలు ఇవ్వడం,ఎన్నో అర్హతలున్న వారిని పక్కకు పెట్టడం చూస్తుంటే ..మానవ స్వభావం/ నైజం ఇలా ఎందుకు ఉంటుందో కదా అని ఈ" రశ్మి తృణాది న్యాయము" గుర్తు రాకుండా ఉంటుందా... మనసున్న మనిషి మనసు బాధతో నిట్టూర్చకుండా ఆగుతుందా!"
 సంస్కారం గల వ్యక్తులుగా ఇలాంటివి చేయ కూడదని ఈ న్యాయము ద్వారా గ్రహిద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
శివ కుమార్ చెప్పారు…
చాలా చక్కగా వివరించారు