నా తెలుగు ; -బృంద
తెల్లవారి వెలుగంత
హాయైన తెలుగును నేను
తెల్ల కలువల వంటి
చల్లని మనసు నాది.

పంట చేల మీద పరవశంగా
పరుగులు తీసే పడుచు
పసిడి పాదాల  సిరిమువ్వల
చిరుసవ్వడంత అందం నాది.

పోతన పలికిన సుందర
మందార మకరందపు
మధురమైన పలుకుల
మేలైన భావాల మెరుపు నాది.

అలతి పదాల అర్థాల
ఆటవెలదుల అలరారు
వేమన పొందికైన మాటల
తేల్చి చెప్పు జీవనరీతి నాది


పండువెన్నెల వెలుగులో
నిండు గోదారి మీద సాగే
పడవ ప్రయాణపు  పరవశాన
పాడుకునే పాట ఆనందం నాది

పచ్చని మల్లె పందిరి మీద
విచ్చిన మల్లెల పరిమళము
పరచుకున్న  పరిసరాల
ఆహ్లాదభరిత అనుభూతి నాది.

ఏటి ఒడ్డున మావకై 
ఎదురుచూపులు చూచు
ఎంకి ఎదలో ఎల్లువైన
మమతల భావం నాది.

ప్రతి పదములో ఒలుకు
వయ్యారి భావనల కులుకు
కవిత పంచు... పగడాల
ఆనందపు సిరులు నావి.

జామతోటలో తిరుగు
జాతి రామచిలుక పాడే
జానుతెలుగు మాటల
జావళీ సోయగము నాది.

అంత విభవమూ నేడు
పరభాషతో కలిపివేసి
పలుకుల తీరు మార్చి
పరాభవింప మూగనైతి

ప్రబల ప్రాభవము
కావ్య వైభవమూ
పద్య నేపధ్యమూ
గతాలే అయిన గతి నేడు

అక్షరాలు కోల్పోయి
అందాలు మాసిపోయి
ఆదరించు వారికై
వెదుకు ఆన్వేషణ నాది

పధ్ధతిగ పలికే పాఠాలు
ఒద్దికగ వాడే వినయాలు
నేర్పవలసిన అవసరమున్నా
నేర్చుకునే మనసే లేదీనాడు

నేటి నా ఈ గతిని మార్చి
వైభవపు బాట పట్టించు
భాషా ప్రేమికులకు ఇదే
నా వందనము...


కామెంట్‌లు