కోతిపుండు బ్రహ్మ రాక్షసి అయినట్టు
============================
ఒక చిన్న సమస్య ఇతరుల జోక్యంతో పెద్దగా అయినప్పుడు ఈ *కోతిపుండు బ్రహ్మ రాక్షసి అయినట్టు* నానుడిని వాడతారు. బాధ చిన్నదే కానీ పరామర్శించటానికి వచ్చినవారు వారికి తోచింది చెబుతూ ఆ బాధను పెద్దగా చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలోనే ఈ నానుడి వాడుతున్నాము. ఈ నానుడి కోతుల ప్రవర్తన నుండి వచ్చినట్టు తెలిస్తుంది.
కోతులు సంచార జీవులు. ఒక్కొక్కటి కాకుండా గుంపులుగా జీవిస్తాయి. ఉన్న చోట ఉండవు. ఏవేవో చేష్టలు చేస్తూ ఉంటాయి. అటు దూకుతూ ఇటు దూకుతూ అల్లరి చేస్తూ ఉంటాయి. ఇలా దూకే సమయంలో ఏ కొమ్మో, రెమ్మో గీసుకుని చిన్న చిన్న గాయాలు అవుతాయి. ఆ గాయం ఏమి చేయదు. తెల్లరితే మానిపోతుంది. కానీ ఏదైనా కోతికి గాయం కాగానే మిగతా కోతులన్ని వస్తాయి. వచ్చి పరామర్శిస్తాయి. చూసి పోతే బాగుంటుంది. కానీ అవి అలా చేయవు. గాయపడిన భాగాన్ని తమ చేతితో తుడుస్తాయి. గాయపడిన ప్రాంతంలో వేలు పెట్టి కెలుకుతూ గోళ్ళతో గోకి చూస్తాయి. ఇలా ప్రతి కోతి రావడం ఆ గాయంపైన కెలికి వెళుతూ ఉంటాయి. చిన్నగా ఉన్న గాయం పెద్దగా విస్తరించి పుండుగా మారుతుంది. అది మానటానికి చాల రోజులు పడుతుంది.
ఇలా ఈ కోతులు చేసే చేష్టాలు కారణంగా ఈ నానుడి ఏర్పడింది. ఇది కోతుల నైజాన్ని తెలిపే నానుడి. మేలుకోరేవారే అయినా అజ్ఞానంతో, అత్యుత్సహంతో చేసే పనులు చివరికి బాధను కలిగిస్తాయి. అలాంటి దాన్ని తెలియజేయడం కోసం ఈ నానుడి వాడుతూ ఉంటాము. ఇదే 'కోతి పుండు బ్రహ్మ రాక్షసి అయినట్టు'
నానుడి కథలు ౼డా.దార్ల బుజ్జిబాబు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి