ఆత్మను తెలియజేసే వేరొక చిత్ అంటే జ్ఞానం ఎక్కడా లేదు.అంతటే వున్నది ‘సత్’యే ‘చిత్’. అనగా.. ఉన్నదే జ్ఞానం. కనుక జ్ఞానంగా ఉన్న ఆ సద్వస్తువే నేను’’ అని దీని అర్థం. సత్’ అంటే ఎన్నటికీ నశించనిది. అన్ని కాలాల్లోనూ ఉండేది. ‘కాలత్రయే అపితిష్టతి ఇతి సత్’ అని శాస్త్రం అంటోంది.చెట్టులో కొమ్మలు, ఆకులు, పూలు, కాయలు ఉన్నట్టుగా ఆత్మలో సత్ చిత్ ఆనందం అనే మూడు అవయవాలు లేనే లేవు. ఆత్మ ఒక్కటే. సత్తే చిత్, చిత్తే ఆనందం. అంటే ఎల్లప్పుడూ ఉండే జ్ఞానస్వరూపమే, ఆనంద స్వరూపమే ఆత్మ అని భావం. దాని స్వరూపమే ప్రకాశం. సూర్యుని ప్రకాశింపజేయడానికి వేరొక వెలుగు లేనట్లే.. ఆత్మను ప్రకాశింపజేయడానికి వేరొక ప్రకాశం లేదు అన్న విషయాన్ని మన మహర్షులు ధ్యానంలో గ్రహించారు. ఆత్మను తెలుసుకోవడం అంత తేలిక కాదు. తనకు తానే ప్రమాణం గనుక ఆత్మను అనుభవం ద్వారానే గ్రహించాలి అని పతంజలి యోగ సూత్రాలు కూడా తెలియజేస్తున్నాయి.
ప్రాణాయామంలాగే దేవతామూర్తి (రూప) ధ్యానం, మంత్రజపం, ఆహార నియమం మొదలైనవి మనస్సును తాత్కాలికంగా నియమిస్తాయి. వీటివల్ల మనస్సుకు ఏకాగ్రత లభిస్తుంది. ఏకాగ్ర చిత్తానికి ఆత్మవిచారం సులభం. నియమాలు అన్నిటిలోకి మిత సాత్త్విక ఆహారనియతి శ్రేష్ఠమైనది, మనస్సు యొక్క సాత్త్విక సత్తువను పెంపొందించి ఆత్మవిచారానికి తోడ్పడుతుంది.
ఆత్మచింతన తప్ప ఇతర చింతలు (తలపులు, ఆలోచనలు) పుట్టుటకు కొంచెమైనా తావీయక, ఆత్మనిష్ఠాపరుడై ఉండటమే తనను తాను దేవునికి అర్పించుకోవడం. ఈశ్వరునిపై ఎంత భారం మోపినా ఆయన దానిని భరిస్తాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి