ప్రయాణం- తిరుపతి-2;- ప్రమోద్ ఆవంచ- 7013272452




శ్రీకాళహస్తిలో రాహువు కేతువుల పూజకు మేం కూర్చున్న హాలులో వేయి మంది భక్తులకు పైనే ఉన్నారు.నలుగురు బ్రాహ్మణులు తెలుగు,కన్నడ, తమిళ భాషల్లో మంత్రాలను పఠిస్తూ,మా అందరితో
పూజా క్రతువు నిర్వహించారు.దాదాపు గంటన్నర పాటు చాలా పద్ధతిగా మాతో చేయించారు.పూజ అయిపోయింది, బయటకు వచ్చాం.వాసు మా కోసం బయట సిద్దంగా ఉన్నాడు.పదండి దర్శనానికి వెళ్దాం అన్న వాసుతో మేం అనుసరించాం,ఏ గేట్ దగ్గర మిమ్మల్ని ఆపలేదు, డైరెక్ట్ గా ఈశ్వరుని విగ్రహం ముందు..అంటే గర్బ గుడిలో కాదు ప్రదాన ద్వారం ముందు వరకు తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టించాడు. శ్రీకాళహస్తీశ్వరుని దివ్య దర్శనం కనుల నిండుగా జరిగింది.మనసు ఆనందంతో ఉప్పొంగింది.రష్ ఎక్కువగా ఉండడం వల్ల మమ్మల్ని కొంచెం విడిగా నిల్చోబెట్టి, ఇంకొంచెం సేపు తనివితీరా ఆ పరమేశ్వరుడిని భక్తితో ఓం నమశ్శివాయ అంటూ జపిస్తూ, చూస్తూ ఉండిపోయాం.మనం మనసా వాచా
నమ్మే దైవాన్ని ఆరాధిస్తూ,మనసులో నిరంతరం జపిస్తూ ఉంటే కొన్నిసార్లు అప్రయత్నంగా పెదాలు దాటి
బయటకు కూడా వినిపిస్తుంది.మనసంతా అద్బుతమైన అనుభూతి,దగ్గరి నుంచి కనులారా తిలకించిన తృప్తితో, అమ్మ వారి గుడి వైపుకు అడుగులు వేసాం.అక్కడ అప్పుడే అభిషేకం అయ్యింది, అమ్మ వారి నిజ రూప దర్శనం కనుల పంటగా జరిగింది.ఆ క్షణంలో నాకు మా అమ్మ జ్ఞాపకం
వచ్చి కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి.మా అమ్మను,
ఆ జగన్మాతను మనసులో స్మరించుకుంటూ గుడి బయటకు వచ్చాం.పొద్దున్నే ఆరింటికే లేవడం,పూజ, దర్శనాలు పూర్తయ్యే సరికి పదిన్నర అయింది. కడుపు ఖాళీ అయి ఆత్మారాముడు అసహనంగా ఉన్నాడు.
అప్పుడే మా ప్రత్యక్ష దైవం వాసు ప్రసాదాల కౌంటర్ కి 
వెళ్లి పుళిహోర,లడ్డు, గారెలు,జిలేబిలు పట్టుకొచ్చి ఇచ్చాడు.ఆ ప్రసాదాలతోనే మా ఫాస్టింగ్ బ్రేక్ చేసాం.
అక్కడి నుంచి సరాసరి మేం బస చేసిన రూంకి వెళ్ళాం.ముందు రాత్రి ట్రైన్ లో సరిగ్గా లేకపోవడంతో,
నిద్రా దేవత వడిలోకి జారిపోయాం.సరిగ్గా పన్నెండున్నరకు మెళకువ వచ్చింది.తయారై లగేజీ సర్దుకుని, తిరుపతి వెళ్ళడానికి శ్రీకాళహస్తి బస్టాండ్ కి
వచ్చాం....కట్ చేస్తే...
                              సాయంత్రం అయిదు గంటలకు తిరుమలలో హంపి మఠంలోనీ ఏసీ గదికి చేరాం.ఈ 
హంపీ మఠం గర్బ గుడి నుంచి పాపవినాశనం వెళ్ళే దారిలో ఒక కిలోమీటరున్నర దూరంలో ఉంది.
అటువైపు ట్రాన్స్పోర్టేషన్ సదుపాయం అంతగా లేదు.
తలస్నానం చేసి, దర్శనానికి ధోవతి కట్టుకుంటేనే రానిస్తారని తెలిసి, శ్రీకాళహస్తిలో కొన్న ధోవతి, కండువ
ధరించి,ఆ ఏడుకొండల స్వామి దర్శనానికి బయల్దేరాం.
మూడు నెలల ముందే మూడు వందల రూపాయల దర్శనం టికెట్లను ఆన్లైన్లో బుక్ చేయడం, మాకు దర్శనం టైం సాయంత్రం ఏడు గంటలకు ఇవ్వడం జరిగింది.
బుక్ చేసిన టికెట్,మన ఆధార్ కార్డు రెండు ప్రింటవుట్స్
పట్టుకొని లైన్లో నిలబడాలి.సరే టికెట్ అంటే మనం బుక్
చేసామని ప్రూఫ్ కోసం అనుకుందాం,మరి ఆధార్ కార్డు ఎందుకో నాకు అర్ధం కాలేదు.సరేవాటిని చెక్ చేసి, మమ్మల్ని చెకింగ్ పాయింట్ నుంచి లోపలికి పంపారు.
అలాగే వెళుతూ వెళుతూ ఎనిమిదింటికి ఇంకో చెకింగ్ ప్లేస్ వద్దకు వెళ్ళాం,అది సెక్యూరిటీ చెక్.అయిపోయాక
ఒక కంపార్ట్మెంట్ లో యాబై నుంచి వంద మంది చొప్పున కూర్చోబెట్టారు.ఓ అరగంట తరువాత మా కంపార్ట్మెంట్ లోని వాళ్ళను వదిలారు.అప్పటికే రాత్రి తొమ్మిదయింది,లైను మెల్ల మెల్లగా సాగుతోంది.ఇంకో వంద మీటర్ల దూరంలో శ్రీనివాసుడు ఒకటి... రెండు..
అయిదు..పది... పదిహేను నిమిషాలు.. దగ్గరకు వచ్చేసాం..ఆ ఆపద మొక్కుల వాడు అనాద రక్షకుడు
తన దివ్య రూప దర్శనం.ఒక్క క్షణం ఆ దేవ దేవుడిని
కనులారా తిలకించాం.జన్మ తరించిందన్న భావం. ఊహలకందని ఆనందం.గర్బ గుడి నుంచి బయటకు
వచ్చేవరకు తొమ్మిది నలబై అయిదు నిమిషాలు అయ్యింది.అది ఒక రకంగా దర్శనం తొందరగానే అయ్యిందనే చెప్పవచ్చు.లడ్డూ ప్రసాదం తీసుకుని, కాసేపు ఫోటో సెషన్ తర్వాత రూంకి వెళ్ళిపోయాం...
                                  తెల్లారాక తిరుమలలో చూసే ప్రదేశాలు..1.శ్రీ వారి పాదాలు 2.పాపవినాశనం 3.ఆకాశగంగ 4.శిలా ద్వారం 5.చక్రతీర్థం 6. వేణుగోపాలస్వామి టెంపుల్. వీటిని చూసేందుకు
పదహారు వందలు పెట్టి ఒక జీప్ ను మాట్లాడుకున్నాం.
జీపులో అయితే అడవి అందాలను చూడడానికి సులభంగా ఉంటుందని మా అభిప్రాయం.వంకలు తిరిగిన ఆ ఘాట్ రోడ్డుపై ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా అనిపించింది.నేను పదిహేళ్ళ  క్రితం వచ్చినప్పుడు పాపవినాశనం దగ్గర వాటర్ ఫాల్స్ ఉండేవి.కా నీ ఆ స్థలంలో ఏదో డ్యాం నిర్మాణం జరుగుతున్నందున పక్కన ఆర్టిఫీషియల్ గా వాటర్ నీ
పైపుల ద్వారా వదులుతున్నారు.అది కొంచెం బాధ అనిపించింది.శ్రీ వారి పాదాలు చూడడానికి మెట్లు ఎక్కి
మెట్లు దిగుతుంటే అక్కడి వాతావరణం చాలా బాగుంది.చక్రతీర్థంలో శివలింగం, లక్ష్మి నరసింహుడు నాగదేవత, సుదర్శనుడు, మెట్లు పైకి ఉండి, కొంతదూరం వెళ్లాక ఆ మెట్లు కిందకు దిగితే అక్కడ ఈ
దేవతా విగ్రహాలు ఉన్నాయి.పది గంటల నుంచే ఎండ
ఎక్కువ కాసాగింది.నడక ప్రాక్టీస్ లేక కొంచెం ఆయాసం వచ్చినా ఆ ప్రదేశాలు అలసటను పారద్రోలాయి.
ఆకాశ గంగ, వేణుగోపాలస్వామి ఆలయం దర్శనం తర్వాత అన్నదాన సత్రంలో ఫ్రీ భోజనం చేసాం.ఒక బంతిలో వేయి మంది భక్తులు కూర్చోని తిన్నా ఆ పరిసరాలు శుభ్రంగా ఉన్నాయి,అదే ఆశ్చర్యం వేసింది.భోజనాల దగ్గరే కాదు,గర్బ గుడి చుట్టూ ఒక 
రెండు, మూడు కిలోమీటర్ల మేర ప్రదేశమంతా చాలా పరిశుభ్రంగా ఉంది.రోజుకి వేల మంది భక్తులు దర్శనానికి వచ్చినా ఆలయ ప్రాంగణం అంతా చెత్త, దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంటుంది.అది నాకు బాగా నచ్చింది.
                                  భోజనం చేసి కింద తిరుపతికి వచ్చాం.సమయం అయిదు గంటలయ్యింది.కింద తిరుపతి లో చూడవలసినవి పద్మావతి అమ్మవారి టెంపుల్, గోవిందరాజుల స్వామి గుడి,కపిల్ తీర్థం....
కపిల తీర్థంలో సుందరమైన కొలను, చుట్టూ గుట్టలు 
అద్బుతమైన దృశ్యం.అన్ని దర్శనాలు పూర్తయ్యాక
రాత్రి ఎనిమిదిన్నరకు రైల్వే స్టేషన్ కి చేరుకున్నాం.
తొమ్మిదింటికి తిరుపతి టూ జమ్మూ వయా సికింద్రాబాద్..హోమ్ సఫర్ ఎక్స్ప్రెస్ రైలుకి ముందే రిజర్వేషన్ చేయించుకున్నాం.అలా జరిగింది మా తిరుపతి,తిరుమల ప్రయాణం....
                                  
కామెంట్‌లు