సున్న విలువ;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు 6302811961.
 ఏదైనా ఒక అక్షరాన్ని కానీ పదాన్ని కానీ  ఒక అంకెను కానీ ఏర్పాటు చేశారు అంటే దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది  ఒకటి నుంచి తొమ్మిది వరకు అంకెలు అందరుకు తెలిసినవే  ఆ తర్వాత ఏం చేయాలి ఏ అంకెతో మిగిలినవి ఏర్పాట్లు చేయాలి అనుకున్నప్పుడు  భారతీయుడు సున్నను కనిపెట్టాడు అని చెబుతారు  ఉపనిషత్తుల్లో కూడా ఇదంపూర్ణం అదంపూర్ణం అంటూ సున్నతో సున్నను హెచ్చించిన తీసివేసిన భాగించిన కూడినా తిరిగి వచ్చేది సున్నా మాత్రమే అని చెప్తారు ఏ విలువ లేకపోయినట్లయితే ప్రపంచానికి ఆదర్శంగా ఉన్న  ఆ సున్నను కనిపెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది  ఆ సున్నలేని పదాలు ఎన్ని ఉన్నాయి  అసలు ఆ సున్న లేకుండా మనం ఏ పనినైనా చేయగలమా అన్న ఆలోచన ప్రతి వారికి వస్తుంది.
ఎదుటివారి గొప్పతనాన్ని తెలియజేయడానికి  వాడు పండితుడు అని చెప్పినా  ఎందుకూ పనికిరాని అతని కుమారుని గురించి పండిత పుత్రుడు అని చెప్పిన  ఆ రెంటిలోనూ సున్న ఉండి తీరవలసినదే నీ జాతి ఏదో చెప్పాలి అంటే హిందూ జాతి అని చెప్పడం  నీవు ఎవరు అంటే ఆంధ్రుణ్ణి అని చెప్పడం  సున్నా లేకుండా చెప్పగలమా  ఈ సున్నా పదితో కలిపి పంది అవుతుంది  నదిలో దూరితే నంది అవుతుంది  ఏ పదాన్ని మనం మాట్లాడాలన్నా దానికి సున్నా జీవాన్ని ఇస్తుంది.  ఒకటి ప్రక్క ఎన్ని సున్నాలు పెడితే అంత విలువ పెరుగుతుంది. నీ కొంపను గురించి మాట్లాడవలసి వచ్చినా సంసారాన్ని గురించి మాట్లాడవలసి వచ్చినా ఆ రెండు పదాలకు కూడా సున్నా ఉండి తీరవలసినదే  మీ పార్టీ ఏది అంటే కాంగ్రెస్  తెలుగుదేశం  కమలం  అని చెప్పడానికి కూడా సున్నా అవసరమే కదా.జీవితం మరణం  ఈ రెంటి మధ్య ఆరంభం  శూన్యం లేకుండా ఉంటుందా  ఆ శూన్యంలో కూడా  సున్నా ఉండవలసినదే కదా  అందులోనూ ఉంటుంది ఇందులో ఉంటుంది  అన్న దాంట్లో సందేహమే లేదు అన్నదాంట్లో కూడా ఉంది  సత్యం శివం సుందరం  అన్నిట్లోనూ అదే కదా  అది లేకపోతే అందమేముంటుంది ఆనందమేముంటుంది ఈ జీవితంలో  చివరకు మిగిలేది సున్ననే కదా భగవంతుని పిలవాలంటే గోవిందా ముకుంద శంభో శంకర సున్నాలు ఉన్నవే తప్ప  ఏడుకొండలవాడా వెంకటరమణ అన్నదానిలో కూడా  తప్పనిసరిగా అది ఉండి తీరవలసినదే కాలంతోటి అది పరిగెడుతుంది ప్రతి గంట ప్రతి దినం ప్రతివారం ప్రతిపక్షం ప్రతి మాసం ప్రతి సంవత్సరం అన్నిటి నుండి కాలచక్రమును  అది తిప్పుతోంది మరి దాని అవసరం లేని పదం ఏముంది.


కామెంట్‌లు