ప్రయాణం...పండర్ పూర్- అక్లూజ్..;- ప్రమోద్ ఆవంచ 7013272452



 ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు ఒక కుమ్మరి.
కుండలు చేస్తుంటాడు.ఆయన భార్య అంజలీదేవి.వారిది 
మహారాష్ట్ర...పండర్ పూర్ కి  చెందిన మద్య తరగతి కుటుంబం.అక్కినేని నాగేశ్వరరావు గొప్ప పాండురంగ దేవుడి భక్తుడు.ప్రతి క్షణం పాండురంగడి ధ్యాసలోనే, ఆయన ధ్యానంలోనే తరిస్తుంటాడు.పాండు రంగడిని కీర్తించుకుంటూ పాటలు పాడుతూ తన కుల వృత్తిని కొనసాగిస్తుండేవాడు.ఒకరోజు అక్కినేని నాగేశ్వరరావు కుండలు చేసేందుకు మట్టిని కలుపుతూ 
కాళ్ళతో తొక్కుతూ పాండురంగడిని స్మరిస్తూ,భక్తి పారవశ్యంలో ఆయన వైభవాన్ని పాట రూపంలో పాడుతుంటాడు.పాండురంగడి ధ్యాసలో మైమరిచి పోయి, ప్రపంచాన్నే మర్చిపోతాడు.వంటింట్లో అంజలీ దేవి వంట పనిలో నిమగ్నమై ఉండగా వాళ్ళ రెండేళ్ల కొడుకు అంబాడుకుంటూ,మట్టి కల్లంలోనికి వెళ్ళి పోతాడు, భక్తి పారవశ్యంలో తనను తాను మరిచిపోయి
నాగేశ్వరరావు తన కొడుకును మట్టితో పాటు తొక్కడంతో చనిపోతాడు.వంట పూర్తయ్యాక బయటకు వచ్చిన అంజలీదేవికి కొడుకు కనబడక పోయేసరికి ఇల్లంతా వెతుకుతుంది,తీరా మట్టిలో రక్తపు మడుగులో తడిసిన
తన కొడుకు శరీరాన్ని చూసి పెద్దగా అరుస్తూ కుప్పకూలి పోతుంది.... ఎనకటికి ఎప్పుడో చూసిన సినిమాలోని ఒక భక్తి రస సన్నివేశం.ఆ తరువాత పాండురంగడు ప్రత్యక్షమై నాగేశ్వరరావు కొడుకను బతికించడంతో ఆ సన్నివేశం సుఖాంతం అవుతుంది.ఇదీ పాండురంగ విఠలుడి దివ్య లీలల్లో ఒక కథ.ఇది కథ కాదు... నిజంగా జరిగింది.ఈ కథకు సంబంధించిన ఆనవాళ్ళు ఇంకా ఆ ఊరిలో ఉన్నాయి...కట్ చేస్తే....
             సోలాపూర్ లో మొదటి రోజు పని రాత్రి తొమ్మిది గంటలకు పూర్తయింది.ఆ రోజే  నిర్ణయించుకున్నాను,
తెల్లారాక పండర్ పూర్ కి వెళ్ళాలని,తీరా అక్కడి నుంచి
అక్లూజ్ యాబై కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిసి, అక్కడికి వెళ్లి వచ్చే దారిలో పండర్ పూర్ చూడాలని
అనుకున్నాను.మొదట అక్లూజ్ వెళ్ళాను.అక్లూజ్ సోలాపూర్ జిల్లాలోని ఒక తాలూకా కేంద్రం.అంతగా అభివృద్ధి చెందని మామూలు ఊరు.ఆ ఊరిలో మనం చూడదగిన ప్రదేశాలు శివశృష్టీ... మహారాజా శివాజీ జీవిత చరిత్రకు సంబంధించిన వస్తువులను ఒక మ్యూజియంలా ఏర్పాటు చేశారు.శివపార్వతీ టెంపుల్
ఆనందీ గణేష్ టెంపుల్,వాటర్ పార్క్,లేజర్ షో.... ఇవి
చాలా బాగున్నాయి.నేను చూడలేదు.చూసే సమయం లేదు.మన దగ్గర గ్రామ దేవతలైన ఎల్లమ్మ, పోలేరమ్మ
లాగానే అక్కడ కూడా అక్లాయిదేవీ అనే గ్రామ దేవతను
పూజిస్తారు.అదీ మన లాగానే ఆశాడ మాసంలో పండగ
చేస్తారు.నేను ఆ ఊరికి వెళ్ళిన రోజు మంగళ గౌరీ వ్రతం
ఆడవాళ్ళంతా తమ భర్తలు క్షేమంగా ఉండాలని చేసే పూజ.ఆ రోజు అక్కడి ఆడవాళ్ళంతా భక్తి శ్రద్ధలతో ఆ 
పూజను చేసుకుంటారు.అక్కడి నుంచి పండర్ పూర్
బయలుదేరి వెళ్ళాను.పండర్ పూర్ కూడా సోలాపూర్ లో
ఒక తాలూకా కేంద్రం.అంతే కాకుండా పిలిగ్రీమ్ ప్లేస్. ఆ ఊర్లో ఒక యూరాలజిస్ట్ పేరు డాక్టర్ పియూష్ గడమ్,ఆయన నాన్నగారు స్థానికంగా మంచి పేరున్న బిజినెస్ మ్యాన్.ఎంత పేరంటే బస్టాండులో దిగి గడమ్ హాస్పిటల్ ఎక్కడ అంటే ఆటో డ్రైవర్ డైరెక్ట్ గా తీసుకెళ్ళి
అక్కడ దింపేంత... సోలాపూర్ అయినా పండర్ పూర్ అయినా అక్కడ డాక్టర్లు చాలా మంచి వాళ్ళు.చాలా
డౌన్ టూ ఎర్త్.అక్కడ ఏ డాక్టర్ ని కలిసినా మన ఇళ్ళల్లో లాగానే కనీస మర్యాదలైన నీళ్ళు,ఛాయ తాగుతారా అని
అడుగుతారు.అది నాకు బాగా నచ్చింది.ఇంకో విషయమేమిటంటే నేను ఎక్కువ చెపుతున్నాననుకోకండీ
పండర్ పూర్ లోని డాక్టర్ పియూష్ గడమ్... మీరు టెంపుల్ కి వెళతారా అని అడిగారు,ఆ.. వెళ్తాను సార్ ఇంత దూరం పాండురంగడి దర్శనం చేసుకోకపోతే ఎట్లా
అని అన్నాను.నా ముందే ఆ గుడికి సంబంధించిన వాళ్ళకు ఫోన్ చేసి, మరాఠీ భాషలో ఏదో చెప్పాడు.మీతో 
పాటు మా ఓటీ( ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్) వస్తాడు, గుడిలో వీఐపీ దర్శనం చేయిస్తాడు,అని చెప్పాడు ఇంగ్లీషులో.ఆ క్షణంలో నేను మా ప్రీతి యూరాలజి అండ్ కిడ్నీ హాస్పిటల్ ఓనర్ డాక్టర్ చంద్రమోహన్ గారికి మనసులోనే నమస్కారాలు తెలుపుకున్నాను.ఆయన మూలంగానే కదా నాకు ఈ రోజు ఇక్కడి డాక్టర్ ఇంత రెస్పాన్స్ ఇస్తున్నాడు,అని..
కట్ చేస్తే....
                      పండర్ పూర్.... పాండురంగ విఠలుడు కొలువై ఉన్న ఒక పుణ్యక్షేత్రం.చంద్రభాగా నది(భీమా నది)
ఒడ్డున రుక్మిణీ అమ్మవారు సహిత పాండురంగడు వెలిసి 
దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన  భక్తుల పూజలను అందుకుంటున్నాడు.పండర్ పూర్ నుంచి భీమా నది ప్రవహిస్తుంది.అలా ప్రవహించే క్రమంలో దక్షిణ దిశగా తిరిగి మళ్లీ తూర్పు వైపుకు మళ్ళుతుంది.అది చూడడానికి చంద్రాకారంలో ఉండడం వల్ల పండర్ పూర్
లోని భీమా నదిని చంద్ర భాగ నది అని అక్కడి వాళ్ళు
పిలుచుకుంటారు.గుడిని ఆనుకొని చంద్ర భాగ నది ఘాట్
ఉంటుంది,ప్రస్తుతం నీళ్ళు అంతగా లేవు.ఆ నీళ్ళను శ్రీమహావిష్ణువుగా అక్కడి ప్రజలు భావిస్తారు.సాక్షాత్తూ 
శ్రీ మహావిష్ణువే పాండురంగ విఠల్ అవతారమనీ వారి
నమ్మకం.పదకొండవ శతాబ్దంలో ఈ ఆలయం యాదవ
రాజుల ఆదీనంలో ఉండేదని అక్కడ లభించిన శాసనాల
ద్వారా తెలుస్తోంది.ఆ తరువాత పద్దెనిమిదవ శతాబ్దంలో
మరాఠాలు స్వాధీనం చేసుకుని ఈ ఆలయాన్ని,పండర్ పూర్ పట్టణాన్ని అభివృద్ధి చేసారు.ప్రస్తుతం ఈ ఆలయం
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది.....కట్ చేస్తే...
                  కృష్ణ...గడమ్ హాస్పిటల్ లో ఓటీ టెక్నీషియన్
పొడవైన మెలితిప్పిన మీసాలు, ఫ్రెంచ్ స్టైల్ గడ్డం.చిన్న 
వయసు అంటే ముప్పై ఏళ్ల లోపే ఉంటుంది.ఒక్క మరాఠీ
భాషే కాదు, హిందీ కూడా బాగా మాట్లాడుతున్నాడు.నేను
హిందీలో తడబడుతూ ఇంగ్లీషు మాట్లాడుతే... ఇంగ్లీషు
కూడా అర్థం చేసుకుంటున్నాడు.నేను మాట్లాడే హిందీ ఓకేగా ఉంటుంది,మరీ అంత బాగుండదు...అంత చండాలంగా కూడా ఉండదు.కృష్ణ గత రెండేళ్లుగా డాక్టర్
పీయూష్ దగ్గర ఓటీ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు.
నేను, కృష్ణ కలిసి నాలుగు గంటలకు ఆలయ వీఐపీ దర్శనానికి రుక్మిణీ ఉత్తర ద్వారం వద్దకు చేరుకున్నాం.
స్వామి వారికి అలంకరణ జరుగుతుంది,అరగంట సమయం పడుతుంది,అప్పట వరకు లోపలికి వెళ్ళి కూర్చోండనీ బయట సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు.
లోపలికి వెళ్ళాం, చాలా పురాతనమైన ఆలయం.ఎంతైన
మెట్లు,మద్యలో కొందరు భక్తులు సాంప్రదాయ మరాఠా వస్త్రాలు ధరించి భజన చేస్తున్నారు.వాళ్ళని నా సెల్ ఫోన్లో బంధించాను.ఆ తరువాత కొంచెం సేపటికి దర్శనానికి వెళ్ళే గేట్స్ తెరిచారు.వీఐపీ దర్శనం కాబట్టి
అంత రద్ది లేదు.చాలా దగ్గర నుంచి పాండురంగ విఠలుడి
దివ్య దర్శనం కనులారా చేసుకున్నా,దివ్యాభరణాలతో 
అలంకరించబడిన విఠలుడు వెలిగిపోతున్నాడు.ఆ మహిమాన్వితుని దర్శనం అనంతరం పక్కనే ఉన్న రుక్మిణీ అమ్మవారి దర్శనం బయటికి వచ్చాం.దర్శనం చాలా బాగా జరిగింది.
                బయటకు వచ్చాక కృష్ణ,నేను కొన్ని ఫోటోలు దిగాం.సమయం సాయంత్రం అయిదున్నర అయ్యింది.
అప్పుడు ఆకలి అయినట్లు అనిపించింది.పొద్దున ఎనిమిది గంటలకు సోలాపూర్ లో టిఫిన్ చేసి బయలు దేరాను.అక్లూజ్,పండర్ పూర్ లలో పని పూర్తయ్యే 
వరకు ఈ టైం అయ్యింది.ఏమైనా తిందాం అని కృష్ణను 
అడిగితే ఈ టైంలో ఏమీ దొరకవు సార్,అన్నాడు,సరే అని ముందుకు నడుస్తుంటే ఒక పానీపూరీ బండి కనిపించింది.
పానీపూరీ తిన్నాక బస్సెక్కి సోలాపూర్ చేరే వరకు రాత్రి
ఎనిమిది గంటలు అయ్యింది.....
                                       
కామెంట్‌లు