స్వేచ్ఛ లేని గురువు;- మొర్రి గోపి కవిటిశ్రీకాకుళం జిల్లా8897882202
 గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగును
అజునికైన వాడి అబ్బకైన
తాళము చెవి లేక తలుపెట్లు ఊడును
విశ్వదాభిరామ వినురవేమ!
****
బ్రహ్మకైనా, బ్రహ్మను పుట్టించిన బ్రహ్మ తండ్రి కైనా గురు బోధ లేకుండా అజ్ఞానం తొలగలేదు. తలుపు తీయడానికి తాళం చెవి ఎంత అవసరమో, శిష్యుల వికాసానికి గురు బోధ అంతటి గొప్ప అవసరం. అందుకే గురువును తాళం చెవితో పోల్చారు. ప్రాచీన కాలంలో గురు శిష్యుల పరంపరను , ఆధునిక కాలంలో గురు శిష్యుల బంధాలను సరిపోల్చుకుంటే ఎంతో వ్యత్యాసం కనబడుతుంది. గురుకులాలలో గురువులకు సేవలు చేస్తూ రాజులైన, సామాన్యులైన సకల విద్యలు నేర్చుకునేవారు. గురువుకు విద్యాబోధనలో స్వేచ్ఛ ఉండేది. 20వ శతాబ్దం మలి దశ వరకు గురువు సమాజ అభివృద్ధిలో కీలకంగా ఉంటూ, బోధించిన శిష్యుల మన్ననలు పొందుతూ ముందడుగు వేశారు.
       మట్టిలో మాణిక్యాలు వెతకడం, రాళ్లను రత్నాలుగా మార్చడం గురువు చేతిలోనే ఉంది. ఎంతోమంది పేద విద్యార్థులకు దిశా నిర్దేశనం చేస్తూ, వారి బ్రతుకులలో విజ్ఞానపు కాంతులు వెలిగించిన గురువులు ఎందరో ఉన్నారు.
      20వ శతాబ్దపు మలిదశలో విద్య వ్యాపారమైంది. కార్పొరేట్ చేతుల్లోకి విద్య ఎప్పుడైతే వెళ్లిందో, తల్లిదండ్రుల ఆలోచన సరళి మారింది. పిల్లలను అతిగారాబం చేస్తున్నారు. పాఠశాలలో క్రమశిక్షణ తప్పిన పిల్లలకు ఏ చిన్న శిక్ష వేసిన, తల్లిదండ్రులు గురువులపై దాడులు చేస్తున్నారు. పిల్లలు ఎదుటే గురువులను దూషిస్తున్నారు. మరి గురువంటే గౌరవం పిల్లలకు ఎక్కడ ఉంటుంది. స్వేచ్ఛ లేని బోధనలో గురువులు అల్లాడుతున్నారు. కేవలం పిల్లల తల్లిదండ్రులే కాదు,పాఠశాల వ్యవస్థను సరిదిద్దాల్సిన పెద్దలు అధికారులు కూడా 50 మంది విద్యార్థుల్లో ఏ ఒక్క విద్యార్థి నోటు పుస్తకం రాయకపోయినా , ఆ తప్పు ఉపాధ్యాయుడిదే అంటూ విద్యార్థుల ఎదుట శివాలెత్తుతున్నారు. విద్యార్థుల ప్రజ్ఞ సామర్ధ్యాలు కు అనుగుణంగా బోధన చేయడానికి ఇంతకుముందు ఉపాధ్యాయుడికి స్వేచ్ఛ ఉండేది. కానీ సకాలంలో సిలబస్ పూర్తి కాకపోతే అధికారుల బెదిరింపులు ఎక్కువ అయ్యాయి. పరీక్షలు సకాలంలో పూర్తి చేయడం, ఆ పరీక్షకు సంబంధించిన సిలబస్ పూర్తి చేయడమే ఉపాధ్యాయుల లక్ష్యంగా మారిపోయింది. విద్యార్థులతో వర్క్ బుక్స్ రాయించడం, అవి పేజీ పేజీ దిద్దడం, నోట్సులు సక్రమంగా రాయించడం ఉపాధ్యాయుడికి తలకు మించిన భారంగా నేడు మారింది. విద్యార్థులలోక్రమశిక్షణ లేని విద్యా వ్యవస్థ నేడు పెరిగిపోతున్నది. విద్యార్థుల క్రమశిక్షణ గురించి అడిగే అధికారులు లేరు. విద్యార్థులు తమకు నిర్దేశించిన రాతపనులు చేయకపోయినా అధికారులచే ఉపాధ్యాయుడు నిందించబడుతున్నాడు. ఇది నేటి గురువుల పరిస్థితి. గురువుకు స్వేచ్ఛ లేదు. పాఠశాలలో ఆన్లైన్ పనుల భారం పెరిగిపోయింది.
బోధన అంటే ఆనందం కాకుండా వేదనగా నేడు మిగులుతున్నది
****
****

కామెంట్‌లు