శారదాపురములో....... పార్వతీ పుత్రుడు.;- బల్ల కృష్ణ వేణి పలాస శ్రీకాకుళం జిల్లా 93989 05803

 శారద పురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామ ప్రజల ఇల్లు సమీపంలోనే ఒక పాఠశాల ఉంది. అక్కడి ప్రజలందరూ చెత్తను అంతా తెచ్చి పాఠశాల ప్రక్క స్థలములో వేస్తుంటారు. స్కూల్ పరిసరాలంతా అపరిశుభ్రంగా ఉంటున్నాయి. అక్కడ ప్రజలకు పాఠశాల పక్కన చెత్త వేయరాదు, మీ పిల్లలే ఆటలు ఆడుకుంటారు, ఆ స్థలం శుభ్రంగా లేకుంటే మీ పిల్లలు అనారోగ్యం పాలవుతారు అని ఎంత చెప్పినా ఆ పల్లె ప్రజలు వినేవాళ్లు కాదు. ఆ బడి ప్రధానోపాధ్యాయులు ఒక ఉపాయం ఆలోచించారు. బడిలో ఉన్న ఉపాధ్యాయులంతా మరియు విద్యార్థులందరూ చందాలు వేసుకుని బడి పక్కన వినాయకుని గుడి కడదాము అన్నారు హెడ్ మాస్టారు. అప్పుడు చందాలు వసూలు చేసి ఆ మొత్తం సొమ్ముతో వినాయకుని ప్రతిష్టించి ఆలయం కట్టారు. ఇంకో మూడు రోజుల్లో వినాయక చవితి రానే వస్తుంది. అప్పుడు అందరూ వినాయకుని పూజిద్దాం రారండి!! అని ప్రతి ఇంటికి ఒక్కొక్క మట్టి వినాయకున్ని పంచుతూ గ్రామములో పెద్దలను, ప్రజలను, పిల్లలను ఆహ్వానించారు బడిలో ఉపాధ్యాయులు..
వినాయక చవితి రానే వచ్చింది. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని, ప్రకృతి మనకిచ్చిన పండ్లతో మరియు పత్రితో పూజించుకున్నారు.
ప్రజలంతా బడి దగ్గర వినాయక ఆలయానికి వచ్చి ఆ స్థలాన్ని పరిశుభ్రం చేసి ముగ్గులతో మరింత అందంగా తీర్చిదిద్దారు. అది చూసి బడిలో ప్రధానోపాధ్యాయులు సంతోషించి, గ్రామ పెద్దలను, ప్రజలను, విద్యార్థులను ఉద్దేశించి తన ఉపన్యాసాన్ని ఇలా మొదలుపెట్టారు.
మన భారతదేశంలో వినాయక చవితి మొదలుకొని ప్రతి పండగ మన సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు పర్యావరణహితమే.. మన పండగల పరమార్ధం.
పిల్లలకు, పెద్దలకు రంగురంగుల భారీ వినాయక ప్రతిమలు ఆకర్షించడం సహజం. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో రసాయనిక రంగులతో తయారు చేసే ఆ వినాయక విగ్రహాల వల్ల భూమికి చాలా చేటు జరుగుతుంది అని చాటి చెబుదాం. అందుకే మనమందరము మట్టి వినాయకుని పూజిద్దాము పర్యావరణాన్ని కాపాడుకుందాం.
 ఈనాటి కాలంలో మనము పర్యావరణాన్ని ఎంత రక్షిస్తే ప్రకృతి మనల్ని అంత గా రక్షిస్తుంది. ప్రకృతి అనగా నింగి, నేల, నీరు, నిప్పు,, గాలి, వీటన్నిటిని మనం కలుషితం చేయకూడదు. నేలని నీరుని అనేక ప్లాస్టిక్ వస్తువులతో నింపేస్తున్నాము. భూమిపైన చెట్లుని నరికేసి గాలిని కలుషితం చేస్తున్నాము. మన ఆరోగ్యాన్ని మన చేతులారా నాశనం చేసుకుంటున్నాము. ఇప్పటినుండి అలా జరగకుండా మొదట మన గ్రామం నుండి పరిసరాల శుభ్రత, పర్యావరణ రక్షణ మొదలుపెడదాం అన్నారు హెడ్ మాస్టారు. ఇప్పటినుండి మన గ్రామంలో ఇల్లు, వీధులు, రోడ్లు పరిశుభ్రంగా ఉంచుకుందాం. గాలి నీరు పంట పొలాలు తోటలు చెట్లు తో సస్యశ్యామలంగా మార్చుకుందాం. మన గ్రామంలో ప్రజల ఆరోగ్యంతో పాటు పరిశుభ్రతలో మొట్టమొదట స్థానంలో గ్రామాన్ని నిలబెడదాం. మన గ్రామాన్ని చూసి పట్టణాలు దేశం కూడా సస్యశ్యామలంగా మారాలని నా కోరిక. మన శారదాపురం గ్రామము పర్యావరణ రక్షణకు తొలిమెట్టు ఆది పూజ్యుడైన పార్వతీపుత్రుడు వినాయకుడు.. అంటూ మరలా ఇలా అన్నారు. మన భారతీయుల పండగలు, సంస్కృతి సంప్రదాయాలను చూసి విదేశీయులు చాలా గౌరవిస్తారు ఇదే మన భారతదేశం. ఇదే మన భారతీయత అని సగౌరవంగా చెప్పుకుందాం
"దట్ ఈస్ ఇండియా" అంటూ ఉపన్యాసాన్ని అందరి కరతాల ధ్వనుల మధ్య ముగించారు ప్రధానోపాధ్యాయులు గారు..
మట్టి వినాయకుని పూజిద్దాం
పర్యావరణాన్ని కాపాడదాం
ప్రకృతితో సన్నిహితంగా మెలుగుదాం
పిల్లలు, పెద్దలు రారండి!! మట్టి గణేశుని పూజిద్దాం
🙏.... జై గణేశా....🙏

---------------------------

కామెంట్‌లు