కాదేది కల్తీ - లోకమే కల్తీ ?;- శిరందాస్ శ్రీనివాస్-హైదరాబాద్-9441673339
నీతి కలుషితమై అవినీతి రాజ్యమేలుతుంది..
కల్తీ సామ్రాజ్యం మనుష్యుల్ని
కాటేస్తుందీ..

పీల్చే గాలి
తాగే నీరు
తినే ఆహారం
అన్నీ కల్తీ మయం..

పాలూ పెరుగూ
నూనే, తేనే 
పప్పులు, ఉప్పులు
పండ్లు ఫలాలు
పండించే కూరగాయలు 
మద్యం, మాంసం
మందులు, మాకులు 
వైద్యం సేద్యం
అన్నీ కల్తీయే..

పలకరింపులు 
పరామర్శలు
ఊరడింపులు, 
మెచ్చుకోల్లు
ప్రేమలు, ఆప్యాయతలు
చిరు నవ్వులు
అవార్డులు రివార్డులు
సత్కారాలు, సన్మానాలు
చివరికి సంసారాలు
అన్నీ కల్తీనే ...

యజ్ఞాలు యాగాలు
భజనలు ఉత్సవాలు
ధర్నాలు ఉద్యమాలు
ఆరోణలు ప్రత్యారోపణలు
ప్రసంగాలు హామీలు 
బోధనలు  రోదనలు
శోధనలు పరిశోధనలు
అన్నీ కల్తీయే..

మచ్చుకన్న కానరాని మానవత్వం
ఎదుటి వారి మేలుకోరని పైత్యం
స్వార్థంతో నిలువెల్లా కుతంత్రం
ఒకడు ఇంకోకడిని దోచుకునే ప్రయత్నం...

మోసం.. శృంఖలమై
ప్రతి వాడు మోసపోతున్నా
దగా దగా కుడి ఎడమల దగా
అయినా అదుపు చేయలేని నిఘా..
మనుష్యుల్లో మేల్కోని చైతన్యం..
అధికారుల అలసత్వం
ప్రభుత్వపు నిర్లక్షం 
చేష్ఠలుడిగిన ప్రతిపక్షం
విమర్శించని విపక్షం
ప్రశ్నించని పత్రికలు 

ఎందుకంటే ఈ లోకమే కల్తీ..
మానవుడే నిలువెత్తు కల్తీ..
కలియుగంలో అంతా కల్తీ..
కనికరమే లేని కల్తీ.. 
కాటేయడమే దాని వృత్తి..


కామెంట్‌లు