హరిత గణపతి;- ల్యాదాల గాయత్రి 9949431849

 టింగ్ టింగ్ టింగ్..అలారం మోతతో కళ్ళు విప్పింది ప్రణీత.ఉదయం ఐదు గంటలకే నిద్రలేవడం అలవాటు.అయినా సరే అలారం మోగాల్సిందే.అలారం ఒక భరోసా.లేదంటే ఎక్కడ తెల్లారి పోతుందో అనే ఆందోళనతో నిద్దరే పట్టదు.శ్రీవారు ప్రైవేట్ ఉద్యోగి.తాను ప్రైవేటు స్కూల్ టీచర్ గా పనిచేసేది.ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జీతాలివ్వలేక మూసేశారు.ఇద్దరు మగపిల్లలు. పిల్లలిద్దరూ చదువులో చురుకైనవారే సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటుంటారు.పెద్దవాడు అనిల్ ఆరోతరగతి,చిన్నవాడు వినీల్ నాల్గోతరగతీ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు.
             ఉదయం పనులన్నీ తానే చేసుకుంటుంది.వంటగదిలోకి భర్త ధీరజ్ వచ్చి,
"ఏమోయ్! బాక్స్ పెట్టేశావా త్వరగా వెళ్ళాలి "అన్నాడు.
     "ఇదిగో పెట్టేశానండి"..అంది వేడి వేడి ఉప్మా ప్లేటు చేతికందిస్తూ..
        "సరేగాని వినాయకచవితి వస్తుంది.కొనాల్సిన వస్తువులేమయినా ఉంటే లిస్ట్ రాసివ్వు వచ్చేటపుడు తెస్తాను అన్నాడు "ధీరజ్,
    ఇంతలోనే అనిల్ కళ్ళు నులుముకుంటూ వచ్చి,
  "నాన్నగారూ ! గణపతి విగ్రహం తేవడం మర్చిపోకండి"..అన్నాడు.
వెంటనే ప్రణీత " లేదునాన్నా !ఈ సారి మనమే హరిత గణపతిని ఇంట్లోనే తయారు చేద్దాం", అన్నది.
     " భలే భలే ! సరే అమ్మా !తమ్మున్ని కూడా పిలుస్తాను.." అంటూ ఉత్సాహంగా వెళ్ళాడు బెడ్ రూం లోకి..
    "సరే ప్రణీత నే వెళ్ళొస్తా..!" అంటూ ధీరజ్ వెళ్ళాడు.
    పిల్లలిద్దరూ అన్ని పనులూ పూర్తిచేసుకొని వచ్చారు, "అమ్మా మేం రెడీ.."అంటూ.
      ఇద్దరికీ టిఫిన్ తినిపించి ,పాలు తాగించింది.అమ్మా తొందరగా చెప్పు హరిత గణపతిని ఎలా తయారు చేయాలి అంటూ..
    "ఆగండి పిల్లలూ వస్తున్నా.మనం పెరట్లో కి వెళ్దాం పదండి " అంటూ తీసుకెళ్లింది ప్రణీత.
      "అనీల్ నువ్వు వెళ్ళి పెరట్లో నల్లమట్టి కుండిలో వేసిపెట్టాను తీసుకురా "అని పురమాయించింది.ఒక గిన్నెలో తులసి విత్తనాలు తీసుకొని వచ్చింది.మట్టిని చిన్న చిన్న ఉండలుగా తయారు చెయ్యండి ..అనగానే పిల్లలిద్దరూ ఉత్సాహంగా చేశారు.ఆ మట్టి ముద్దల మధ్య తులసి విత్తనాలు చల్లుతూ,గణపతి విగ్రహాన్ని తయారుచేశారు.
   " పిల్లలూ ఇప్పుడు చూశారుగా రేపు వినాయకచవితికి ఈ గణపతికి మనం పూజ చేస్తున్నాం.అంది ప్రణీత.
 పండుగ రోజు నుండి వినాయకుడికి తొమ్మిది రోజులు నీటితో అభిషేకం చేస్తూ,పూజచేయడం వలన విత్తనాలు మొలకెత్తి ,గణపతి హరిత వర్ణంలోకి మారాడు.
    పిల్లల ఆనందానికి అవధుల్లేవు."ఇదివరకైతే వీధిలో ఉన్న గణపతి మండపంలో పెట్టేసేవాళ్ళం.ఇప్పుడు మనమే మన పెరటిలోని ఖాళీ పూలతొట్టిలో నీళ్ళుపోసి నిమజ్జనం చేద్దాం" అంది ప్రణీత.
గణపతి బప్పా మోరియా..
హరిత గణపతికీ జై.. ఆరోగ్యప్రదాతాకీ జై.. అంటూ జేజేలతో కుటుంబ సభ్యులంతా 
నిమజ్జనం చేశారు.
  వారం తిరిగేసరికి ఆ కుండీలో తులసీవనం వెలసి ఆరోగ్యాన్నీ,ఆనందాన్నీ పంచింది ఇంటిల్లి పాదికీ..
     
కామెంట్‌లు