అందము! అందము!!;- -గద్వాల సోమన్న,-9966414580.

తోటకు అందము పూవులు
పాటకు అందము పదములు
మింటికి అందము తారలు
ఇంటికి అందము బాలలు

నోటికి అందము పెదవులు
ఏటికి అందము జలములు
కోటకు అందము బురుజులు
మాటకు అందము విలువలు

మేనుకు అందము దుస్తులు
చెలిమికి అందము దోస్తులు
పుడమికి అందము మనుజులు
పగటికి అందము వెలుగులు

కొలనుకు అందము కలువలు
నెమలికి అందము ఈకలు
చిలుకకు అందము పలుకులు
గృహముకు అందము వనితలు

స్త్రీలకు అందము కోకలు
మనిషికి అందము మమతలు
తరువుకు అందము ఆకులు
గురువుకు అందము శిష్యులు

చేపకు అందము పొలుసులు
చేనుకు అందము పంటలు
కనులకు అందము రెప్పలు
మోముకు అందము నగవులు


కామెంట్‌లు