పరమానందయ్య శిష్యులు-గురువుగారి కాళ్ల నొప్పి;- డా. భోజన్నగారి అనసూయ-నిజామాబాద్.99898 22494.
 పరమానందయ్య శిస్యుల పూర్వ వృత్తా0తం తెలుసుకుందామా! పూర్వం అరుణ మహర్షి అనే గురువు గారి దగ్గర పదమూడు మంది శిష్యులు ఉండేవారు. ఆ శిష్యులు ఇతరులకి ఎప్పుడూ అపకారం చేయరు. జీవులను హింసించరు. నమ్మినవారిని మోసగించే గుణం పిసరంత కూడా లేదు.చాడీలు అసలే చెప్పరు.పరస్త్రీలను మోహించరు. పొద్దస్తమానం వారు-వారి పనులు-గురువుగారు చెప్పిన పాఠాలు.అవి తప్ప ఆ పదమూడు మంది శిష్యులకు వేరే ప్రపంచమ్ అంటే ఏమిటో తెలియదు. 
  ఒకనాడు దేవకన్యలు భూలోకానికి వచ్చి,ఒక జలాశయంలో స్నానాలు చేస్తున్నారు. అక్కడికి వచ్చిన ఈ పదమూడు మంది శిష్యులు ఆ దేవకన్యలని వింతగా కళ్ళప్పగించి చూస్తున్నారు.వీరి ప్రవర్తనకు కోపగించిన ఆ దేవకన్యలు “మీరు బుద్ధిహీనులై పొండి” అని శపించారు.అప్పుడు అక్కడికి వచ్చిన అరుణ మహర్షి తన శిష్యుల అమాయకత్వాన్ని తెలియపరచి శాపవిముక్తి పొందే విధానం చెప్పమని ఆ దేవకన్యలని  అడిగాడు.”శంకరుని దయవలన శాపవిముక్తి కలుగుతుంది”అని చెప్పి ఆ దేవకన్యలు మాయమయ్యారు.
అంతట శిష్యులు అరుణమహర్షి ఆశీస్సులు పొంది, దేశసంచారం చేస్తూ,పరమానందయ్య అనే పేరున్న గురువుగారి దగ్గర శిష్యులుగా చేరారు. అమాయకులైన వారి గురువుగారు కూడా పాపం ఒక పిచ్చిమారాజు. ఆయనకు ఏనాడూ కోపమన్నది రాదు.పగ అన్నది తెలియదు.అంత సహనం,ఆదరణ,దయ ఇంకెవరిలో కనిపించవు.శిష్యులందరికి గురువుగారంటే మితిమీరిన భక్తి.ఆయన ఏ పని చెప్పినా పదమూడు మంది కలిసి వెంటనే చేస్తుండేది.ఈ గురువు-శిష్యుల కథలు ఎన్నో తరతరాలుగా పిల్లల్ని పెద్దల్ని అలరిస్తూనే ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే కదా!అందులోనుంచి ఒక కథ ఇప్పుడు మనం చూద్దాం.
ఒకరోజు గురువుగారు ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు.వెంటనే శిష్యులు పరుగెత్తుకువెళ్లి ఆయన కాళ్ళు చేతులు పట్టడం ప్రారంభించారు ఒక శిష్యుడు తాను పట్టుకున్న కాలే గొప్పదని అన్నాడు. ఇంతలో ఇంకొక శిష్యుడు తాను పట్టుకున్న కాలే ఇంకా మంచిదని వాదించాడు. ఇలా వాదిస్తూ శిష్యులు గురువుగారి కాళ్ళని కొట్టటం ప్రారంభించారు.పాపం గురువుగారు అవి తన కాళ్ళని ఎంత మొత్తుకున్న  వినిపించుకోలేదు.మిగతా శిష్యులు వాళ్ళ చర్యని ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు. నీ కాలు నరికేస్తానంటే నీ కాలు నరికేస్తానని కత్తులు తెచ్చి గురువుగారి కాళ్ళు నరికేయడానికి సిద్ధపడ్డారు. అప్పుడు గురువుగారి భార్య పరుగెత్తుకువచ్చి ఆ శిష్యులని తరిమికొట్టింది.
       
                       


కామెంట్‌లు