సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -245
వాతాది న్యాయము
*****
వాతః అంటే గాలి.పిత్తః అంటే ధాతు విశేషము, పైత్యం.కఫము అంటే శ్లేష్మము.
వాత పిత్త కఫములు అని అర్థం.
వాత,పిత్త శ్లేష్మములు పరస్పర విరుద్ధములు ఐనప్పటికీ ఈ మూడు కలిసి శరీరమును రక్షిస్తాయి. వీటిల్లో ఏది హెచ్చుతగ్గులుగా వున్నా  శరీరానికి యిబ్బంది కలుగుతుంది.
మానవ శరీరం వాత పిత్త కఫములచే నిర్మింపబడింది. ఈ మూడింటి పనితీరును బట్టి మనిషి యొక్క మానసిక ,శారీరక ఆరోగ్యం ఉంటుంది.
మనం ఏదైనా పని చేయాలంటే  శక్తి,బలం అవసరం. అయితే అందరికీ ఒకేరకమైన శక్తి, సామర్థ్యాలు ఉండవు. అది వారి వారి శరీర ధర్మాన్ని అనుసరించి ఉంటుంది. అలా శరీర ధర్మాలను కలిగి వుండటానికి కారణం వాత పిత్త ,కఫ,శక్తులే.
ఆయుర్వేదంలో వీటిని దోషాలుగా పరిగణిస్తారు.మానవ శరీరం పంచభూత నిర్మితమని మనకు తెలుసు కదా!.
ఆ పంచభూతాల్లో ఒకటైన గాలికి సంబంధించినది 'వాతం '.అగ్నికి సంబంధించినది 'పిత్తం'. నీటికి సంబంధించినది 'కఫం.'
ఇక వీటి పని విధానం తెలుసుకుందాం.
'వాతం' అంటే గాలి ఇది శరీరంలోని అన్ని కదలికలను నియంత్రించే శక్తి.శ్వాసించడం,గుండె కొట్టుకోవడం, కండరాల సంకోచం,కణజాలాల కదలిక, మనసుతో పాటు నాడీ వ్యవస్థకు సంబంధించిన పని తీరుగా చెప్పుకోవచ్చు.
ఆకలి, దాహం, నిద్ర, విసర్జన క్రియ వంటి వాటికి వాతం/ గాలి బాధ్యత వహిస్తుంది.
ఇక రెండవది 'పిత్తం' ఇది నాభి పై ఉదర భాగంలో ఉంటుంది. అగ్ని తత్వమైన పిత్తశక్తి జీవక్రియకు, జీర్ణ వ్యవస్థకు బాధ్యత వహించి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
ఇక మూడవది అయిన  'కఫం' లేదా శ్లేష్మము  జల తత్వానికి సంబంధించినది.ఇది ఛాతి భాగంలో  వుంటుంది.శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి బలాన్ని, స్థిరత్వాన్ని, తేజస్సును, శక్తిని పెంచడానికి,చర్మ సౌందర్యానికి 'కఫం' బాధ్యత వహిస్తుంది.
ఈ విధంగా  మూడు శక్తులైన వాత, పిత్త ,కఫాలు    శారీరక మానసిక లక్షణాలను ప్రభావితం చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.  ఈ మూడు సమన్వయంతో పని చేస్తే మనిషి మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు.
ఒక్కటి గానీ , రెండు గానీ సరిగా లేకపోతే, మిగతా వాటి ప్రభావం ఎక్కువై  మనిషి యిబ్బంది పడాల్సిందే.
దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే ఇవి ప్రకృతి యొక్క శక్తివంతమైన చిహ్నాలనీ, మనల్ని మనం అర్థం చేసుకోవడంతో పాటు మన చుట్టూ ఉన్న వారిని గురించి తెలుసుకోగలం.
"వాతాది న్యాయము"లో చెప్పబడిన  వాత పిత్త కఫ శక్తుల రూపంలో ఉన్న వ్యక్తులతో స్నేహం చేసేటప్పుడు వారి వారి లక్షణాలను బట్టి  ఎవరెవరు ఎలాంటి వారో వారి  మానసిక శారీరక స్థితిని ఏశక్తి ఎక్కువగా ప్రభావితం చేస్తుందో అవగాహన చేసుకోవచ్చు.
ఇంతే కాకుండా  విద్యార్థుల శారీరక మానసిక నిర్మాణం గురించి తెలుసుకొని, తద్వారా   వారిలో ఈ శక్తుల సమతుల్యత -లోపాలు ఏమైనా ఉంటే తెలుసుకుని సరిచేసేందుకు ఉపాధ్యాయులకు ఎంత గానో ఉపయోగపడుతుంది.
ఇదండీ "వాతాది న్యాయము"యొక్క కథా కమామీషు. కాదేదీ కవిత్వానికి అనర్హం అన్నట్లు. మన పెద్దలు  న్యాయాలలో ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించిన న్యాయాన్ని కూడా చేర్చడం విశేషం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు