సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -259
వీచి తరంగ న్యాయము
**********
వీచి అంటే అల,అవకాశము , కొంచెము, సుఖము, వెలుగు అనే అర్థాలు ఉన్నాయి.తరంగము అంటే ఒక గ్రంథ భాగము,అల,దుముకు,గంతు, కదలుట అనే అర్థాలు ఉన్నాయి.
వాయువు లేదా గాలి వల్ల సముద్రంలో మొదట చిన్న చిన్న తరంగములు/ అలలు పుట్టి క్రమక్రమంగా అవి ఒకదానితో ఒకటి కలుస్తూ చివరకు పెద్ద పెద్ద కెరటాలుగా/ అలలుగా తయారవుతాయి.
అలాగే ఆకాశములో పుట్టిన శబ్దము గాలితో కలిసి విస్తృతంగా వ్యాపించి  క్రమ క్రమంగా అతి పెద్ద శబ్దముగా మారి చెవులకు చేరుతుంది.
అంటే ఒక విషయము ముందు స్వల్పముగా మొదలై ఉత్తరోత్తరంగా అంటే  పైపైన అంతటా వ్యాపించుటను ఈ న్యాయముతో పోలుస్తూ ఉంటారు.
పూల చెట్లలో కూడా  ఒక మొగ్గ విచ్చుకోవడం మొదలు పెడితే మిగతా అన్ని మొగ్గలు చకచకా విచ్చుకోవడం  చూస్తుంటాం.
ఇలా  ఒక అల కానీ, శబ్దము కానీ,పూలు కానీ, ఏదైనా విషయం కానీ నెమ్మది నెమ్మదిగా మొదలై క్రమంగా అంతటా విస్తరించే సందర్భంలో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు. 
దీనికి చక్కని ఉదాహరణ బమ్మెర పోతన గారు రచించిన వామనావతారం ఘట్టంలోని  ఇంతింతై అనే పద్యం. శ్రీమహావిష్ణువైన వామనుడు త్రివిక్రముడై పెరిగిపోయే దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్లు అత్యంత అందంగా,సహజ సుందరంగా వర్ణించారు పోతనామాత్యుడు.దీనిని ఆసాంతం చదివి ఆనందిద్దాం.
"ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపై/ నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై/ నంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపై/నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై"
అనగా బలి చక్రవర్తి నుండి  మూడడుగుల నేలను దానంగా స్వీకరించిన తర్వాత  దానిని పొందే  సమయంలో ఒక అడుగును భూమిపై మోపి,రెండో అడుగుతో బ్రహ్మాండాన్ని ఆక్రమించడం కోసం ఆకాశాన్ని, మబ్బుల్ని, సూర్య చంద్రులను,ధృవుని మహాలోకాలన్నింటినీ దాటిపోతూ పెరిగిపోయాడు. అంతకు ముందు వరకూ కండ్ల ముందు నిలుచున్న  బ్రహ్మచారి బాలకుడైన  వామనుడు క్రమక్రమంగా ఎదిగి ముల్లోకాలను ఆక్రమించేటంతగా ఎదిగి పోవడం చూసి బలి చక్రవర్తి, మునులు,శుక్రుడు మొదలైన వారంతా నివ్వెరపోయారట.
మరి ఈ పద్యానికి  మనం చెప్పుకుంటున్న న్యాయానికి ఏం సంబంధం అని అనిపించవచ్చు కానీ అలలు, శబ్దాలు, పూలు మొదలైనవే కాకుండా మనిషి యొక్క అభివృద్ధి, ఎదుగుదల ఆ విధంగా చకచకా /వేగంగా విస్తరిస్తున్నప్పుడు" వీచి తరంగ న్యాయము"తోనో  ఈ"ఇంతింతై వటుడింతై.." అనే పద్యంతోనో  పోల్చడం పరిపాటి.
ఒక వ్యక్తి  క్రమంగా తన యొక్క స్వయం కృషితోనో, ప్రతిభతోనో  నెమ్మదిగా  ఎదగడం లేదా పరిచయం కావడం మొదలైన తర్వాత   అతడి పేరు పత్రికలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచానికి తెలిసిపోతుంది.
 మనం మంచీ చెడూ పనులు, సమాజ హితమైనవి కానీ తలపెట్టినప్పుడు వాటిని  ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేకుండానే వాటంతట అవే క్రమక్రమంగా సమాజంలో ఎలా విస్తరిస్తాయో ఈ "వీచి తరంగ న్యాయము"ద్వారా గ్రహించవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు