నానుడి కథలు ౼ డా.దార్ల బుజ్జిబాబు

ఉత్తర కుమార ప్రజ్ఞలు
------------------------------- 
          చేయటం చేతకాకపోయినా, సమర్థత లేకపోయినా, చేయగలను అంటూ చేసి చూపిస్తానంటూ బడాయి మాటలు చెప్పే వారిని ఈ నానుడితో పోల్చడం రివాజు. ఉత్తరకుమార ప్రజ్ఞలు, ఉత్తర కుమార ప్రగల్భాలు  అని వాడే ఈ నానుడి మహా భారత కథ ఆధారంగా ఉత్పత్తి అయింది. వాడు చెప్పేవన్నీ అలవికానివే అని అందరికీ తెలుస్తున్నా,  వాడి గొప్పల కోసం వాగే వాగుడే ఈ ఉత్తర కుమార ప్రగల్భాలు. ఈ వాగుడుకు  అందరూ నవ్వుకుంటారు తప్ప ఎవరు ఆశ్చర్యపోరు.
       పాండవులు వనవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసంలో  విరాటుని కొలువులో ఉంటారు. విరాటరాజు కుమారుడే ఉత్తరుడు. ఇతడు ఎప్పుడు బడాయి మాటలు చెబుతూ ఉండే పిరికివాడు. ఆడవాళ్ళ ఎదుట  అతడో వీరుడుగా, గొప్పవాడుగా చిత్రీకరించుకునేందుకు అలవికాని మాటలు చెబుతూ ఉంటాడు. అతడి మాటలకు ఆడవాళ్లు ముసిముసిగా నవ్వుకుంటారు. అతడి బడాయి మాటలు అంత హాస్యంగా ఉండేవి. కౌరవులను జయించటం తనకో లెక్క కాదని, కాకపోతే తనకు సరైన రథసారథి లేడు అని ఆడవారి ముందు ప్రగల్భాలు పలికి  అబాసుపాలు అవుతాడు. ఈ సందర్భాన్ని సూచిస్తూ ఈ నానుడి వాడతారు. కౌరవులంటే మాటలు కాదు. వారు వీరాధివీరులు.  అలాంటివారిని ఉత్తరుడులాంటి చవట ఓ పిరికివాడు జయించగలడా?  లేడు. కానీ జయించగలనని గొప్పలు చెప్పడం విడ్డూరమైన విషయం. ఇలాంటి అలవికాని, విడ్డూరమైన,  బడాయి మాటలు చెప్పే వారిని ఉత్తరకుమారప్రజ్ఞలు అని పోల్చేటప్పుడు ఈ నానుడిని ఉపయోగిస్తారు.
         ఒకడి వ్యక్తిత్వాన్ని మొత్తం వివరించి చెప్పకుండా,  అతడి గుణం మొత్తం ఒక్క ముక్కలో చెప్పాలంటే,  వాడు ఉత్తర కుమారునిలా బడాయి మాటలు చెబుతుంటే,  వాడిని ఉత్తర కుమార ప్రజ్ఞ  నానుడితో పోల్చడం జరుగుతుంది.
కామెంట్‌లు