నానుడి కథలు ౼డా.దార్ల బుజ్జిబాబు

 కొండవీడు చాంతాడు
===============
      ఇది చారిత్రిక ఆధారంగా వచ్చిన కథ. ఏదైనా  చాలా పొడవుగా ఉండేదాన్ని, ఎంతకు తరగని దాన్ని గురించి చెప్పేటప్పుడు  ఈ కొండవీడు చాంతాడు నానుడి ప్రయోగిస్తారు.  ఈ జాబితాలో పేర్లు కొండవీడు చాంతాడు అంత ఉన్నాయి అనీ, అతడి ఉపన్యాసం కొండవీడు చాంతాడులా సాగింది అని చెప్పడం మనం వింటూ ఉంటాం. అసలు ఈ నానుడి ఎలా వచ్చిందో చూద్దాం.
   బావులలో నుండి నీటిని తొడటానికి బకేట్ కు కట్టే తాడును చాంతాడు అంటారు. చేదే తాడు చెంతాడు. నీటిని తొడటమే చేద. కొండవీడు కొండలు 1600 అడుగుల ఎత్తులో  వుంటాయి. మరి ఆ కొండలపై వుండే బావులలో నీరు చాలా లోతులో ఉంటాయి. వాటిని తోడాలంటే  చాలా పొడవైన తాడు కావాలి. కాబట్టి పొడవైన వాటిని గురించి పోల్చేటప్పుడు "కొండవీడు చెంతాడు" నానుడితో పోల్చుతారు. 
      ఉద్యోగానికి  వచ్చిన అభ్యర్థుల వరుస కొండవీటి చెంతాడులా ఉంది అని అనటం మనం వింటూ ఉంటాం. ఇక్కడ చాలా మంది ఉన్నారని, పెద్ద వరుస ఉందని అర్ధం చేసుకోవొచ్చు.
    రెడ్డిరాజ్య స్థాపకుడు ప్రోలయ వేమారెడ్డీ అద్దంకిని రాజధానిగా చేసుకుని పాలించాడు. అనంతరం 1353 లో అతని దత్తు కుమారుడు అనపోతారెడ్డి అద్దంకిని  వదిలి కొండవీడును రాజధానిగా చేసాడు.  శత్రువుల దాడులు తట్టుకోవడం కోసం రాజధాని మార్చవలసి వచ్చింది.  ప్రజలకు అవసరమైన ప్రాధమిక సౌకర్యం మంచినీరు, సాగునీరు. అందుకు అవసరమైన బావులు త్రవ్వించాడు. అవి చాలా లోతుగా ఉండేవి. పొడవైన తాడు కావలసి వచ్చేది. అందువల్ల అప్పటి నుండి ఈ కొండవీడు చాంతాడు అనే నానుడి వాడుకలోకి వచ్చినట్టు తెలుస్తుంది.  ఈ సమస్యను అధిగమించటం కోసం మూడు పెద్ద చెరువులు త్రవ్వించి వర్షపు నీటిని నిల్వ ఉంచి  కొండపైన మైదానంలో  పంటలు పండించినట్టు చరిత్ర చెబుతుంది.  ఇది ఈ కొండవీడు చాంతాడు కథ.
కామెంట్‌లు