గొంతెమ్మ కోర్కెలు
-------------------------
కొంతమంది తమ స్థాయిని మరిచి అలవికాని కోరికలు కోరుకుంటూ వుంటారు. అవి తీరే కోరికలు కాదని వారికి తెలుసు. అయినా గొప్పగా ఊహించుకుంటూ స్వర్గానికి నిచ్చెనలు వేస్తారు. వారికి వారు తృప్తిపడుతూ వుంటారు. ఆ కోరికలు వారి వరకు ఉంటే పర్వాలేదు. అవి హద్దులుదాటితేనే ప్రమాదం. ఆ కోరికలు వేరేవారు వింటే ఎగతాళి చేస్తారు. ఉట్టెక్కలేనమ్మ స్వర్గానికి పోయినట్టు అంటూ అవహేళన చేస్తారు. అలవికాని, సాధ్యంకాని కోరికలనే 'గొంతెమ్మ కోర్కెలు' అంటారు. ఈ నానుడి కూడా పురాణ కథల నుండే పుట్టింది.
పాండవులు జూదంలో ఓడిపోయారు. సర్వం పోగొట్టుకున్నారు. అరణ్యవాసానికి వెళ్లిపోయారు. వారితో పాటు భార్య పాంచాలి కూడా వెళ్లింది. వారి తల్లి కుంతి మాత్రమే హస్తినలో ఉండిపోయింది. అయితే ఇప్పుడు ఆమె రాజమాత కాదు. రాజభోగాలు లేవు. కేవలం సామాన్యురాలు. నిరంతరం పుత్రులు గురించే ఆలోచిస్తూ ఉండేది. వారి అరణ్యవాసం, అజ్ఞాత వాసం పూర్తిచేసుకుని ఎప్పుడు వస్తారా? అని ఎదురు చూస్తూ ఉండేది. వారి భవిష్యత్తును గొప్పగా ఊహించుకునేది. వారు రాజభోగాలు అనుభవిస్తున్నట్టు, రాజమాతగా తాను అందరిని శాసిస్తున్నట్టు కలలు కనేది. వారి తండ్రులైన దేవతలు వారిని ఆశీర్వదించాలని, సకల సంపదలు సమకూర్చాలని, ఇలా ఏవేవో కోరికలు కోరుతూ ఉండేది. 'ఆలులేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం' లాగా, ఉండేది ఆమె పరిస్థితి.
ప్రస్తుతం ఆమె స్థితిగతులు వేరు. దిక్కులేని అనాధ. సంపాదనలేదు. అధికారంలేదు. రేపు ఏమవుతుందో తెలియని స్థితి. కౌరవులు కక్ష్య భూనారు. పాండవులను భూమిమీద లేకుండా చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆమె ఆకాశానంటే కోరికలు కోరుకుని ఆనందించేది. ఒకవేళ పాండవులు తిరిగివచ్చిన ఆమె కోరే కోరికలు చాలావరకు నెరవేరే అవకాశాలు లేవు. అలాంటి కోరికలు ఆమెవి. కుంతి కోరే కోరికలకు అందరూ ఆశ్చర్యపడేవారు.
ఇలాంటి తీరటానికి వీలులేని, అలవికాని కోరికలను కోరేవారిని, కుంతెమ్మ కోరికలు అనటం ఆనాటి నుండే వాడుకలోకి వచ్చింది. అలా కాలక్రమంలో కుంతెమ్మ కాస్తా గొంతెమ్మగా మారి గొంతెమ్మ కోర్కెలు నానుడిగా స్థిరపడింది. ఇది ఈ గొంతెమ్మ కోర్కెలు నానుడికథ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి