నానుడి కథలు ౼డా.దార్ల బుజ్జిబాబు

 వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు
-----------------------------------------------------
     దేవుడంతటి వాడైనా అవసరం వస్తే  నీచమైన వాళ్ళ కాళ్ళు పట్టు కోవాల్సిందే అనే విషయాన్ని చెప్పేటప్పుడు ఈ  నానుడి వాడతారు. ఇది కూడా పురాణ కథల నుండి వచ్చిన నానుడి. అవసరం వచ్చినప్పుడు ఎంతడి నీచమైన పనైనా చేయాలి. తప్పదు. వసుదేవుడు శ్రీకృష్ణుని తండ్రి. అంటే దేవుడి తండ్రి. అతడు కూడా దేవునితో సమానమే. అలాంటి వాడే ఒకానొక సందర్బంలో జంతువులలోనే నీచంగా చూడబడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అవసరం ఎలాంటి పనినైనా చేయిస్తుంది. మరి ఈ కథ ఏమిటో చూద్దాం.
      వసుదేవుడు, కంసుడి పెదనాన్న కూతురు దేవకిని పెళ్లాడి రథంపై తీసుకు వెళుతున్నాడు. అదే రథంపై కంసుడు కూడా ఉన్నాడు. కంసుడు రాక్షస సంతతికి చెందినవాడు. ఆ సమయంలో ఆకాశవాణి  "కంసా! నీవు ఈ వాసుదేవ దేవకీకి పుట్టిన ఎనిమిదవ సంతానం  చేతిలో హతుడవు అవుతావు" అంది. వెంటనే కంసుడు దేవకిని చంపబోయాడు. వసుదేవుడు వారించి "మాకు పుట్టిన ప్రతి బిడ్డను నీకు అప్పగిస్తాము. వారిని చంపుకో.  దేవకిని వదిలేయి" అని ఒప్పందం చేసుకున్నాడు. అన్నట్టుగానే పుట్టినవారిని పుట్టినట్టుగా ఏడుగురు ( కీర్తి మంతుడు, సుషేణుడు, భద్రసేనుడు, ఋజువు, సమదనుడు, భద్రుడు, సంకర్షనుడు)  కొడుకులను వరుసగా కంసునికి అప్పగించాడు. కంసుడు ఆ పసి బిడ్డలను కనికరం లేకుండా చంపేశాడు. 
        ఒకసారి నారదుడు భూలోక సంచారం  చేస్తూ కంసుడిని కలిసాడు. "అయ్యా! మీరు రాక్షస సంతతికి చెందిన వారు. నీ చెల్లెలు దేవకి కడుపున  స్వయానా ఆ విష్ణుమూర్తి పుట్టబోతున్నాడు. ఆయన చేతిలో నీ చావు తప్పదు" అని గుర్తు చేసి వెళ్ళాడు. కంసుడు ఉగ్రుడయ్యాడు. దేవకి, వసుదేవుడిని చెరసాలలో వేసాడు. వారికి సంకెళ్లు వేసి బంధించాడు. అనేకమంది కాపలదారులను  నియమించాడు.  ఒక అర్ధరాత్రి వేళ దేవకి చేరసాలలోనే ప్రసవించింది. పండంటి పిల్లవాడు పుట్టాడు. వెంటనే కాపాలవారు మూర్ఛపోయారు. దేవకి వసుదేవుల సంకెళ్లు తెగి పోయాయి. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. పిల్లవాడు పుట్టిన సంగతి తెలిస్తే కంసుడు పిల్లవాడిని చంపేస్తాడు. అందుకని వసుదేవుడు పిల్లవాడిని గంపలోపెట్టుకుని అర్ధరాత్రిలోనే బయటపడ్డాడు. వ్రేపల్లెలో యశోద అనే ఇల్లాలు  ఓ ఆడ శిశువు జన్మనిచ్చినట్టు తెలుసుకున్నాడు. అక్కడ పిల్లవాడిని పెట్టి ఆ ఆడశిశువును తెచ్చి కంసుడికి చూపించాలి  అనుకున్నాడు.  చెరసాల నుండి బయటకు రాగానే  అక్కడ  ఉన్న ఓ గాడిద ఒండ్రు పెట్టడం మొదలు పెటింది. ఆ శబ్దానికి ఎవరైనా భటుడు మేల్కొవొచ్చు. తనను కనిపెట్టవొచ్చు. వెంటనే వసుదేవుడు వెళ్లి  "అరవకు తల్లి నీ కాళ్ళు పట్టుకుంటాను" అని దాని కాళ్ళుపట్టుకుని బ్రతిమిలాడాడు. ( తరువాత యశోధకు బిడ్డను అప్పగించి, ఆడ శిశువును తెచ్చుకుంటాడు వసుదేవుడు. యశోద వద్ద పెరిగిన ఆబిడ్డడే  శ్రీకృష్ణుడు. ఆ తరువాత అతడే కంసుడిని చంపుతాడు)
     అప్పటినిండి ఎంతటి మొనగాడైన అవసరాన్నిబట్టి నీచుడు కాళ్ళు పట్టుకోవాలి అనే సందర్భాన్ని ప్రస్తావించాల్సి వస్తే  "వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు" అని "వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు" అనే నానుడి వాడకంలోకి వచ్చింది.
కామెంట్‌లు